‘రోటి, కపడా, ఔర్ మకాన్’ ఎవరు అవునన్నా, కాదన్నా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇదో నినాదం. ప్రజలకు వీటిని సమకూర్చడం పాలకుల కనీస బాధ్యత. ఇవి అందుబాటులో ఉన్నప్పుడే ఏ కుటుంబమైనా అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేయడానికి ఉపక్రమిస్తుంది. వీటిని విస్మరించి, గ్రాఫిక్స్‌తో ఎన్ని మేడలు కట్టినా అవి నీటి మూటలేనని చరిత్ర చెబుతోంది. ప్రజల ఆనందాన్ని, వారి బాగోగులను చూసి ఆనందించే వాడే అసలైన పాలకుడని కూడా చరిత్ర వెల్లడిస్తోంది. తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు బాసటగా నిలిచినప్పుడే ప్రజా రంజక పాలన అనిపించుకుంటుంది.
విద్య, వైద్యం, వ్యవసాయం.. ఈ మూడు రంగాల్లో చేయూత అందిస్తే చాలు, ప్రజలు స్వయం సమృద్ధి దిశగా అడుగులేస్తారని విశ్వ వ్యాప్తంగా విఖ్యాత ఆర్థిక నిపుణులు నొక్కి వక్కాణిస్తుండటం తరచూ వినిపిస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభ్యున్నతికే ఎన్నో దేశాలు, రాష్ట్రాలు సతమతం అవుతున్న వేళ.. ఇంతకు మించిన సంక్షేమాభివృద్ధిని సాకారం చేస్తూ మన రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది. నవరత్నాల పథకాలు, సప్త స్వరాల్లాంటి థీమ్‌ల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన జీవనాన్ని అందించాలనే తపన, తాపత్రయం.. బడ్జెట్‌లో కళ్లకు కడుతోంది.
సాక్షి, అమరావతి: సాధారణ ఎన్నికలకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రూపుదిద్దుకుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2024 – 25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను బుధవారం అసెంబ్లీకి సమర్పించారు. ద్రవ్యలోటు, రెవెన్యూ లోటును తగ్గించేందుకు ప్రయత్నం చేసిన ఆర్థిక మంత్రి మేనిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాల అమలు ద్వారా గత ఐదేళ్లలో సాధించిన ప్రగతి, ఫలితాలు, సంక్షేమాన్ని బడ్జెట్ ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు.
కొత్త ఆలోచనలు, వినూత్న విధానాలను అమలు చేయడం ద్వారా అతి తక్కువ వ్యవధిలో ప్రభుత్వం సంతృప్త స్థాయిలో ప్రజలందరి జీవితాల్లో గణనీయమైన మార్పులు తేగలిగిందన్నారు. ఎన్నికల నేపధ్యంలో 2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి ఏప్రిల్ – జూలై వరకు నాలుగు నెలలు పాటు వ్యయానికి రూ.88,215 కోట్ల పద్దును అసెంబ్లీ ఆమోదానికి ప్రతిపాదించారు. భారీ అంచనాలకు వెళ్లకుండా వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలకే పరిమితమయ్యారు. ఎప్పటిలాగానే విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారు.
► 2024–25 ఓటాన్ అకౌంట్ మొత్తం బడ్జెట్‌ను రూ.2,86,389.27 కోట్లు గా బుగ్గన ప్రతిపాదించారు. మూలధన వ్యయం రూ.30,530.18 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.2,30,110.41 కోట్లుగా ప్రతిపాదించారు. రెవెన్యూ లోటు 24,758.22 కోట్లు ఉంటుందని, ద్రవ్య లోటు రూ.55.817.50 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. ద్రవ్యలోటు జీఎస్‌డీపీలో దాదాపు 3.51% ఉంటుందని, రెవెన్యూ లోటు జీఎస్‌డీపీలో దాదాపు 1.56 శాతం ఉంటుందని అంచనా వేశారు. 2023–24 సవరించిన అంచనాల మేరకు రెవెన్యూ లోటు జీఎస్‌డీపీలో 2.19 శాతం, ద్రవ్య లోటు జీఎస్‌డీపీలో 4.18 శాతం ఉంటుందని తెలిపారు.
► సాధారణ విద్యకు బడ్జెట్ కేటాయింపుల్లో పెద్ద పీట వేశారు. సాధారణ విద్యా రంగానికి రూ.33,898 కోట్లు కేటాయించారు. సంక్షేమ, అభివృద్ది రంగాలకు తగినన్ని నిధులు కేటాయించారు. గ్రామీణాభివృద్ధికి రూ.17,816 కోట్లు, పట్టణాభివృద్దికి రూ.9546 కోట్లు, వైద్య, ఆరోగ్య రంగానికి రూ.17,916 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.14,236 కోట్లు, సాగునీటి రంగానికి రూ.12,038 కోట్లు, మొత్తం సంక్షేమ రంగానికి రూ.44,668 కోట్లు కేటాయించారు. విద్యుత్ రంగానికి రూ.6,595 కోట్లు, రవాణా రంగానికి రూ.10,334 కోట్లు కేటాయింపులు చేశారు. పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాల పెట్టుబడులకు రూ.3,940 కోట్లు కేటాయించారు.
ఐదేళ్లలో ‘సుపరిపాలిత ఆంధ్ర’గా..
2019.. అప్పటికి రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయింది. విభజన గాయాలు మానేందుకు, సాంత్వన చర్యలు తీసుకునేందుకు గత టీడీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పైగా.. పరిస్థితిని పెనం మీంచి పొయ్యలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని పునరి్నర్మించుకోవడంపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానంగా దృష్టిపెట్టారు. ఈ సమస్యలను అధిగమించాలంటే మూస పద్ధతిలో కాకుండా సరికొత్త విధానంలో మాత్రమే అభివృద్ధి సాధించగలమని ఆయన తన సుదీర్ఘ పాదయాత్ర ద్వారా బలంగా విశ్వసించారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.
ముఖ్యంగా సుపరిపాలనలో భాగంగా పాలనలో వికేంద్రీకరణ ప్రవేశపెట్టడం అత్యంత ప్రధానమైనది. ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు సీఎం జగన్ తీసుకెళ్లారు. గ్రామస్థాయి నుంచి ప్రభుత్వాన్ని పటిష్టపరిచారు. విస్తృతస్థాయిలో పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించి సమాజంలోని వివిధ వర్గాల వారికి సాధికారత అందించి రాష్ట్రాన్ని ‘సుపరిపాలిత ఆంధ్ర’గా తీర్చిదిద్దారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బుధవారం తన బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రం ‘సుపరిపాలిత ఆంధ్ర’గా ఎలా రూపాంతరం చెందిందో స్పష్టంగా వివరించారు.
పాలనా వికేంద్రీకరణ..
ప్రజలు సాధికారిత, వికేంద్రీకరణ, సుపరిపాలన అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనవి. వీటిని ప్రజల చెంతకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామస్థాయి నుంచి ప్రభుత్వాన్ని పటిష్టపరచడం, విస్తృత స్థాయిలో పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించడం, సమాజంలోని వివిధ వర్గాల వారికి సాధికారతనందించింది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలు, పోలీసు వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ మాత్రమే కాకుండా స్థానిక సంస్థలను బలోపేతం చేసింది. కమ్యూనిటీ కాంట్రాక్టుల విధానం, స్థానిక పాలనలో పౌరుల చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించింది. అలాగే..
► దాదాపు 1,35,000 మంది ఉద్యోగులతో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేసింది. వీటిల్లో 2.66 లక్షల మంది వలంటీర్లను నియమించింది. తద్వారా అర్హులైన లబ్ధిదారులందరికీ ఎలాంటి లోపాలు లేకుండా సకాలంలో పారదర్శకంగా సంక్షేమ పథకాలకు తోడు పౌర కేంద్రీకృత సేవలు గడప గడపకు అందిస్తోంది.
► అందుబాటులో ఉన్న వనరులను సముచితంగా వినియోగించి జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు.. రెవెన్యూ డివిజన్లను 52 నుంచి 77కి పెంచి పరిపాలనాపరమైన పునర్నిర్మాణాన్ని చేపట్టింది. ఇది ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వాన్ని మరింత జవాబుదారీగా, సమర్థవంతంగా చేసింది.
► నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణం ప్రజలకు సేవలను మరింత చేరువ చేస్తాయి.
► ఇక పౌరుల రక్షణ, భద్రతను పెంపొందించడానికి అవసరమైన చోట్ల రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోలీసు సబ్–డివిజన్లు ఏర్పాటుచేసింది.
► ప్రతి జిల్లాలో దిశా పోలీసుస్టేషన్లు ఏర్పాటుచేయడమే కాక రాష్ట్రవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు మరియు పర్యాటక ప్రాధాన్యత కలిగిన 20 ముఖ్య ప్రాంతాల్లో పర్యాటక పోలీసుస్టేషన్లు ప్రారంభమయ్యాయి.
► భద్రతా మౌలిక సదుపాయాలు పెంచడం ద్వారా ప్రజాభద్రత మరింత మెరుగుపడింది.
గడప గడపకు మన ప్రభుత్వం..
