హైదరాబాద్ మెట్రో రైల్ 7వ వార్షికోత్సవంలో ఎన్వీఎస్ రెడ్డి
రెండో దశ నిర్మాణానికి నిధుల లభ్యత పుష్కలమని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: మెట్రోరైలు రెండో దశ ప్రాజెక్టు భాగ్యనగర అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలవనుందని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోరైల్ లిమిటెడ్ సంస్థల ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి అన్నారు. ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా, అద్భుతమైన గ్లోబల్ సిటీగా అవతరించనుందని చెప్పారు. హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టును ప్రారంభించి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ఆధ్వర్యంలో అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో గురువారం 7వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎనీ్వఎస్ రెడ్డి మాట్లాడుతూ మెట్రో రెండో దశకు ఇప్పటికే భూసేకరణ ప్రారంభమైందని.. త్వరలోనే ప్రాథమిక పనులను ప్రారంభిస్తామని చెప్పారు. రెండో దశ ప్రాజెక్టుకు నిధుల లభ్యత పుష్కలంగా ఉందని.. కేంద్రం అనుమతి లభించగానే పెట్టుబడి పెట్టేందుకు మల్టీ లేటరల్ డెవలప్‌మెంట్ బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని ఆయన వివరించారు.
అదనపు కోచ్‌ల కోసం సన్నాహాలు...
ప్రస్తుతం రూ. 6 వేల కోట్లకుపైగా నష్టాలతో మెట్రో నడుస్తున్నప్పటికీ వచ్చే మూడు, నాలుగేళ్లలో నష్టాలను అధిగమించి లాభాల బాటలో పయనించే అవకాశం ఉందని ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ఎండీ, సీఈఓ కేవీబీ రెడ్డి తెలిపారు. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మెట్రో రైళ్ల ఆపరేషన్‌ను మరింత సమర్థంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం కొత్త కోచ్‌లను తెప్పించేందుకు సన్నాహాలు చేపట్టామని.. మరో 3 నెలల్లో అదనపు కోచ్‌లకు పరిష్కారం లభిస్తుందని ఆయన వివరించారు. అయితే భద్రతా తనిఖీలు పూర్తి చేసుకొని ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేందుకు 12–15 నెలలు పట్టొచ్చన్నారు. 10 లక్షల మంది ప్రయాణించేలా అదనపు కోచ్‌లు, రైళ్ల నిర్వహణ ఉంటుందని వివరించారు. కాగా, ఈ ఏడేళ్లలో మెట్రో రైళ్లలో 63.40 కోట్ల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment