Political JAC
-
ఆర్టీసీ జేఏసీ మరో కీలక నిర్ణయం
-
సమ్మె: ఆర్టీసీ జేఏసీ మరో కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై పొలిటికల్ జేఏసీతో ఆదివారం ఆర్టీసీ జేఏసీ భేటీ అయింది. ఆర్టీసీ సమ్మె భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం మరోసారి గవర్నర్ తమిళసైని కలువాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకుంది. 16వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలంటూ గవర్నర్‌ను కోరాలని జేఏసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం కూడా ఆర్టీసీ జేఏసీ మరోసారి సమావేశమవుతుందని, ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవాలన్నదే తమ లక్ష్యమని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోరాదని, విజయం సాధించేవరకు పోరాడుదామని అన్నారు. కార్మికుల ప్రయోజనాలు కాపాడటమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. భవిష్యత్ కార్యాచరణ ఇదే పొలిటికల్ జేఏసీతో భేటీ అనంతరం ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. ఈ నెల 21న అన్ని ఆర్టీసీ డిపోల ముందు కార్మికులు తమ కుటుంబసభ్యులతో కలిసి బైఠాయించనున్నారు. 22న మా పొట్టకొట్టొద్దని తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను కార్మికులు విజ్ఞప్తి చేయనున్నారు. 23న ప్రజాప్రతినిధులను కలిసి సమ్మెకు మద్దతు తెలపాలని, సమ్మెలో భాగస్వామ్యం కావాలని కోరనున్నారు. 24న మహిళా కండక్టర్ల దీక్ష, 25న హైవేలు, రహదారులపై రాస్తారోకోలు చేపట్టనున్నారు. 26న ప్రభుత్వం మనసు మారాలని ఆర్టీసీ కార్మికుల పిల్లలతో దీక్ష చేప్టనున్నారు. 27న పండగ సందర్భంగా జీతాలు లేకపోవడంవల్ల నిరసన, 28న సమ్మెపై హైకోర్టు విచారణ సందర్భంగా విరామం. ఇక, ఈ నెల 30న 5లక్షల మందితో సకల జనుల సమర భేరి నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించిన వేదికను త్వరలో ప్రకటిస్తామని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. -
హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా చేయాలి
కాచిగూడ: హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని కోరుతూ దక్షిణ భారత రాజకీయ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం సోమవారం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడును కలిసి వినతిపత్రం అందజేసింది. హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా ఏర్పాటు చేస్తే దక్షిణ భారతదేశానికి పరిపాలనలో సముచిత స్థానం కల్పించినట్లవుతుందన్నారు. ఫలితంగా దక్షిణ భారత్ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని అప్పట్లోనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచించారని గుర్తు చేశారు. దక్షిణ భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా సుప్రీంకోర్టు బెంచీని ఏర్పాటు చేయాలని, పార్లమెంట్ భవన నిర్మాణం జరగాలని కోరారు. ప్రతి విషయానికి ఢిల్లీకి వెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల ప్రయాణభారం అధికమవుతుందన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తే దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు సమగ్రాభివృద్ధి చెందుతాయన్నారు. దక్షిణ భారతదేశ అడ్వొకేట్స్ జేఏసీ కన్వీనర్ ఎస్.నాగేందర్, ప్రతినిధులు మీర్ మసూద్‌ఖాన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
టీ జేఏసీ నిర్వీర్యానికి భారీ కుట్ర: జీవన్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పెద్దన్న పాత్ర పోషించిన పొలిటికల్ జేఏసీని నిర్వీర్యం చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. టీజేఏసీ నుంచి వైదొలగుతున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించడం సరి కాదని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గురువారం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వారు... అభివృద్ధి విషయంలో ప్రభుత్వం సరైన పద్దతిలో తీసుకెళ్లేందుకు దోహదపడాలన్నారు. ప్రస్తుతం జేఏసీ టీమ్‌కు గతంలో కంటే ప్రస్తుతం బాధ్యత మరింత పెరిగిందన్నారు. కానీ ఉద్యోగ సంఘాలు వారి సమస్యలకే ప్రాధాన్యం ఇస్తామంటూ పక్కకు తప్పుకోవడం బాధాకరమన్నారు. టీజేఏసీని బలోపేతం చేయాల్సిన అవసరం తెలంగాణ సమాజంపై ఉందని, కనుక కాంగ్రెస్ పార్టీ కూడా వెనక ఉంటుందన్నారు. -
తెలంగాణ ఉద్యమ వేదిక ఆవిర్భావం
- చెరుకు సుధాకర్ నేతృత్వంలో నకిరేకల్‌లో పతాకావిష్కరణ - ఏకమవుతున్న టీఆర్ఎస్ మాజీ నేతలు - రాజకీయ ప్రత్యామ్నాయంగా రూపుదిద్దుకునే యోచన సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ పునాదులే ఆశయాలుగా మరో రాజకీయ ‘వేదిక’ పురుడు పోసుకుంటోంది. టీఆర్ఎస్లో గతంలో పనిచేసి నిర్లక్ష్యానికి గురైన వారు, రాజకీయ జేఏసీలో క్రియాశీల పాత్ర పోషించిన నేతలు ఏకమయ్యేందుకు ఇది మరో వేదిక కాబోతోంది. ప్రభుత్వం వైఖరికి వ్యతిరేకంగా, రాజకీయ జేఏసీ ఉదాసీన వైఖరికి సమాంతరంగా సామాజిక వర్గాల కోణంలో ఏర్పాటు చేస్తున్న ఈ సంస్థను రాజకీయ ప్రత్యామ్నాయంగా మారుస్తామని కొత్త వేదిక రూపకర్తలు చెబుతున్నారు. రాష్ట్ర సాధన ఫలాలు క్షేత్రస్థాయికి చేరుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వారంటున్నారు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో మేడే సందర్భంగా టీఆర్ఎస్ మాజీ నేత డాక్టర్ చెరుకు సుధాకర్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమ వేదిక పతాకాన్ని ఆవిష్కరించారు. సంప్రదాయానికి భిన్నంగా... సంప్రదాయ నాయకత్వానికి భిన్నంగా ముందుకెళ్లే యోచనలో వేదిక నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీలు ప్రతిపక్ష పార్టీలుగా చెపుతున్నా.. ఆ పార్టీల నేతలు అట్టడుగు వర్గాల భాగస్వామ్యం గురించి ప్రశ్నించడం లేదని, అందుకే తాము రాజకీయ ప్రత్యామ్నాయంగా ముందుకెళ్లాలని వారు భావిస్తున్నారు. చిలకపచ్చ పతాకం వేదిక పతాకాన్ని పరిశీలిస్తే.. ఇందులో అనేక ఉద్యమ, సామాజిక కోణాలు కనిపిస్తున్నారు. ముఖ్యంగా వేదికపై ఉద్యమ యోధురాలు చాకలి ఐలమ్మ, ప్రొఫెసర్ జయశంకర్‌ల చిత్రపటాలను ముద్రించారు. నీలిరంగు తెలంగాణ చిహ్నంలో ఎరుపు రంగు పిడికిలి ముద్రించారు. పతాకాన్ని చిలకపచ్చ రంగుతో తయారు చేయడం గమనార్హం. ఉద్యమ హామీల అమలుకు పోరాడాలి జేఏసీ నేతలు పిట్టల రవీందర్, గురజాల రవీందర్ రావు జనగామ : ‘తెలంగాణ సాధనకు ఎలా పోరాడామో... ఇప్పుడు సమస్యల సాధనకు అదేవిధంగా పోరాడేందుకు అందరూ ఏకమవ్వాలి. సామాజిక తెలంగాణ కోసం మరో ఉద్యమం చేయాలి.. కోదండరాం నేతృత్వంలోని జేఏసీ స్తబ్దంగా మారింది. ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిలదీతలు లేవు.. ఉద్యమ కాలం నాటి హామీలను కేసీఆర్ ప్రభుత్వం మరి చింది. మన సమస్యల సాధనకు మరో వేదిక అవసరం.. దీని విధివిధాలనాలను త్వరలోనే ప్రకటించుకుందాం.. బైరాన్‌పల్లి అమరుల స్ఫూర్తిగా.. పోరుగడ్డ జనగామ నుంచే ఉద్య మం ప్రారంభిద్దాం’అని జేఏసీ రాష్ట్ర సమన్వయకర్త పిట్టల రవీందర్, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురజాల రవీందర్రావు అన్నారు. వరంగల్ జిల్లా జనగామలో జేఏసీ డివిజన్ కన్వీనర్ కన్నా పరుశరాములు అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం ఉద్యమకారుల సన్నాహక సమావేశం నిర్వహించారు. అతిథులుగా పిట్టల రవీందర్, గురజాల రవీందర్రావులు హాజరయ్యారు. సమావేశంలో వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాథమ్యాలను మరిచిందన్నారు. తెలంగాణ ద్రోహులను కేసీఆర్ చేరదీస్తున్నాడని అన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కోల జనార్దన్, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం కేసీఆర్‌ను కలిసిన కోదండరామ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామ్ కలిశారు. మంగళవారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌ను కలుసుకుని తన కుమారుడి వివాహానికి ఆహ్వానించారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై ‘లెఫ్ట్’ కన్ను
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో తమ సానుభూతిపరులను బరిలోకి దింపాలని సీపీఐ, సీపీఎం ప్రయత్నిస్తున్నాయి. ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదగాలనే ఆలోచనతో ఉన్న వామపక్ష పార్టీలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఇందుకు ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయి. మేధావులైన వారిని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంతోపాటు ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల నియోజకవర్గానికి జరిగే ఎన్నికల బరిలో దింపేందుకు తొలుత ప్రయత్నించాయి. రాజకీయ జేఏసీకి చెందిన ముఖ్యనేతలను పోటీకి దించేందుకు ప్రయత్నించినా అవి ఫలించలేదు. దీంతో తమ సానుభూతిపరులను పోటీ చేయిం చాలని లెఫ్ట్ పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన జనార్దనరెడ్డి పేరును సీపీఎం ప్రతిపాదించినట్లు తెలిసింది. మరోవైపు సినీనేపథ్య గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌ను అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేలా ఒప్పించాలని సీపీఐ ప్రయత్నిస్తోంది. ఇక ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల నియోజక వర్గం నుంచి భోగా శ్రీనివాసరావు (క్రాంతి శ్రీనివాస్)ను పోటీ చేయించాలని సీపీఎం యత్నిస్తుండగా.. పార్టీ నేత బొమ్మగాని ప్రభాకర్‌ను బరిలోకి దింపాలని సీపీఐ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పది వామపక్షాల సమావేశంలో ఈ అంశం చర్చకు రాగా, ఈ ప్రతిపాదనలపై మిగతాపార్టీల నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు. ఒకవైపు ఇరు పార్టీలు మెరుగైన సమన్వయం కోసం ప్రయత్నిస్తూ మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటాపోటీగా అభ్యర్థులను ప్రతిపాదించడంపై విస్మయం వ్యక్తమైనట్లు తెలిసింది. -
బంద్...
- 300 మందికి పైగా అరెస్ట్.. విడుదల - బస్సు సర్వీసులకు ఆటంకం - పలుచోట్ల దిష్టిబొమ్మల దహనం సాక్షి, సిటీబ్యూరో: ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రలో కలుపుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రాజకీయ జేఏసీ, టీఆర్ఎస్, వామపక్ష పార్టీలు శనివారం చేపట్టిన తెలంగాణ బంద్ నగరంలో స్వల్ప ఉద్రిక్తల నడుమ ప్రశాంతంగా ముగిసింది. బంద్ వ ల్ల ఆర్టీసీ ముందస్తుగా 250 బస్సులను రద్దు చేసింది. 500 సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎంఎంటీఎస్ రైలే సర్వీసులు యధావిధిగా నడిచాయి. ఆందోళనకారులు ఉదయం ఏడు గంటలకే రోడ్డు పైకి వచ్చి విద్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, సినిమా హాళ్లు, పెట్రోలు బంక్‌లను బలవంతంగా బంద్ చేయించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల, జేఎన్టీయూ క్యాంపస్, సాగర్ రింగ్ రోడ్డు, ఎల్బీ నగర్, చందా నగర్, ఫలక్‌నుమా స్టేషన్, ముసారంబాగ్, కొత్తపేట్, చాదర్‌ఘాట్, సైదాబాద్, మాదన్నపేట, సరూర్‌నగర్, మల్కజ్గిరి, బాలాపూర్ చౌరస్తాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలనూ దహనం చేశారు. హస్తినాపురం చౌరస్తాలో ఏపీ సీఏం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. బంద్ వల్ల మెజంజాహీ మార్కెట్, కోఠి, అబిడ్స్, సికింద్రాబాద్, హబ్సిగూడ, దిల్సుఖ్నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, కూకట్పల్లి, అమీర్‌పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, సోమాజిగూడ, ఖైరతాబాద్, హిమయత్‌నగర్, లక్డీకాపూల్ తదితర ప్రాంతాలు బోసిపోయాయి. జంట నగర కమిషనరేట్ల పరిధిలో సుమారు 300 మంది ఆందోళనకారులను అరెస్టు చేసి, సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అట్టుడికిన ఆర్టీసీ క్రాస్ రోడ్డు నిరసనలు, నినాదాలు, దిష్టిబొమ్మల దహనం, బైఠాయింపులు, అరెస్ట్‌లతో ఆర్టీసీ క్రాస్ రోడ్డు అట్టుడికింది. కొంత మంది ఆందోళనకారులు రోడ్డు పైకి వచ్చిన ఆర్టీసీ బస్సులను ఆపి, టైర్లలో గాలి తీశారు. అవి రోడ్డుపైనే నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో పలువును తెలంగాణ వాదులు చిక్కడపల్లి వైపు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించగా, స్వరాజ్ హోటల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. సీపీఎం ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయగా, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో విద్యానగర్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ సహా సీపీఎం నాయకుడు వీరయ్య, డీజీ న రసింహారావు, సీపీఐ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, అజిజ్ పాషా, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ ఉపాధ్యక్షురాలు విమలక్క, సీపీఐఎం ఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు గోవర్థన్, పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య, పద్మ, సత్య తదితర నాయకులను బలవంతంగా అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నం తెలంగాణ జాగృతికి చెందిన పలువురు కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించగా, ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి చేయి దాటి పోతుండటంతో పోలీసులు ముందస్తుగా తెలంగాణ జాగృతి నేతలను అరెస్టు చేశారు. బువ్వ తెలంగాణ కావాలి... తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో గన్‌పార్కులోని అమర వీరుల స్థూపం వద్ద ప్రజా గాయకుడు గద్దర్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉపాధ్యక్షుడు వేదకుమార్ నిరసన తెలిపారు. ప్రజా కళాకారులు ధూం ధాం ఆటలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ, ఎన్నికలు, రాజకీయ పార్టీల ద్వారా తెలంగాణ రాలేదని, కేవలం ఉద్యమాలతోనే సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. అలా వచ్చిందని ఎవరైనా భ్రమపడితే భవిష్యత్తే వారికి సరైన సమాధానం ఇస్తుందని చెప్పారు. బంగారు తెలంగాణ కంటే ముందు బువ్వ తెలంగాణ కావాలని కోరారు. గిరిజనులపై దాడి లాంటిదే:? - ప్రొఫెసర్ కోదండరామ్ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ అమాయక గిరిజనులపై దాడి చేయడం లాంటిదేనని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు. గత యూపీఏ ప్రభుత్వ విధానాలనే తాము అనుసరిస్తున్నామని బీజేపీ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. యూపీఏ ప్రభుత్వ విధానాలు కొనసాగించేందుకే మీరు అధికారంలోకి వచ్చారా? అని ఘటుగా ప్రశ్నించారు. రాజ్యాంగంపై గౌరవం ఉంటే ఏకపక్షంగా బిల్లును ఆమోదించే వారు కాదని మండిపడ్డారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, పోలవరం ఆర్డినెన్స్‌ను లోకసభలో ఆమోదించి ఖమ్మంలోని రెండు లక్షల మంది గిరిజనులకు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. బిల్లు ఉపసంహరించేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య మాట్లాడుతూ కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ (రాయల వర్గం) కేంద్ర కమిటీ సభ్యుడు పి.సూర్యం మాట్లాడుతూ పోలవరం ఆర్డినెన్స్‌ను అప్రజాస్వామికంగా ఆమోదించారని ధ్వజమెత్తారు.సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం) రాష్ట్ర అధ్యక్షుడు కె.గోవర్థన్ మాట్లాడుతూ బడాపారిశ్రామికవేత్తలకు మేలు చేయడానికే పోలవరం నిర్మిస్తున్నారని ఆరోపించారు. 300 గ్రామాలను ముంచేసి 2 లక్షలకు పైగా గిరిజనుల అస్థిత్వాన్ని దెబ్బ తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రాజకీయ జేఏసీ ఏర్పాటులో అశోక్‌బాబు విఫలం
ఏపీఎన్జీవో సంఘం అధ్యక్ష అభ్యర్థి అబ్దుల్ బషీర్ ఏలూరు, న్యూస్‌లైన్: సమైక్య రాష్ర్టం కోసం పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎంలతో రాజకీయ జేఏసీ ఏర్పాటు చేయడంలో ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు విఫలమయ్యారని సంఘం అధ్యక్ష అభ్యర్థి ఎస్కే అబ్దుల్ బషీర్ ఆరోపించారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులు 64 రోజులపాటు పెద్దఎత్తున ఆందోళన చేపట్టినా అశోక్‌బాబు ఒంటెత్తు పోకడలవల్ల రాష్ట్ర విభజన ప్రక్రియను నిలుపుదల చేయలేకపోయామన్నారు. ఏపీఎన్జీవో సంఘం ఎన్నికల్లో భాగంగా ఓటర్లును కలిసేందుకు ఆయన శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, సమైక్య రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న పార్టీల్లో వైఎస్సార్సీపీ ముందుందన్నారు. ప్రజాభిమానం ఉన్న ఆ పార్టీని అశోక్‌బాబు ఉద్యమంలోకి ఆహ్వానించకపోవడంతో నేడు విభజన పక్రియ అసెంబ్లీ వరకు వచ్చిందన్నారు. హైదరాబాద్ సిటీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు పీవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ, సమైక్య ఉద్యమం ఎగసిపడుతున్న తరుణంలో పొలిటికల్ జేఏసీ ఏర్పాటుచేయాలని అశోక్‌బాబుపై ఒత్తిడి తెచ్చినా ఏర్పాటుచేయలేదన్నారు. అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే మెరుపు సమ్మె చేస్తామని, దిగ్విజయ్‌సింగ్‌ను హైదరాబాద్‌లో కాలుపెట్టనీయబోమని ప్రగల్భాలు పలికిన ఆయన ఇప్పుడెందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. -
రాజకీయానికి వేళకాదు