► ఈ కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు పౌరుల నుంచి నేరుగా ప్రాథమిక సౌకర్యాలు, మౌలిక సదుపాయాల అవసరాలను తెలుసుకుని వాటిని సమకూర్చడం ద్వారా బాధ్యతాయుతమైన పాలనను అందిస్తున్నారు.
► ఈ కార్యక్రమంలో భాగంగా 58,288 పనులను రూ.2,356 కోట్ల అంచనాతో మంజూరు చేయగా, ఇప్పటివరకు రూ.729 కోట్లతో 17,239 పనులు పూర్తయ్యాయి.
► రాష్ట్రంలో స్థానిక సంస్థలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు నాల్గవ రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులను ఆమోదించి, ఐదవ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని కూడా ఏర్పాటుచేసింది.
వివక్షకు దూరంగా..
గత ఎన్నికల ప్రచార సమయంలో చెప్పిన మాదిరిగానే ముఖ్యమంత్రి జగన్ రాజకీయాలు, ప్రాంతాలు, కులమతాలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి ఫలాలను అందించినట్లు బడ్జెట్ ప్రసంగంలో బుగ్గన పేర్కొన్నారు. పాలనా వికేంద్రీకరణకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన చర్యలను వివరిస్తూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావించారు.
ప్రతిపక్ష నాయకుడి నియోజక వర్గమని వదిలేయకుండా కుప్పంను రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించడంతోపాటు పౌరుల రక్షణ, భద్రత కోసం కొత్త పోలీసు సబ్ డివిజన్, పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం అందరినీ సమానంగా చూస్తోందనేందుకు ఇదే ఉదాహరణ అని చెప్పారు. సంక్షేమ ఫలాలను వివరిస్తూ కొందరు లబ్ధిదారులకు చేకూరిన ప్రయోజనాన్ని బుగ్గన వీడియో ప్రజంటేషన్ ద్వారా తెలియచేశారు. ఇలాంటి ఉదంతాలు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ కనిపిస్తాయన్నారు.
► తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జి.ఎర్రగుడి గ్రామానికి చెందిన వడ్డే రాజేశ్వరి పొదుపు సంఘాల రుణాల మాఫీ, పింఛన్, ఆసరా కింద లభించిన సాయంతో గొర్రెలను కొనుగోలు చేశారు. తనను కష్టాల నుంచి ఈ ప్రభుత్వం గట్టెక్కించిందని ఆమె సంతోషంగా చెబుతోంది.
► విశాఖ జిల్లా భీమిలి మండలం టి.నగరపాలెంకు చెందిన పల్లా కృష్ణవేణి చేయూత కింద అందిన మొత్తంతో కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకుంది. అమ్మ ఒడి సాయం కూడా అందుతోంది. కుట్టు మిషన్ ఉంది. రోజుకు రూ.1,000 దాకా సంపాదిస్తున్నానని, కిరాణా దుకాణంతో తమ బతుకులు మారాయని సగర్వంగా చెబుతోంది.
► విశాఖపట్నం ఆరో వార్డు మధురవాడకు చెందిన వాండ్రాసి అన్నపూర్ణ తాము టీడీపీ మద్దతుదారులైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇతర పథకాలనూ అందిస్తోందని ధన్యవాదాలు తెలియచేస్తోంది.
► నడవలేని స్థితిలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరుకు చెందిన వృద్ధురాలు కవుజు బేబీ అనే మహిళకు ప్రతి నెలా రూ.3,000 పెన్షన్, ఇతర పథకాలను ఇంటి వద్దే అందిస్తుండటంతో ఈ ప్రభుత్వం తనను ఎంతో ఆదుకుంటోందని కృతజ్ఞతలు తెలిపింది.
► విశాఖకు చెందిన రోబంకి చిరంజీవులు అనే వృద్ధ దంపతులకు వైఎస్సార్ కంటి వెలుగు ద్వారా కంటి ఆపరేషన్లు, ఆరోగ్యశ్రీ ద్వారా కాలికి ఆపరేషన్ నిర్వహించడంతోపాటు ఆసరా, పెన్షన్ అందిస్తుండటంతో ఈ ప్రభుత్వం కన్న కొడుకులా ఆదుకుంటోందంటూ సంతోషంగా చెబుతున్నారు.
► ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి పంపడంతో ఒంటరిగా ఉన్న తాను దేవాలయాల వద్ద యాచిస్తూ జీవనం సాగించానని, ఈ ప్రభుత్వం వచ్చాక రూ.3,000 పెన్షన్ ప్రతీ నెలా ఇస్తుండటంతో భిక్షాటన మానుకుని గౌరవంగా బతుకుతున్నానంటూ విజయనగరం జిల్లా బాడంగి మండలం వాడాడ గ్రామానికి చెందిన బత్తిన అప్పమ్మ చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment