air strip
-
IAF: కార్గిల్‌లో నైట్ ల్యాండింగ్
భారత వాయుసేన (ఐఏఎఫ్) అరుదైన ఘనత సాధించింది. సముద్ర మట్టానికి ఏకంగా 10,500 అడుగుల ఎత్తున హిమాలయ పర్వతాలపై ఉన్న కార్గిల్ అడ్వాన్స్డ్ ల్యాండ్ గ్రౌండ్‌పై సి–130జే సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాన్ని రాత్రి పూట సురక్షితంగా ల్యాండింగ్ చేసింది. దీనికి సంబంధించి వాయుసేన ‘ఎక్స్’లో పోస్టు చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఐఏఎఫ్ బాహుబలిగా చెప్పే ఈ విమానం పాక్ సరిహద్దులో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) సమీపంలోని ఈ ఎయిర్ స్ట్రిప్‌పై రాత్రి సమయంలో దిగడం ఇదే తొలిసారి! గరుడ్ కమాండోలకు శిక్షణలో భాగంగా ఇటీవలే ఈ విన్యాసం నిర్వహించినట్లు వాయుసేన వర్గాలు వెల్లడించాయి. అంతేగాక ఐఏఎఫ్ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించడానికి రక్షణపరంగా వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు వివరించాయి. నిజానికి రక్షణ శాఖలో రవాణా విమానాన్ని ఇలా రాత్రి పూట ల్యాండింగ్ చేయడం అత్యంత అరుదు. కొండలపై ఉన్న రన్‌వేపై భారీ విమానాన్ని క్షేమంగా దించడం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. హిమాలయ పర్వతాల్లో వాయుసేన ఆధ్వర్యంలో ఎయిర్ర్స్టిప్లు సేవలందిస్తున్నాయి. ఎల్ఏసీ సమీపంలో దౌలత్ బేగ్ ఓల్డీ అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్(ఏఎల్జీ) సముద్ర మట్టానికి 16,700 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎయిర్‌ఫీల్డ్ కావడం గమనార్హం. వాయుసేన వద్ద 12 సి–130జే విమానాలున్నాయి. ఇవి సైనికుల తరలింపు, సహాయక సామగ్రి రవాణాలో ఉపయోగపడుతున్నాయి. – న్యూఢిల్లీ -
kargil: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సరికొత్త రికార్డు
లడాఖ్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్) సరికొత్త రికార్డు నెలకొల్పింది. హిమాలయాల్లో ఎనిమిది వేల అడుగుల ఎత్తులో ఉన్న కార్గిల్ ఎయిర్ స్ట్రిప్‌పై సి-130జె విమానాన్ని ఎయిర్‌ఫోర్స్ తొలిసారిగా నైట్‌ల్యాండింగ్ చేసింది. ‘ఇటీవలే ఐఏఎఫ్ సి-130ని కార్గిల్ ఎయిర్ స్ట్రిప్‌లో తొలిసారి విజయవంతంగా రాత్రివేళ ల్యాండ్ చేశాం’అని ఐఏఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఐఏఎఫ్ ప్రత్యేక బలగాల యూనిట్ ద గార్డ్స్ శిక్షణను కూడా ఈ ఫీట్లో భాగంగా ఐఏఎఫ్ కలిపి నిర్వహించడం విశేషం. నైట్ ల్యాండింగ్‌కు సంబంధించి మరిన్ని వివరాలను ఐఏఎఫ్ వెల్లడించలేదు. హిమాలయాల్లో 8800 మీటర్ల ఎత్తులో ఉన్న కార్గిల్ ఎయిర్ స్ట్రిప్‌లో విమానాలను ల్యాండ్ చేయడం పైలట్లకు సవాళ్లతో కూడుకున్న టాస్క్.అత్యంత ఎత్తుతో పాటు ప్రతికూల వాతావరణంలో విమానాలను ల్యాండ్ చేయాలంటే పైలట్లకు ప్రత్యేక నైపుణ్యాలు ఉండాల్సిందే. గత ఏడాది నవంబర్లోనూ ఐఏఎఫ్ ఉత్తరాఖండ్‌లో ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఎయిర్ స్ట్రిప్‌పై లాక్హిడ్ మార్టిన్‌కు చెందిన సూపర్ హెర్క్యులస్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానాన్ని విజయవంతంగా నైట్ ల్యాడింగ్ చేసింది. ఉత్తర కాశీ టన్నెల్ కూలిన ఘటనలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకుగాను ఈ విమానాలు భారీ ఇంజినీరింగ్ పరికరాలను మోసుకెళ్లాయి. ఇదీచదవండి.. ప్రతి శ్రీరామనవమికి అయోధ్యలో అద్భుతం -
Peddapalli: బసంత్‌నగర్ ఎయిర్‌పోర్టుకు మహర్దశ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి జిల్లావాసుల దశాబ్దాల కల నెరవేరనుంది. ఇంతకాలం బసంత్‌నగర్‌లో విమానాశ్రయం ఉంటుందా? ఉండదా? అన్న ఊహాగానాలకు ఇకపై తెరపడనుంది. తాజాగా ఉడాన్ పథకం 5.0లో భాగంగా రాష్ట్రంలోని రెండు పాత విమానాశ్రయాలను గుర్తించగా.. అందులో మొదటిది వరంగల్ కాగా.. రెండోది బసంత్‌నగర్ విమానాశ్రయం కావడం విశేషం. విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తలపెట్టిన పథకం ఉడాన్. ఉడాన్ అంటే ఉడో దేశ్‌కీ ఆమ్ నాగరిక్.. దీన్నే సంక్షిప్తంగా ఉడాన్ అని వ్యవహరిస్తున్నారు. దేశంలో ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు, చిన్న నగరాలను రాష్ట్ర రాజధానులు, దేశ రాజధానులతో కలిపేందుకు కేంద్రం 2016లో ఉడాన్ పథకం ప్రారంభించినప్పటి నుంచి బసంత్‌నగర్, వరంగల్ ఎయిర్‌పోర్టులను పరిశీలించాలని రాష్ట్రం విన్నవించింది. అంతేకాకుండా పలుమార్లు ఇక్కడి సాధ్యాసాధ్యాలు, ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భౌగోళికంగా ఉన్న అనుకూలతలు, ప్రతికూలతలు, ఆటంకాలు, అందుబాటులో ఉన్న రన్‌వే తదితరాలపై ప్రైవేటు కన్సెల్టెన్సీ ద్వారా సర్వే చేయించి కేంద్రానికి పంపారు. ప్రజల ఆర్థిక స్థితిగతులు, పెద్దపల్లి పారిశ్రామిక ప్రాంత ప్రజలతోపాటు, ఉమ్మడి జిల్లాకు ఎయిర్‌పోర్టు ఆవశ్యకత, తదితరాలను సైతం వివరించారు. దేశంలో 54 ఎయిర్‌స్ట్రిప్స్ గుర్తింపు పలుమార్లు రాష్ట్ర వినతిని పరిగణలోకి తీసుకున్న కేంద్రం తొలిసారిగా ఈ విమానాశ్రయం విషయంలో సుముఖత వ్యక్తం చేసింది. ఉడాన్ పథకంలో భాగంగా దేశం మొత్తం మీద 54 పొటెన్షియల్ ఎయిర్‌స్ట్రిప్ (రన్‌వే)లను గుర్తించింది. అందులో మన రాష్ట్రం నుంచి వరంగల్, బసంత్నగర్లను కూడా భవిష్యత్తులో మనగలిగే సామర్థ్యమున్న ఎయిర్స్ట్రిప్లుగా నోటిఫై చేసింది. అసలు దేశంలోని అటవీ ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలను అభివృద్ధి చేసేందుకు ఈ 54 ఎయిర్‌స్ట్రిప్ (రన్‌వే)లను కేంద్రం వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే బసంత్‌నగర్‌ను ‘పర్యాటక ప్రాంతాలకు సమీపంలో ఉన్న విమానాశ్రయాల’ జాబితాలో చోటు కలించింది. అంటే దీని ద్వారా విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు పరిసరాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను దేశంలోని నలమూలల నుంచి వచ్చే యాత్రికులకు పరిచయం చేయనుంది. ఈ పరిణామం శుభసూచమకమని, దేశంలోని వివిధ నగరాలతో కనెక్టివిటీ పెంచే క్రమంలో ఇది తొలి అడుగు అవుతుందని ఉమ్మడి జిల్లా ప్రముఖులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పర్యాటకానికి పెద్దపీట..! తాజాగా కేంద్రం ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు చొరవ తీసుకోవడం ఉమ్మడి జిల్లా అభివృద్ధికి దోహదపడనుంది. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న తలంపుతో అభివృద్ధి చేయనున్న ఈ విమానశ్రయానికి కాళేశ్వరం, ధర్మపురి, రామగిరి ఖిల్లా, కొండగట్టు, వేములవాడతోపాటు పక్కనే ఉన్న గోదావరి, ఉమ్మడి ఆదిలాబాద్‌లోని టైగర్ రిజర్వ్, గిరిజన తదితర పర్యాటక ప్రాంతాలను పర్యాటకులకు చేరవవుతాయి. దీంతో యాత్రీకులకు ఆధ్మాత్మిక భావనను పంచడంతోపాటు పర్యాటకరంగం అభివృద్ధి చెందిన ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిమంది ఉపాధి లభించనుంది. (క్లిక్: RRRకు భూసేకరణ వేగవంతం) ఇదీ.. చరిత్ర..! 1980వ దశకంలో స్థానిక కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ అధినేత బీకే బిర్లా తాను ఇక్కడికి వచ్చేందుకు ఈ విమానాశ్రయం నిర్మాణం చేపట్టారు. 294 ఎకరాల విస్తీర్ణంలో ఏరాటు చేసిన ఈ విమానాశ్రయంలో ‘వాయుదూత్’ ఎయిర్‌లైన్స్ (21 సీట్ల సామర్ధ్యం) చిన్న విమానాలు మాత్రమే రాకపోకలు సాగించేవి. 2009 అక్టోబరులో ఇదే ఎయిర్‌పోర్టును రామగుండం ఎయిర్ పోర్టుగా 500 ఎకరాల విస్తీర్ణంతో అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు నడిచినా.. తరువాత అవి అటకెక్కాయి. తరువాత 2016లో ఉడాన్ పథకం రావడంతో 2020లో ఎయిర్‌ఫోర్స్ అథారిటీ ఆఫ్ఇండియా (ఏఏఐ) ఈ విమానాశ్రయంపై రాష్ట్ర ప్రభుత్వంతోపాటు తాను కూడా చేసిన పలు సాంకేతిక, భౌగోళిక సర్వేలను అధ్యయనం చేసింది. (క్లిక్: ఫ్యాన్సీ నంబర్ కోసం తెగ పోటీ.. నిర్మల్‌లో ఇదే మేటి!) -
వాయుసేన కేంద్రం ఏర్పాటుపై సందిగ్ధం
ఆదిలాబాద్ అర్బన్ : భారత వాయుసేన కార్యకలాపాల విస్తరణ కేంద్రం (ఎయిర్ స్ట్రిఫ్) ఏర్పాటుపై సందిగ్ధత నెలకొంది. ఈ కేంద్రా న్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదిలాబాద్‌తోపాటు, పక్కనే ఉన్న నిజామాబాద్ జిల్లాలో స్థలాలను పరిశీలించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మంగళవారం భారత వాయుసేన ఉన్నతాధికారుల బృందం హైదరాబాద్ సీఎం కేసీఆర్‌ను కలిసింది. సానుకూలంగా స్పందించిన సీఎం రెండు జిల్లాల్లో భూముల లభ్యతకు సంబంధించిన మ్యాపులను పరిశీలించారు. దీంతో అం దరూ అనుకుంటున్నట్లు ఈ కేంద్రం ఆదిలాబాద్ శివారులో ఏర్పాటవుతుందా? లేదా పక్క జిల్లాకు తరలిపోనుందా? అనే అయోమయం నెలకొంది. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలంలో కూడా ఎయిర్ స్ట్రిఫ్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చాలా ఏళ్లుగా ఉంది. అక్కడ కూడా రెవెన్యూ అధికారులు పలుమార్లు స్థలాలను పరిశీలించారు. వాయుసేన కార్యకలాపాల విస్తరణ కేంద్రానికి కావాల్సిన స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేసిన జిల్లా యంత్రాంగం ఆ స్థలంలో నీటి సరఫరా, విద్యుత్, తదితర సౌకర్యాల కల్పనకు రూ.15 కోట్లతో ప్రతిపాదనలు కూడా పంపింది. 1,591 ఎకరాల భూమి గుర్తింపు జిల్లా కేంద్రంలో ఎయిర్ స్ట్రిఫ్ నిర్మాణానికి 1591.45 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. ఇందులో ప్రభుత్వ భూమితోపాటు వ్యవసాయ భూమి ఉంది. ఖానాపూర్, అనుకుంట, కచ్కంటి, తంతోలి గ్రామాల శివార్లలో ఈ భూమి ఉంది. ఎయిర్ స్ట్రిఫ్ నిర్మాణంలో కోల్పోయే భూముల్లో ప్రభుత్వ భూమి కంటే వ్యవసాయ భూమే అధికంగా ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఖానాపూర్ శివారులోని 50.20 ఎకరాల ప్రభుత్వ భూమి, అనుకుంట గ్రామ శివారులో 34.04 ఎకరాలు, తంతోలి గ్రామ శివారులో 5.20 ఎకరాలు, ఖానాపూర్ గ్రామ శివారులో 431.36 ఎకరాల వ్యవసాయ భూమి, అనుకుంట గ్రామ శివారులో 501.34 ఎకరాలు, కచ్కంటి గ్రామ శివారులో 313.24 ఎకరాల భూమిని అధికారులు అవసరమని గుర్తించారు. దీంతోపాటు తంతోలి గ్రామ శివారులో 256.07 ఎకరాల భూమిని గుర్తించారు. ఆందోళనలో శివారు ప్రజలు ఆదిలాబాద్ పట్టణ శివారు ప్రాంతంలో ఎయిర్ స్ట్రిఫ్ నిర్మాణం విషయమై ప్రజల్లో ఆనందం కన్పిస్తున్నా.. నిర్మాణంలో వ్యవసాయ భూములు కోల్పోవడంతో శివారు గ్రామాల ప్రజలు ఆందోళనలో పడుతున్నారు. నిర్మాణానికి 1,600 ఎకరాలు అవసరం కావడంతో పంట భూములు కోల్పోవాల్సి వస్తుంది. తంతోలి, అనుకుంట, కచ్కంటి గ్రామాల శివారుల్లో సుమారు 1200 ఎకరాల భూమి సాగులో ఉంది. అయితే ఏర్పాటుకు గుర్తించినంత మాత్రం భూమి కోల్పోయినట్లు కాదని, ఏర్పాటుకు ఏ భూమి అవసరమో అదే ఇవ్వ డం జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అధికారులను కలిసిన కచ్కంటి గ్రామస్తులు ఈ కేంద్రం నిర్మాణంతో ఏఏ భూములను సేకరిస్తారో స్పష్టత ఇవ్వాలని ఆదిలాబాద్ మండలంలోని కచ్కంటి గ్రామస్తులు బుధవారం ఆదిలాబాద్ ఆర్డీవో సుధాకర్‌రెడ్డిని కలిశారు. ఇంత వరకు ఏ రెవెన్యూ అధికారి కూ డా సంప్రదించ లేదని, తక్షణమే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామస్తులలో ఉన్న అపోహలను తొలగించాలని ఆర్డీవోను కోరారు. గురువారం కలెక్టర్ ను కలువడానికి రాగా, ఆయన లేకపోవడంతో డీఆర్వో ప్రసాదరావుకు కలిసి వినతిపత్రం అందించారు. ఇదిలాఉండగా, హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్ ఫోర్స్‌కు చెందిన అధికారులు ఈ వారంలో వచ్చి విమానాశ్రయ స్థల పరిశీలన చేయనున్నారు. స్థల పరిశీలన, బెక్ మార్కింగ్, రూట్ మ్యాప్, సదుపాయాల కల్పన, తదితర విషయాలను తెలుసుకోనున్నారని 22న మన జిల్లా అధికారులకు సమాచారం అందింది. -
నాగార్జునసాగర్ వద్ద ఎయిర్‌స్ట్రిప్
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద ఎయిర్‌స్ట్రిప్ ఏర్పాటుచేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నాగార్జునసాగర్‌లో రూ.1600 కోట్లతో డీఆర్డీఓ విభాగం ఏర్పాటు కానుంది. దేశ రక్షణ అవసరాల కోసం నెలకొల్పబోయే యూనిట్‌కు నాగార్జునసాగర్‌ను ఎంపిక చేశారు. దీనికి ఆ ప్రాంతంలో వంద ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం రక్షణ శాఖకు అనుమతులు మంజూరుచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. రక్షణశాఖతోపాటు పర్యాటక అవసరాలకు అనుగుణంగా నాగార్జునసాగర్ వద్ద ఎయిర్‌స్ట్రిప్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. -
సామాన్యుడికీ విమానయోగం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఊరుంటే రోడ్డు పడుతుంది. రోడ్డుంటే బస్సు వస్తుంది. విమానమూ అంతే. విమానాశ్రయం ఉంటే చాలు. కేంద్ర పౌర విమానయాన శాఖ ఉద్దేశమూ ఇదే. దేశవ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో 200 విమానాశ్రయాలను 20 ఏళ్లలో అభివృద్ధి చేయాలన్నదే ఈ శాఖ లక్ష్యం. తద్వారా దేశీయంగా చిన్న నగరాలకు విమాన సర్వీసులను పెంచాలని చూస్తోంది. మరోవైపు కర్ణాటక ఒక అడుగు ముందుకేసి కోటి రూపాయలకే చిన్న విమానాశ్రయం (ఎయిర్‌స్ట్రిప్) కట్టి చూపిస్తామంటోంది. ఇందుకోసం తమ రాష్ట్రంలో 11 ప్రాంతాలను గుర్తించామని, సామాన్యుడికి విమాన సేవలు కొద్ది రోజుల్లో అందిస్తామని సగర్వంగా చెబుతోంది. మరి కర్ణాటక మాదిరిగా తెలంగాణ, సీమాంధ్రలో ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌లను వాడుకలోకి తేవడం, అలాగే కొత్తగా ఏర్పాటు చేస్తే పర్యాటకంగా, పారిశ్రామికంగానూ ఇరు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. సామాన్యుడికి విమాన సేవలు చేరువ అవుతాయి కూడా. ఇవిగో విమానాశ్రయాలు... విమానాశ్రయం అనగానే ప్రముఖంగా వినిపించే పేరు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, బేగంపేట. ఇవేగాక హైదరాబాద్ సమీపంలో రక్షణ శాఖ ఆధీనంలో దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉన్నాయి. నాదర్గుల్ ఎయిర్‌పోర్ట్‌ను పైలట్ శిక్షణ సంస్థలు వినియోగిస్తున్నాయి. రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. పుట్టపర్తిలో శ్రీ సత్య సాయి ఎయిర్పోర్ట్, ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్, కరీంనగర్ జిల్లా బసంత్‌నగర్ ఎయిర్‌స్ట్రిప్స్ పూర్తిగా ప్రైవేటువి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, ప్రకాశం జిల్లా దొనకొండ, వరంగల్‌లోని మామునూరు, ఆదిలాబాద్, నాగార్జున సాగర్, నల్గొండతోపాటు ఇదే జిల్లాలో ఉన్న ఆలేరు, విజయనగరం జిల్లా బొబ్బిలి ఎయిర్‌స్ట్రిప్స్ మూతపడ్డాయి. నిజామాబాద్, నెల్లూరు, కొత్తగూడెం, కర్నూలులో విమానాశ్రయాల ఏర్పాటుతోపాటు మామనూరు, తాడేపల్లిగూడెం ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పరిశీలనలో ఆదిలాబాద్ కూడా ఉంది. కడపలో ఇటీవలే రూ.60 కోట్లతో చేపట్టిన విమానాశ్రయ నిర్మాణం పూర్తి అయింది. ఏప్రిల్‌లో కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విమానాశ్రయాల రాకతో పర్యాటకం తోపాటు ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుందని, ఉపాధి పెరుగుతుందని బేగంపేట విమానాశ్రయ డెరైక్టర్ ఐ.ఎన్.మూర్తి చెప్పారు. అన్ని జిల్లాల్లోనూ ఎయిర్‌స్ట్రిప్‌లు రావాలని ఆకాంక్షించారు. తద్వారా ఆపత్కాల పరిస్థితుల్లో తక్షణ సేవలు అందించేందుకు వీలవుతుందన్నారు. కనెక్టివిటీ పాలసీ.. రీజినల్, రిమోట్ ఏరియా ఎయిర్ కనెక్టివిటీ పాలసీని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రూపొందించింది. విమానాలు తక్కువగా నడుస్తున్న, ఏమాత్రం నడవని ప్రాంతాలకు సర్వీసులను విస్తరించడమే పాలసీ ముఖ్యోద్దేశం. ఇక ఎంపిక చేసిన విమానాశ్రయాలకు సర్వీసులు నడిపే ఆపరేటర్లకు ల్యాండింగ్, పార్కిం గు, రూట్ నేవిగేషన్ ఫెసిలిటీ, ప్యాసింజరు సర్వీసు వంటి ఫీజులు మినహాయిస్తారు. రక్షణ శాఖ ఆధీనంలోని విమానాశ్రయాలకూ ఇలాంటి రాయితీలు కల్పించేలా చర్యలు తీసుకుంటారు. షెడ్యూల్డు, నాన్ షెడ్యూల్డు ఎయిర్‌లైన్స్‌కే రాయితీలు వర్తిస్తాయి. సర్వీసులు నడిచేందుకు మౌలిక ఏర్పాట్లు, విమాన ఇంధనంపై వ్యాట్ తగ్గిం పు, విద్యుత్ చార్జీలపై పన్ను మినహాయింపు, ఆస్తి పన్ను ఐదేళ్లపాటు మినహాయింపు వంటివి రాష్ట్రాలే కల్పించాలని పాలసీ చెబుతోంది. అంతేకాకుండా నిర్ణీత రూట్లలో నడుస్తున్న సర్వీసుల్లో గుర్తించిన మారుమూల ప్రాంతాలకు ఆపరేటర్లు 10% సర్వీసులను కేటాయించాల్సిందేనని ప్రభుత్వం 1994లో రూపొం దించిన రూట్ డిస్పర్సల్ గైడ్‌లైన్స్ నిర్దేశిస్తోంది. వీటిని వాడుకుందాం... కర్ణాటక మాదిరిగా తెలంగాణ, సీమాంధ్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే ఇప్పటికే ఉన్న విమానాశ్రయాలు, ఎయిర్‌స్ట్రిప్‌లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం ద్వారా అటు పర్యాటకం, ఇటు సాధారణ విమాన ప్రయాణానికీ ఉపయుక్తంగా ఉంటుంది. విదేశీ పర్యాటకులు విమానంలో మన ప్రాంతానికి రావాలంటే ప్రస్తుతానికి హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతి, రాజమండ్రికి మాత్రమే సర్వీసులు నడుస్తున్నాయి. రాష్ట్రంలో విమానాశ్రయాలు, ఎయిర్‌స్ట్రిప్‌లు ఉన్న నగరాలన్నీ పర్యాటకంగా ప్రముఖమైన స్థలాలకు సమీపంలో ఉన్నవే. ఈ నేపథ్యంలో హెలిటూరిజంను ప్రమోట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పట్నుంచో యోచిస్తోంది. మొత్తం ఎయిర్ ట్రాఫిక్‌లో మెట్రోయేతర నగరాల వాటా ప్రస్తుతం 30 శాతమే. భవిష్యత్తులో ఇది 45%కి చేరొచ్చని అంచనా. ప్రాంతాలు-ప్రత్యేకతలు... తాడేపల్లి గూడెం, ఏలూరు: ద్వారకా తిరుమల దేవాలయం, పాపి కొండలు, పట్టిసీమ, క్షీరారామం, గుంటుపల్లి గుహలు, కొల్లేరు సరస్సు, పోలవరం. దొనకొండ: గుండ్లకమ్మ రిజర్వాయర్, చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమ, చీరాల. బసంత్‌నగర్: వేములవాడ, ధర్మపురి, కొండగట్టు, కాళేశ్వరం, ఎలగందల ఖిల్లా. మామునూరు: వేయి స్తంభాల గుడి, వరంగల్ ఖిల్లా, రామప్ప గుడి, పాకాల చెరువు, లక్నవరం సరస్సు, ఏటూరు నాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. సమ్మక్క సారక్క జాతర జరిగే మేడారం వరంగల్ జిల్లాలోనే ఉంది. నిజామాబాద్: నిజాం సాగర్, దోమకొండ ఖిల్లా, కెంటు మసీదు. నెల్లూరు: పెంచలకోన, సోమశిల డ్యాం, పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం, ఉదయగిరి ఖిల్లా. కొత్తగూడెం: భద్రాచలం, కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. కర్నూలు: శ్రీశైలం, మంత్రాలయం, బెలూం గుహలు, రాయల్ ఫోర్ట్, ఓర్వకల్లు రాక్ గార్డెన్, మహానంది, అహోబిలం, కొండారెడ్డి ఖిల్లా. నాగార్జున సాగర్: సాగర్ డ్యాం. బొబ్బిలి: ఎటువంటి అతుకులు లేకుండా తయారయ్యే బొబ్బిలి వీణ కొనేందుకు విదేశీయులు ఇక్కడికి వస్తుంటారు. రామతీర్థం ప్రముఖ పుణ్య క్షేత్రం. నల్గొండ: యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం, భువనగిరి ఖిల్లా, కొలనుపాక దేవాలయం.