అన్నదాతల నుంచి ఆటో డ్రైవర్ల దాకా సర్కార్‌పై ఆగ్రహం: కేటీఆర్‌ | Sakshi
Sakshi News home page

వాళ్లు వెళ్లినంత మాత్రాన పార్టీకి నష్టం లేదు: కేటీఆర్‌

Published Mon, Apr 15 2024 8:05 PM

Lok Sabha Elections: KTR Meeting With Warangal Peddapalli Leaders - Sakshi

సాక్షి, వరంగల్‌/ పెద్దపల్లి: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లిలో భారీ మెజారిటీతో గెలుస్తున్నామన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.  వరంగల్‌లో వంద శాతం విజయం బీఆర్‌ఎస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్‌తో పాటు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో కేటీఆర్‌ సోమవారం సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటు కాంగ్రెస్‌కు.. అటు బీజేపీకి రాష్ట్రంలో ఒకేసారి ఎదురుదెబ్బ తగలబోతోందని అన్నారు. అధికార కాంగ్రెస్‌పై ప్రజాగ్రహం పెరుగుతోందని తెలిపారు. తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు బీజేపీకి లేదని విమర్శించారు. వరంగల్‌లో చివరి క్షణంలో కడియం శ్రీహ‌రి కుటుంబం పార్టీకి మోసం చేసిన వ్యవహారంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని అన్నారు

కొందరు నాయకులు వలస వెళ్లినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని, ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని స్ప‌ష్టం చేశారు. వరంగల్ నుంచి బీఆర్ఎస్ త‌ర‌పున బ‌రిలోకి దిగిన‌ డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ అభ్యర్థిత్వంపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. అందరి ఏకాభిప్రాయంతో అభ్యర్థి ఎంపిక జరిగిందని తెలిపారు. 2001 నుంచి కేసీఆర్‌తో కలిసి నడిచిన సుధీర్ కుమార్ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చైతన్యానికి ప్రతీకైన వరంగల్ ప్రజలు బీఆర్ఎస్‌ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.

మచ్చలేని నాయకుడు కొప్పుల ఈశ్వర్‌
పెద్దపల్లిలో కూడా గులాబీ గెలుపు ఖాయ‌మై పోయింద‌ని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో పాటు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మచ్చలేని నాయకుడిగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొప్పుల ఈశ్వర్ లాంటి ఉద్యమ గొంతుకను ఎన్నుకుంటేనే పార్లమెంట్లో తెలంగాణ వాణిని బలంగా వినిపించగలుగుతారని పేర్కొన్నారు.

అన్నదాతల నుంచి మొదలుకొని ఆటో డ్రైవర్ల దాకా ప్రజలంతా కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని వెల్లడించారు. ఇటు రాష్ట్రంలో, అటు దేశంలో చెప్పుకోవడానికి బీజేపీకి ఎజెండానే లేదని, అందుకే మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి గట్టెక్కాలని చూస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా అసలైన సమస్యలు చర్చకు రాకుండా ప్రజల దృష్టిని మరల్చే ఇలాంటి కుట్రలను క్షేత్రస్థాయిలో తిప్పి కొట్టాలని సూచించారు. 

Advertisement
Advertisement