ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ.205 కోట్ల నిధులు
సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయం
రెండో రాజధానిగా వరంగల్ అభివృద్ధికి చర్యలు
సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. 253 ఎకరాల భూసేకరణకు రూ.205 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రన్‌వే విస్తరణకు కావాల్సిన 205 ఎకరాల భూమిని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు స్వాదీనం చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్‌కు సూచించింది.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దశల వారీగా సమీక్షించి, మామునూరు విమానాశ్రయ స్థల సేకరణలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించడం, రోజుల వ్యవధిలోనే స్థల సేకరణకు అవసరమైన నిధులు మంజూరు చేయించడంతో విమానాశ్రయ పనుల్లో ముందడుగు పడినట్టయ్యింది.
ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లతో కూడిన డీపీఆర్ వేగంగా సిద్ధం చేయాలని ఎయిర్‌పోర్ట్ అథారిటీకి ఆర్‌అండ్‌బీ శాఖ లేఖ కూడా రాసింది. వరంగల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం రానున్న నేపథ్యంలో విమానాశ్రయానికి సంబంధించి ముందడుగు పడడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
నెల రోజుల్లోనే పురోగతి ఇలా..
» ఈ ఏడాది అక్టోబర్ 23న రాజీవ్‌గాంధీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌లో బోర్డు మీటింగ్ నిర్వహించారు. మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల పరిధి ఒప్పందాన్ని జీఎమ్మాఆర్ సంస్థ విరమించుకుంది.
» ఆ తర్వాత మంత్రి కోమటిరెడ్డి అధ్యక్షతన మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 253 ఎకరాల భూసేకరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
» మంత్రి కొండా సురేఖతోపాటు ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, ఎంపీ కడియం కావ్య తదితరులు భూనిర్వాసితులతో సమావేశమై వారి డిమాండ్లను కలెక్టర్‌కు విన్నవించాలని కోరారు.
» ఆ తర్వాత కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆధ్వర్యాన రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. భూసేకరణకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి సమరి్పంచడంతో అందుకు కావాల్సిన రూ.205 కోట్ల నిధులను మంజూరు చేసింది. సాధ్యమైనంత తొందరగా భూసేకరణ పూర్తి చేయాలని కలెక్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
అందరి దృష్టి పరిహారంపైనే..
ఎయిర్‌పోర్ట్‌కు సేకరించే భూములకు సంబంధించి ఎకరాకు గవర్నమెంట్ వ్యాల్యూ రూ.6లక్షలు ఉంది. భూనిర్వాసితులకు పరిహారం మూడింతలు చెల్లించాలనుకున్నా ఎకరాకు రూ.18 లక్షలు ఇచ్చే అవకాశముంది. రెవెన్యూ అధికారులు రూ.25 లక్షల వరకు చెల్లించే దిశగా ఆలోచన చేస్తున్నారు. రైతుల నుంచి ఒత్తిడి ఎక్కువైతే తమ విచక్షణాధికారాలు ఉపయోగించి ఇంకాస్త పెంచాలని యోచిస్తున్నారు.
బహిరంగ మార్కెట్‌లో ఎకరాకు రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతుండడంతో రైతుల నుంచి ప్రతిస్పందన ఎలా ఉంటుందోనని అధికారులు హైరానా పడుతున్నారు. మరోవైపు ఎన్ని వ్యవసాయ బావులు, బోర్లు పోతున్నాయనే వివరాలను సోమవారం నుంచి రెవెన్యూ అధికారులు సేకరించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన తర్వాత ఆయా గ్రామాల్లో సభలు నిర్వహించి పరిహారంపై స్పష్టతనిచ్చే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment