second capital
-
వివాదంగా రెండో రాజధాని నినాదం
సాక్షి, చెన్నై: తమిళనాడు రెండో రాజధాని అంశంపై మంత్రుల్లో భిన్నస్వరం బయలుదేరింది. తిరుచ్చిని రెండో రాజధానిగా ప్రకటించాలని మంత్రి వెల్లమండి నటరాజన్ నినాదాన్ని అందుకున్నారు. దీనికి కాంగ్రెస్ ఎంపీ తిరునావుక్కరసర్ మద్దతు ఇవ్వడం గమనార్హం. రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం రెండో రాజధాని ఏర్పాటు చేయాలన్న నినాదాన్ని రెవెన్యూ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ అందుకున్న విషయం తెలిసిందే. ఇందుకు మరో మంత్రి సెల్లూరు కె రాజు మద్దతు ప్రకటించారు. అలాగే, దక్షిణ తమిళనాడులో మదురైకు సమీపంలో ఉన్న జిల్లాల్లోనూ రెండో రాజధాని నినాదం మిన్నంటుతోంది. ( దిండుగల్‌లో పోస్టర్ల హల్చల్ ) మంత్రి ఆర్బీ ఉదయకుమార్ తన నినాదాన్ని సీఎం పళనిస్వామి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. దక్షిణ తమిళనాడులోని జిల్లాల్లో ఉన్న ఓటు బ్యాంక్‌ను గురిపెట్టి మదురైను రెండో రాజధానిగా ప్రకటించవచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. ఇది కాస్త తిరుచ్చి జిల్లాకు చెందిన అన్నాడీఎంకే నేత, మంత్రి వెల్లమండి నటరాజన్‌ను కలవరంలో పడేసినట్టుంది. మదురై కన్నా, తిరుచ్చి అన్నింటికీ మిన్న నినాదాన్ని అందుకునేలో పడ్డారు. తిరుచ్చికే ప్రాధాన్యం.. చెన్నై తర్వాత రెండో రాజధాని అంటే తిరుచ్చికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి వెల్లమండి నటరాజన్ బుధవారం నినాదాన్ని అందుకున్నారు. దివంగత నేత ఎంజీఆర్ గతంలో తిరుచ్చిని రెండో రాజధానిగా ప్రకటించాలన్న నిర్ణయానికి వచ్చేశారని, అయితే, పరిస్థితుల ప్రభావంతో అది అమలుకు నోచుకోలేదన్నారు. ప్రస్తుతం తిరుచ్చి పేరును సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. తిరుచ్చి నినాదానికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ఆపార్టీ ఎంపీ తిరునావుక్కరసర్ మీడియాతో మాట్లాడుతూ, రెండో రాజధానికి తిరుచ్చి అనుకూలమనిపేర్కొన్నారు. ఇందుకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. మంత్రులు కొందరు మదురై, మరికొందరు తిరుచ్చి అనడం అన్నాడీఎంకే గ్రూపు వివాదాలను మరో మారు తెరపైకి తెచ్చినట్టుగా పరిస్థితి మారింది. -
తమిళనాడులో తెరపైకి రెండో రాజధాని
-
ఉత్తరాఖండ్‌కు మూడు రాజధానులు
-
ఉత్తరాఖండ్ రెండో రాజధానిగా గైర్‌సెయిన్
డెహ్రాడూన్: చమోలీ జిల్లాలోని గైర్‌సెయిన్ పట్టణాన్ని రాష్ట్ర రెండో రాజధానిగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. గవర్నర్ బేబీ రాణి మౌర్య ఆమోదం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్పల్కుమార్ సింగ్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. గైర్‌సెయిన్‌ను రెండో రాజధానిగా (వేసవి) మారుస్తామని మార్చి 4న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ పేర్కొన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గైర్‌సెయిన్‌కు దక్కిన వేసవి రాజధాని హోదాను ఉత్తరాఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిన వేలాది మంది ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. గైర్‌సెయిన్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు. తాము అధికారంలోక వస్తే గైర్‌సెయిన్‌ను వేసవి రాజధానిగా మారుస్తామంటూ 2017 అసెంబ్లీ ఎన్నికల దార్శనిక పత్రంలో బీజేపీ హామీ ఇచ్చింది. ప్రస్తుతం డెహ్రాడూన్ నగరం ఉత్తరాఖండ్ పరిపాలనా రాజధానిగా కొనసాగుతోంది. -
హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా చేయాలి
కాచిగూడ: హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని కోరుతూ దక్షిణ భారత రాజకీయ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం సోమవారం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడును కలిసి వినతిపత్రం అందజేసింది. హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా ఏర్పాటు చేస్తే దక్షిణ భారతదేశానికి పరిపాలనలో సముచిత స్థానం కల్పించినట్లవుతుందన్నారు. ఫలితంగా దక్షిణ భారత్ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని అప్పట్లోనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచించారని గుర్తు చేశారు. దక్షిణ భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా సుప్రీంకోర్టు బెంచీని ఏర్పాటు చేయాలని, పార్లమెంట్ భవన నిర్మాణం జరగాలని కోరారు. ప్రతి విషయానికి ఢిల్లీకి వెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల ప్రయాణభారం అధికమవుతుందన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తే దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు సమగ్రాభివృద్ధి చెందుతాయన్నారు. దక్షిణ భారతదేశ అడ్వొకేట్స్ జేఏసీ కన్వీనర్ ఎస్.నాగేందర్, ప్రతినిధులు మీర్ మసూద్‌ఖాన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం రమేష్ ఈ నాలుగేళ్లు ఎక్కడికెళ్లావ్
సాక్షి, కడప కోటిరెడ్డి సర్కిల్ : స్వార్థ రాజకీయాల పేరుతో దొంగ దీక్షలు చేపట్టి రాయలసీమ ప్రజలను మోసగించొద్దు. ఈ నాలుగేళ్లలో మీ పుణ్యమా? అని రాయలసీమ నాశనం అయిందని, ఈ ప్రాంత అభివృద్ధి అంశాలపై ఏ చర్చకైనా సిద్ధమా? అని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ విష్ణువర్ధన్‌రెడ్డి టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. శనివారం కడపలోని వైఎస్సార్ మొమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన టీడీపీ తీరుపై నిప్పులు చెరిగారు. రాయలసీమ ప్రాంతాన్ని నాశనం చేయడానికి కడపను వేదికగా చేసుకుని రాజకీయాలు చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.దీనిని తిప్పి కొట్టడానికి రెండు కోట్ల జనాభా సిద్ధంగా ఉందని హెచ్చరించారు. నాలుగేళ్లుగా సీఎం మొదలుకుని టీడీపీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కడపలో ఉక్కుఫ్యాక్టరీ సాధ్యం కాదని పలు వేదికలపై చెప్పి ఇప్పుడు ఏర్పాటుకు కేంద్రం వ్యతిరేకిస్తోందని నెపం వేస్తే సహించేది లేదన్నారు. కడప ఉక్కు పరిశ్రమను మేం బాధ్యతగా తీసుకుంటాం. వైఎస్సార్ జిల్లాలో ఎన్నో పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఉదాహరణకు దాదాపు రూ.250 కోట్లు ఖర్చు చేసిన ఏపీ కార్ల్, చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ, ప్రొద్దుటూరు, మైదుకూరుల్లోని పాలకర్మాగారాలు, దాణా ఫ్యాక్టరీ, తెలుగు గంగ, హాంద్రీ నీవా ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాయలసీమ అభివృధ్ధిపై చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి బయటకు రావాలని సీఎం రమేష్‌కు విష్ణువర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు. నాలుగేళ్లుగా ఉక్కుఫ్యాక్టరీ గురించి ఏ మాత్రం పట్టించుకోని మీరు ఇప్పుడు తగుదునమ్మా అంటూ దీక్షలు చేస్తామనడం సిగ్గు అనిపించలేదా? అని ప్రశ్నిస్తున్నామన్నారు. రాయలసీమను రెండో రాజధానిగా ప్రకటించే ధైర్యం టీడీపీకి ఉందా? పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, జమ్ముకాశ్మీర్‌లు రెండో రాజధానిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని, అదే తరహాలో రాయలసీమలో రెండో రాజధానిని 30 రోజుల్లో ప్రభుత్వంతో ఒప్పించి ఏర్పాటు చేయించగలరా? అని సవాల్ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు కందుల రాజమోహన్‌రెడ్డి, సింగారెడ్డి రామచంద్రారెడ్డి, పార్థసారధి,గోసుల శ్రీనివాసరెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగాధర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పుప్పాల శ్రీనాధరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు భవానీరెడ్డి, తదితరులు పాల్గొని మాట్లాడారు. -
రెండో రాజధాని.. సీఎం అనూహ్య నిర్ణయం
ఈ సంవత్సరం చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ధర్మశాలను తమ రాష్ట్రానికి రెండో రాజధానిగా ఆయన ప్రకటించారు. 70 లక్షల జనాభా ఉన్న అతి చిన్న రాష్ట్రానికి రెండో రాజధానిని ప్రకటించడం ద్వారా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ధౌలాధర్ పర్వతశ్రేణిలో ఉన్న ధర్మశాల చాలా అద్భుతమైన ప్రాంతమని, దీనికి చారిత్రక ప్రాధాన్యం కూడా ఉన్నందున రాష్ట్రానికి రెండో రాజధాని అయ్యే అర్హతలన్నీ ఉన్నాయని ఆయన చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లోని దిగువ ప్రాంతాలైన కాంగ్రా, చంబా, హమీర్పూర్, ఉనా జిల్లాలకు ధర్మశాల చాలా ముఖ్యమైన ప్రాంతం. పైగా, రాష్ట్రంలోని మొత్తం 68 అసెంబ్లీ సీట్లలో 25 ఈ జిల్లాల్లోనే ఉన్నాయి. దాంతో ఇక్కడకు ఒక రాజధాని నగరాన్ని ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతవాసులను ఆకట్టుకోవాలన్నది సీఎం వ్యూహంలా కనిపిస్తోంది. రాజధాని నగరంలో పనులు చేసుకోవాలంటే షిమ్లా వరకు దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉండదని, తమకు దగ్గర్లోనే ఉన్న ధర్మశాలలో ఆ పనులు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. దలైలామా ఆశ్రమం ఉండటం, ప్రకృతి అనుకూలత, అడ్వంచర్ టూరిజానికి కేంద్రం కావడం.. ఇలా పలు రకాలుగా ధర్మశాల ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయంగా పేరు పొందింది. ఇప్పుడు రాష్ట్రానికి రెండో రాజధాని హోదా రావడంతో మరింత ముందుకెళ్తుంది. -
హిమాచల్ రెండో రాజధానిగా ధర్మశాల
షిమ్లా: ధర్మశాలను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రెండో రాజధానిగా ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ గురువారం ప్రకటించారు. కాంగ్రా జిల్లాలో ఉండే ధర్మశాలకు ఇప్పటికే ఎంతో ప్రాముఖ్యత ఉందనీ, రెండో రాజధానిగా ఈ నగరం సముచితంగా ఉంటుందన్నారు. శీతాకాల విడిదికి విచ్చేసిన ముఖ్యమంత్రి ప్రస్తుతం ధర్మశాలలోనే ఉంటున్నారు. 2005లో తొలిసారి ఇక్కడ పూర్తిస్థాయి శీతాకాల అసెంబ్లీ సమావేశాలను నిర్వహించారు. ఇప్పటికే 12 సార్లు ఇక్కడ శీతాకాల సమావేశాలు జరిగాయి. ధర్మశాలలో పూర్తిస్థాయి శాసనసభ భవనం కూడా అందుబాటులో ఉంది. -
'రెండో రాజధాని అనే ఆలోచన లేదు'
కర్నూలు: రాష్ట్రానికి కర్నూలు రెండో రాజధాని అనే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. అధికార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం కర్నూలు వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హమీల మేరకు ప్రజలకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలపై కొన్ని పార్టీలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని యనమల భరోసా ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకోని... మంత్రిమండలి సమావేశంలో చర్చించి పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని యనమల తెలిపారు. -
గోడు చెప్పుకుందాం
- జిల్లాకు విచ్చేసిన శివరామక్రిష్ణన్ కమిటీ - నేడు రెవెన్యూ భవన్లో భేటీ సాక్షి, అనంతపురం : అన్ని విధాలుగా వెనకబడిన జిల్లా అభివృద్ది చెందాలంటే అనంతపురంలో రెండవ రాజధాని ఏర్పాటు చేయాలంటూ డిమాండ్‌ను లేవనెత్తిన నాయకులు కదలి రావాల్సిన సమయం వచ్చింది. నవ్యాంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడుండాలో అధ్యయనం చేయడానికి నియమించిన శివరామక్రిష్ణన్‌కమిటీ సోమవారం రాత్రి జిల్లాకు చేరుకుంది. పనిలో పనిగా కేంద్ర, రాష్ట్ర సంస్థల ఏర్పాటుకు సంబంధించి కూడా ఈ కమిటీ ప్రభుత్వానికి సూచించనున్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరిన కమిటీ జిల్లాలోకి ప్రవేశించగానే గుత్తిలో ప్రభుత్వ అధికారులతో జిల్లా సమాచారాన్ని సేకరించారు. జిల్లా ప్రాముఖ్యత, చారిత్రాత్మక విషయాలు, గుత్తి కోట ప్రాముఖ్యత గురించి అధికారులు కమిటీ సభ్యులకుక్షుణ్ణంగా వివరించారు. రాత్రి 9గంటలకు అనంతపురం చేరుకున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో కమిటీ జిల్లావాసులతో భేటీ కానుంది. తొలుత అధికారులతో జిల్లా స్థితిగతులపై సమీక్షిస్తారు. అనంతరం 11 గంటలకుప్రజాప్రతినిధులు, మేధావులు, ప్రజాసంఘాలు, జిల్లా ప్రజల వినతులు స్వీరించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రాతికేయుల సమావేశంలో మాట్లాడనున్నారు. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌పై గత వారం ఎస్కేయూలో మేధావుల సదస్సు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సదస్సులో పాల్గొన్న వారితో పాటు నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతి నిధులు, ప్రతిపక్ష నేతలు కమిటీ ఎదుట హాజరై డిమాండ్లను విన్నవించుకోనున్నారు.