బసంత్‌నగర్ విమానాశ్రయం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి జిల్లావాసుల దశాబ్దాల కల నెరవేరనుంది. ఇంతకాలం బసంత్‌నగర్‌లో విమానాశ్రయం ఉంటుందా? ఉండదా? అన్న ఊహాగానాలకు ఇకపై తెరపడనుంది. తాజాగా ఉడాన్ పథకం 5.0లో భాగంగా రాష్ట్రంలోని రెండు పాత విమానాశ్రయాలను గుర్తించగా.. అందులో మొదటిది వరంగల్ కాగా.. రెండోది బసంత్‌నగర్ విమానాశ్రయం కావడం విశేషం. విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తలపెట్టిన పథకం ఉడాన్. ఉడాన్ అంటే ఉడో దేశ్‌కీ ఆమ్ నాగరిక్.. దీన్నే సంక్షిప్తంగా ఉడాన్ అని వ్యవహరిస్తున్నారు.
దేశంలో ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు, చిన్న నగరాలను రాష్ట్ర రాజధానులు, దేశ రాజధానులతో కలిపేందుకు కేంద్రం 2016లో ఉడాన్ పథకం ప్రారంభించినప్పటి నుంచి బసంత్‌నగర్, వరంగల్ ఎయిర్‌పోర్టులను పరిశీలించాలని రాష్ట్రం విన్నవించింది. అంతేకాకుండా పలుమార్లు ఇక్కడి సాధ్యాసాధ్యాలు, ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భౌగోళికంగా ఉన్న అనుకూలతలు, ప్రతికూలతలు, ఆటంకాలు, అందుబాటులో ఉన్న రన్‌వే తదితరాలపై ప్రైవేటు కన్సెల్టెన్సీ ద్వారా సర్వే చేయించి కేంద్రానికి పంపారు. ప్రజల ఆర్థిక స్థితిగతులు, పెద్దపల్లి పారిశ్రామిక ప్రాంత ప్రజలతోపాటు, ఉమ్మడి జిల్లాకు ఎయిర్‌పోర్టు ఆవశ్యకత, తదితరాలను సైతం వివరించారు.
దేశంలో 54 ఎయిర్‌స్ట్రిప్స్ గుర్తింపు
పలుమార్లు రాష్ట్ర వినతిని పరిగణలోకి తీసుకున్న కేంద్రం తొలిసారిగా ఈ విమానాశ్రయం విషయంలో సుముఖత వ్యక్తం చేసింది. ఉడాన్ పథకంలో భాగంగా దేశం మొత్తం మీద 54 పొటెన్షియల్ ఎయిర్‌స్ట్రిప్ (రన్‌వే)లను గుర్తించింది. అందులో మన రాష్ట్రం నుంచి వరంగల్, బసంత్‌నగర్‌లను కూడా భవిష్యత్తులో మనగలిగే సామర్థ్యమున్న ఎయిర్‌స్ట్రిప్‌లుగా నోటిఫై చేసింది. అసలు దేశంలోని అటవీ ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలను అభివృద్ధి చేసేందుకు ఈ 54 ఎయిర్‌స్ట్రిప్ (రన్‌వే)లను కేంద్రం వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది.
ఈ క్రమంలోనే బసంత్‌నగర్‌ను ‘పర్యాటక ప్రాంతాలకు సమీపంలో ఉన్న విమానాశ్రయాల’ జాబితాలో చోటు కలించింది. అంటే దీని ద్వారా విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు పరిసరాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను దేశంలోని నలమూలల నుంచి వచ్చే యాత్రికులకు పరిచయం చేయనుంది. ఈ పరిణామం శుభసూచమకమని, దేశంలోని వివిధ నగరాలతో కనెక్టివిటీ పెంచే క్రమంలో ఇది తొలి అడుగు అవుతుందని ఉమ్మడి జిల్లా ప్రముఖులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
పర్యాటకానికి పెద్దపీట..!
తాజాగా కేంద్రం ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు చొరవ తీసుకోవడం ఉమ్మడి జిల్లా అభివృద్ధికి దోహదపడనుంది. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న తలంపుతో అభివృద్ధి చేయనున్న ఈ విమానశ్రయానికి కాళేశ్వరం, ధర్మపురి, రామగిరి ఖిల్లా, కొండగట్టు, వేములవాడతోపాటు పక్కనే ఉన్న గోదావరి, ఉమ్మడి ఆదిలాబాద్‌లోని టైగర్ రిజర్వ్, గిరిజన తదితర పర్యాటక ప్రాంతాలను పర్యాటకులకు చేరవవుతాయి. దీంతో యాత్రీకులకు ఆధ్మాత్మిక భావనను పంచడంతోపాటు పర్యాటకరంగం అభివృద్ధి చెందిన ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిమంది ఉపాధి లభించనుంది. (క్లిక్: RRRకు భూసేకరణ వేగవంతం)
ఇదీ.. చరిత్ర..!
1980వ దశకంలో స్థానిక కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ అధినేత బీకే బిర్లా తాను ఇక్కడికి వచ్చేందుకు ఈ విమానాశ్రయం నిర్మాణం చేపట్టారు. 294 ఎకరాల విస్తీర్ణంలో ఏరాటు చేసిన ఈ విమానాశ్రయంలో ‘వాయుదూత్’ ఎయిర్‌లైన్స్ (21 సీట్ల సామర్ధ్యం) చిన్న విమానాలు మాత్రమే రాకపోకలు సాగించేవి. 2009 అక్టోబరులో ఇదే ఎయిర్‌పోర్టును రామగుండం ఎయిర్ పోర్టుగా 500 ఎకరాల విస్తీర్ణంతో అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు నడిచినా.. తరువాత అవి అటకెక్కాయి. తరువాత 2016లో ఉడాన్ పథకం రావడంతో 2020లో ఎయిర్‌ఫోర్స్ అథారిటీ ఆఫ్‌ఇండియా (ఏఏఐ) ఈ విమానాశ్రయంపై రాష్ట్ర ప్రభుత్వంతోపాటు తాను కూడా చేసిన పలు సాంకేతిక, భౌగోళిక సర్వేలను అధ్యయనం చేసింది. (క్లిక్: ఫ్యాన్సీ నంబర్ కోసం తెగ పోటీ.. నిర్మల్‌లో ఇదే మేటి!)
Comments
Please login to add a commentAdd a comment