ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు వినతిపత్రం అందజేస్తున్న జేఏసీ ప్రతినిధులు
కాచిగూడ: హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని కోరుతూ దక్షిణ భారత రాజకీయ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం సోమవారం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడును కలిసి వినతిపత్రం అందజేసింది. హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా ఏర్పాటు చేస్తే దక్షిణ భారతదేశానికి పరిపాలనలో సముచిత స్థానం కల్పించినట్లవుతుందన్నారు. ఫలితంగా దక్షిణ భారత్ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని అప్పట్లోనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచించారని గుర్తు చేశారు. దక్షిణ భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా సుప్రీంకోర్టు బెంచీని ఏర్పాటు చేయాలని, పార్లమెంట్ భవన నిర్మాణం జరగాలని కోరారు. ప్రతి విషయానికి ఢిల్లీకి వెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల ప్రయాణభారం అధికమవుతుందన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తే దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు సమగ్రాభివృద్ధి చెందుతాయన్నారు. దక్షిణ భారతదేశ అడ్వొకేట్స్ జేఏసీ కన్వీనర్ ఎస్.నాగేందర్, ప్రతినిధులు మీర్ మసూద్‌ఖాన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment