శామీర్‌పేట్, మేడ్చల్ నుంచి నేరుగా ఎయిర్‌పోర్ట్
పటాన్‌చెరు నుంచి హయత్‌నగర్
అందుబాటులోకి అతిపెద్ద కారిడార్లు
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండో దశ విస్తరణతో హైదరాబాద్ ప్రజారవాణా ముఖచిత్రంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన నార్త్‌సిటీ మెట్రో కారిడార్లతో ఉత్తర, దక్షిణాలను కలిపే అతిపెద్ద మెట్రో కారిడార్లు అందుబాటులోకి రానున్నాయి. శామీర్‌పేట్, మేడ్చల్ నుంచి నేరుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు రాకపోకలు సాగించవచ్చు. రెండో దశలో ప్రతిపాదించిన అన్ని కారిడార్లు పూర్తయితే హైదరాబాద్ మెట్రో 230.4 కిలో మీటర్ల వరకు విస్తరించనుంది.
ప్రస్తుతం మూడు కారిడార్లలో 69 కిలోమీటర్లు మెట్రో సదుపాయం ఉంది. రెండో దశలో 190.4 కిలోమీటర్ల కారిడార్లు విస్తరించనున్నారు. వీటితో పాటు ఫోర్త్‌సిటీకి ప్రతిపాదించిన మరో 40 కిలోమీటర్లు కూడా పూర్తయితే మొత్తం 230 కిలోమీటర్లతో చెన్నై, బెంగళూర్ నగరాల మెట్రోల సరసన చేరే అవకాశం ఉంది. రెండో దశలో మొదట 5 కారిడార్లలో 76.4 కిలోమీటర్లు నిర్మించాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘బి’ విభాగంగా నార్త్‌సిటీకి రెండు కారిడార్లలో 45 కిలోమీటర్ల విస్తరణకు ప్రణాళికలను రూపొందించారు.
వీటితో పాటు ఎయిర్‌పోర్టు నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు మరో 40 కిలోమీటర్లు కూడా ఈ రెండో దశలోనే పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని వైపులా మెట్రో కారిడార్లు వినియోగంలోకి వస్తే లక్షలాది మంది ప్రయాణికులు అతిపెద్ద కారిడార్లలో రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. మొదట విస్తరించనున్న 5 కారిడార్లలో 2028 నాటికి సుమారు 8 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉందని అంచనా. నార్త్‌సిటీ రెండు కారిడార్లతో కలిపి సుమారు 10 లక్షల నుంచి 12 లక్షల మంది పయనించవచ్చని అంచనా. 2030 నాటికి 15 లక్షలు దాటనుంది.
శామీర్‌పేట్ టూ ఎయిర్‌పోర్టు..
శామీర్‌పేట్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి దేశవిదేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు శామీర్‌పేట్ నుంచి ప్యారడైజ్, ఎంజీబీఎస్, చాంద్రాయణగుట్ట మీదుగా ఎయిర్‌పోర్టు వరకు సుమారు 62 కిలోమీటర్ల కారిడార్ వినియోగంలోకి రానుంది. మేడ్చల్ నుంచి కూడా ఎయిర్‌పోర్టు వరకు ఇంచుమించు 63 కిలోమీటర్ల కారిడార్ అందుబాటులోకి రానుంది. ప్రయాణికులు సికింద్రాబాద్ నుంచి ఉప్పల్, నాగోల్ మీదుగా కూడా రాకపోకలు సాగించవచ్చు. దీంతో మొదటి, రెండో కారిడార్లలో మెట్రోలు మారాల్సి ఉంటుంది. మరోవైపు మేడ్చల్, శామీర్‌పేట్ ప్రాంతాల నుంచి నేరుగా కోకాపేట్, రాయదుర్గం, హైటెక్‌సిటీ ఐటీ సంస్థలకు కూడా కనెక్టివిటీ ఏర్పడుతుంది.
ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా..
మరోవైపు ఇప్పుడు ఉన్న మూడు కారిడార్లలో కేవలం 69 కిలోమీటర్ల వరకు మెట్రో సదుపాయం ఉంది. దీంతో ప్రయాణికులు ఎక్కడో ఒక చోట మెట్రో నుంచి ప్రత్యామ్నాయ రవాణా సదుపాయంలోకి మారాల్సి వస్తుంది. రెండో దశలో ‘ఏ’ ‘బి’ కారిడార్లు, స్కిల్‌యూనివర్సిటీ కారిడార్ కూడా పూర్తయితే నలువైపులా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మెట్రో ప్రయాణ సదుపాయం లభించనుంది.
హయత్‌నగర్ నుంచి పటాన్‌చెరు..
హయత్‌నగర్ నుంచి పటాన్‌చెరు వరకు నగరంలో మరో అతిపెద్ద కారిడార్‌లో కూడా మెట్రో పరుగులు తీయనుంది. దీంతో తూర్పు, పడమరల మధ్య సుమారు 50 కిలోమీటర్ల వరకు మెట్రో కనెక్టివిటీ ఏర్పడనుంది. ప్రస్తుతం ఈ రూట్‌లో ఎల్‌బీనగర్ నుంచి మియాపూర్ వరకు 29 కిలోమీటర్లు మెట్రో అందుబాటులో ఉంది. కొత్తగా మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు 13.4 కిలోమీటర్లు, ఎల్‌బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు 7.1 కిలోమీటర్లు కొత్తగా నిర్మించడం వల్ల మొత్తం 50 కిలోమీటర్లు నిరాటంకమైన రవాణా సదుపాయం లభించనుంది. ప్రస్తుతం ఈ రూట్‌లో లక్షలాది మంది ప్రయాణికులు సిటీ బస్సులు, సొంత వాహనాలపై ఆధారపడి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ ఒక్క కారిడార్‌లోనే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment