మంత్రి వెల్లమండి నటరాజన్
సాక్షి, చెన్నై: తమిళనాడు రెండో రాజధాని అంశంపై మంత్రుల్లో భిన్నస్వరం బయలుదేరింది. తిరుచ్చిని రెండో రాజధానిగా ప్రకటించాలని మంత్రి వెల్లమండి నటరాజన్ నినాదాన్ని అందుకున్నారు. దీనికి కాంగ్రెస్ ఎంపీ తిరునావుక్కరసర్ మద్దతు ఇవ్వడం గమనార్హం. రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం రెండో రాజధాని ఏర్పాటు చేయాలన్న నినాదాన్ని రెవెన్యూ మంత్రి ఆర్‌బీ ఉదయకుమార్ అందుకున్న విషయం తెలిసిందే. ఇందుకు మరో మంత్రి సెల్లూరు కె రాజు మద్దతు ప్రకటించారు. అలాగే, దక్షిణ తమిళనాడులో మదురైకు సమీపంలో ఉన్న జిల్లాల్లోనూ రెండో రాజధాని నినాదం మిన్నంటుతోంది. ( దిండుగల్‌లో పోస్టర్ల హల్‌చల్ )
మంత్రి ఆర్‌బీ ఉదయకుమార్ తన నినాదాన్ని సీఎం పళనిస్వామి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. దక్షిణ తమిళనాడులోని జిల్లాల్లో ఉన్న ఓటు బ్యాంక్‌ను గురిపెట్టి మదురైను రెండో రాజధానిగా ప్రకటించవచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. ఇది కాస్త తిరుచ్చి జిల్లాకు చెందిన అన్నాడీఎంకే నేత, మంత్రి వెల్లమండి నటరాజన్‌ను కలవరంలో పడేసినట్టుంది. మదురై కన్నా, తిరుచ్చి అన్నింటికీ మిన్న నినాదాన్ని అందుకునేలో పడ్డారు.
తిరుచ్చికే ప్రాధాన్యం..
చెన్నై తర్వాత రెండో రాజధాని అంటే తిరుచ్చికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి వెల్లమండి నటరాజన్ బుధవారం నినాదాన్ని అందుకున్నారు. దివంగత నేత ఎంజీఆర్ గతంలో తిరుచ్చిని రెండో రాజధానిగా ప్రకటించాలన్న నిర్ణయానికి వచ్చేశారని, అయితే, పరిస్థితుల ప్రభావంతో అది అమలుకు నోచుకోలేదన్నారు. ప్రస్తుతం తిరుచ్చి పేరును సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. తిరుచ్చి నినాదానికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ఆపార్టీ ఎంపీ తిరునావుక్కరసర్ మీడియాతో మాట్లాడుతూ, రెండో రాజధానికి తిరుచ్చి అనుకూలమనిపేర్కొన్నారు. ఇందుకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. మంత్రులు కొందరు మదురై, మరికొందరు తిరుచ్చి అనడం అన్నాడీఎంకే గ్రూపు వివాదాలను మరో మారు తెరపైకి తెచ్చినట్టుగా పరిస్థితి మారింది.
Comments
Please login to add a commentAdd a comment