‘సమైక్య’ అఖిలపక్షం అభిప్రాయం ఇకపైనా ఉద్యోగ జేఏసీ ద్వారానే ఉద్యమం భేటీని తుస్సుమనిపించిన టీడీపీ, కాంగ్రెస్ రాజకీయ జేఏసీ అవసరమే లేదన్న వైనం వైఎస్సార్సీపీ అనుమానించినంతా జరిగింది విభజనవాదులతో వేదిక పంచుకోబోమని ముందే చెప్పిన పార్టీ సీమాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఏర్పాటుచేయ తలపెట్టిన రాజకీయ జేఏసీకి ఇది సరైన సమయం కాదని శనివారం సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశం తేల్చేసింది. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చిన ఈ తరుణంలో రాజకీయ జేఏసీ ఏర్పాటుకు యత్నించడం సమయాన్ని వృథా చేయడమేనని నిర్ధారణకు వచ్చింది. ఇప్పటిదాకా నిర్వహించిన తరహాలోనే భవిష్యత్తులో కూడా ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని కొనసాగించాలని, రాజకీయ పార్టీలు దానికి మద్దతు ఇవ్వాలని తీర్మానించింది. అవసరమైతే అన్ని పార్టీలతో కలిసి, ఉద్యోగ సంఘాల ఉద్యమానికి తోడుగా సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని, సీమాంధ్రలో జిల్లాలవారీగా కూడా జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని మరోసారి చెప్పింది. రాష్ట్ర విభజన ప్రక్రియను అడ్డుకునే అవకాశం ఇప్పుడు ఎమ్మెల్యేల చేతుల్లో ఉందని, కాబట్టి విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో మూకుమ్మడిగా గళం విప్పటమే గాక అఫిడవిట్లు సమర్పించాలని ఆయా పార్టీలను కోరింది. ‘‘సందర్భాన్ని బట్టి రాష్ట్రపతిని కలిసి అఫిడవిట్లు అందజేయాలి. మెజార్టీ ప్రజాప్రతినిధులు విభజనకు వ్యతిరేకంగా ఉన్నారన్న స్పష్టమైన విషయాన్ని ఆయన ముందుంచాలి. తద్వారా బిల్లుకు అంగీకారం తెలపడంపై ఆయన పునరాలోచించే పరిస్థితి తేవాలి. రాష్ట్రపతిని కలిసే విషయంలో పార్టీలన్నీ కలిసి రావాలి’’ అని వేదిక పక్షాన ఏపీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు కోరారు. ఉద్యమ కార్యాచరణ సిద్ధమయ్యాక దాని ఆచరణలో కూడా పార్టీల పూర్తి సహకారం కావాలన్నారు. రాజకీయ జేఏసీ అవసరమే లేదు: కాంగ్రెస్, టీడీపీ రాష్ట్ర విభజనకు సహకరిస్తున్న పార్టీలతో వేదికను పంచుకోవటం ఇష్టం లేదని పేర్కొంటూ ఈ అఖిలపక్షంలో పాల్గొనేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరాకరించడం తెలిసిందే. ఈ విషయంలో వైఎస్సార్సీపీ ఏదైతే అనుమానించిందో, అఖిలపక్షంలో సరిగ్గా అదే జరిగింది. సీమాంధ్ర ఉద్యమానికి ఊపిరులూదేందుకు రాజకీయ జేఏసీ ఏర్పాటుకు ఈ అఖిలపక్షం వేదికవుతుందని భావించగా, టీడీపీ, కాంగ్రెస్ నేతలు మాత్రం దాన్ని తుస్సుమనిపించారు. అసెంబ్లీకి చేరిన బిల్లు అక్కడితో ఆగిపోవాలంటే, అందులో రాజకీయ పార్టీలు పోషించాల్సిన పాత్రే చాలా ఎక్కువగా ఉన్నందున రాజకీయ జేఏసీపై నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న చర్చ ప్రారంభం కాగానే రెండు పార్టీల నేతలు అందుకు పూర్తి వ్యతిరేక అభిప్రాయాలు వెల్లడించారు. రాజకీయ జేఏసీ అవసరమే లేదన్నారు. ఉద్యోగ సంఘాలు యథావిధిగా ఉద్యమం నిర్వహిస్తే తమ వంతు చేయూతనందిస్తామంటూ తేల్చేశారు. దాంతో అఖిలపక్షం ఏర్పాటే హాస్యాస్పదంగా మారిపోయింది. ఏదో హడావుడి చేస్తున్నారంటూ జనం దృష్టిలో పడేందుకు చేసిన ప్రయత్నంగా మారింది. ఎలాంటి కీలక నిర్ణయాలూ తీసుకోకుండా రెండు గంటల పాటు సమావేశాన్ని నిర్వహించి, అంతటితో మమ అనిపించి నేతలు జారుకున్నారు. అఖిలపక్షంతో ఉద్యమానికి కీలక మలుపు ఖాయమనేలా ఎన్నో రోజులుగా ఉద్యోగ సంఘాల నేతలు చెబుతూ వస్తున్నదంతా వ్యర్థమయ్యేలా కాంగ్రెస్, టీడీపీ నేతలు వ్యవహరించారు. పైగా ఇంతకాలం తమను ఉద్యమంలో కలుపుకోలేదంటూ టీడీపీ నేతలు ఒక దశలో ఏపీ ఎన్జీఓల సంఘం నేతలపై ఎదురుదాడికి కూడా దిగారు. ప్రస్తుతమున్న ‘వ్యవస్థ’తోనే భావి ఉద్యమాన్ని నిర్వహించాలని నిర్ణయించామని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అఖిలపక్షం తర్వాత విలేకరులకు చెప్పడం విశేషం. కాంగ్రెస్ తరపున ఎంపీ సబ్బం హరి, మంత్రి శైలజానాథ్, ఉగ్ర నరసింహారెడ్డి, టీడీపీ నుంచి ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యేలు కేశవ్, కె.యి.ప్రభాకర్, శివరామరాజు ఇందులో హాజరయ్యారు. ఎమ్మెల్సీ శ్రీనివాసులు నాయుడు, సీపీఎం నుంచి వై.వెంకటేశ్వరరావు, ఎస్.వీరయ్య, లోక్‌సత్తా నుంచి శ్రీనివాసరావు పాల్గొన్నారు. సొంత ఉద్యమాలే: సీపీఎం, లోక్‌సత్తా ‘‘పార్టీలపరంగా కాకుండా ఆయా పార్టీల్లోని నేతలు ప్రాంతాలుగా విడిపోయి చేస్తున్న ఉద్యమంలో కలిసి రాకూడదన్న ఉద్దేశంతోనే ఇంతకాలం సమైక్యోద్యమాన్ని సొంతంగా నిర్వహించాం. ఇక ముందు కూడా ఇదే పంథాను కొనసాగిస్తాం’’ అని సీపీఎం నేతలు వై.వెంకటేశ్వరరావు, వీరయ్యలు భేటీ అనంతరం స్పష్టం చేశారు. లోక్‌సత్తా నేత శ్రీనివాసరావు కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. మున్ముందు ఉద్యోగ సంఘాలు చేసే సమైక్యోద్యమానికి క్షేత్రస్థాయిలో మద్దతు ఇస్తామని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల చెప్పారు. సమైక్యానికి కట్టుబడ్డామంటూ ఎమ్మెల్యేలతో రాష్ట్రపతికి అఫిడవిట్లు పంపే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగ సంఘాల ఉద్యమానికి కాంగ్రెస్ పక్షాన మద్దతుంటుందని, ఇతర విషయాలపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని శైలజానాథ్ అన్నారు. అఖిలపక్షం విజయవంతం: అశోక్‌బాబు ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో విభజనకు వ్యతిరేకంగా మాట్లాడటంతో పాటు సమైక్యానికి కట్టుబడి ఉన్నామంటూ అఫిడవిట్లు ఇవ్వాలంటూ భేటీ తీర్మానించిందని అశోక్‌బాబు చెప్పారు. ఉద్యమం మొదలయ్యాక మున్నెన్నడూ లేనివిధంగా సమైక్యానికి అనుకూలంగా ఉన్న పార్టీలను ఒక్కచోటికి తెచ్చినందుకు ఈ భేటీ విజయవంతమైందనే భావిస్తున్నామన్నారు. ‘‘సమైక్యానికి కట్టుబడి ఉన్నామని ఇప్పటికే స్పష్టం చేసిన వైస్సార్సీపీ సొంత కారణాలతో భేటీకి రాలేదు. అది ఆ పార్టీ విధాన నిర్ణయమైనందున దాన్ని గౌరవిస్తాం’’ అన్నారు. -
సమైక్యపోరుకు రాజకీయ జేఏసీ!
సాక్షి, హైదరాబాద్: సమైక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వివిధ పార్టీలన్నీ కలిసి రాజకీయ జేఏసీ ఆవిర్భవించే అవకాశం ఉందని, రాజకీయ జేఏసీ ఆవిర్భావానికి శనివారం జరగనున్న అఖిలపక్ష సమావేశం వేదిక కానుందని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. శుక్రవారం ఏపీఎన్జీవో భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు సాధ్యం కాని పక్షంలో ఆయా పార్టీలన్నీ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక(ఎస్‌ఆర్‌పీవీ)కు అండగా నిలవాలని సమావేశంలో కోరనున్నట్లు చెప్పారు. శనివారం ఉదయం 11గంటలకు ఏపీఎన్జీవో భవన్లో ప్రారంభం కానున్న అఖిలపక్ష భేటీకి పార్టీల వారీగా, ప్రాంతాలవారీగా సమైక్యవాదానికి కట్టుబడిన ప్రతినిధులు హాజరు కానున్నారని, విభజనవాదాన్ని వినిపిస్తున్న పార్టీలను అఖిలపక్షానికి ఆహ్వానించలేదని చెప్పారు. పార్టీలు తమ విభేదాలను పక్కనబెట్టి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏం చేయాలనే అంశంపై మాట్లాడాల్సిందిగా కోరారు. ఈ వేదికపై మాట్లాడేందుకు ఇష్టంలేని సమైక్య పార్టీలు వేరొక వేదికపైకి తమను ఆహ్వానించినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అఖిలపక్షానికి పార్టీల ప్రతినిధులతో పాటు కొందరు ఎమ్మెల్యేలు, పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చిన ఎంపీలు హాజరుకానున్నట్లు అశోక్‌బాబు పేర్కొన్నారు. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో సమైక్యవాదులకు ఇదే ఆఖరి పోరాటమన్నారు. అశోక్‌బాబు, పయ్యావుల మంతనాలు సమైక్య రాష్ట్రం కోసం రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేస్తున్నామంటున్న అశోక్‌బాబు, సమన్యాయం సిద్ధాంతంలో సమైక్య వాదం అంటున్న టీడీపీ నేత పయ్యావుల కేశవ్ శుక్రవారం రహస్యంగా మంతనాలు జరిపారు. అశోక్‌బాబు ప్రెస్‌మీట్ ముగుస్తుండగానే.. పయ్యావుల అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఈ కలయికకు కారణమేంటని విలేకరులు అడిగినా ఏమీ చెప్పకుండా అశోక్‌బాబుతో కలిసి ఓ గదిలో తలుపులు వేసుకొని అరగంటకుపైగా రహస్యంగా సంభాషించారు. అనంతరం అశోక్‌బాబుతో కలసి బయటకు వచ్చిన పయ్యావుల మీడియాతో మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం అలుపెర గని పోరాటం చేస్తున్న ఏపీఎన్జీవోలు రాజకీయ పక్షాలతో అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయడం చారిత్రక అవసరమన్నారు. తమది సమైక్యవాదం అని చెప్పిన వైఎస్సార్సీపీ.. టీఆర్ఎస్తో డ్యూయెట్లు, కాంగ్రెస్‌తో కాపురం, బీజేపీతో సహజీవనం చేస్తోందని ఆరోపించారు. భేషజాలను పక్కనబెట్టి సమైక్య రాష్ట్రం కోసం జరుగుతున్న అఖిలపక్ష భేటికి రావాలని వైఎస్ జగన్‌ను కోరుతున్నానని చెప్పారు. ‘‘సమైక్యవాదమే తమ పార్టీ స్టాండ్‌గా వైఎస్సార్ సీపీ ప్రకటిస్తుంటే.. చంద్రబాబు మాత్రం తనది ఏవాదమో ఇంతవరకు ఎందుకు చెప్పలేకపోతున్నారని..’’ అక్కడే ఉన్న ‘సాక్షి’ ప్రతినిధి ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రం కోసం జరుగుతున్న అఖిలపక్ష భేటీకి అన్ని పార్టీలవారూ కలసిరావాలని కోరుతున్న మీరు, మీ పార్టీ అధ్యక్షుడిని ఈ సమావేశానికి తీసుకురాగల రా?, కనీసం ఆయన నోటి వెంట ఒక్కసారైనా తనది సమైక్యవాదమని చెప్పించగలరా? అని అడిగిన ప్రశ్నలకు పయ్యావుల నుంచి సమాధానాలు కరువయ్యాయి. -
రాజకీయ జేఏసీ ఏర్పాటుకు యత్నం
పజాప్రతినిధుల ఇళ్లకు నీళ్లు, కరెంట్ కట్ సభ ముందుకు బిల్లు వస్తే అసెంబ్లీ ముట్టడి: అశోక్‌బాబు తాము రాజకీయాలకు అతీతంగా ఉన్నందున రాజకీయ జేఏసీ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వెల్లడించారు. గురువారం విజయవాడలో న్యాయవాదుల సమైక్య శంఖారావం సభ కోర్టు సముదాయాల సమీపంలో జరిగింది. దీనికి 13 జిల్లాల న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ మట్టా జయకర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అశోక్‌బాబు సభలోనూ, అనంతరం మీడియాతోనూ మాట్లాడారు. జాతీయ రహదారులను దిగ్బంధించాలని.. రైల్‌రోకోలు నిర్వహించాలని.. బ్యాంకులను మూసివేయాలని.. విద్యుత్ ఉత్పత్తిని స్తంభింపజేయాలని అప్పుడే కేంద్రం దిగివస్తుందని చెప్పారు. సమైక్యానికి కట్టుబడని ప్రజాప్రతినిధులు, నాయకులను సామాజికంగా బహిష్కరించాలని.. వారి ఇళ్లకు విద్యుత్, నీళ్లు కట్ చేయాలన్నారు. వారి కేసులను న్యాయవాదులు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి 40 రోజుల గడువిస్తే.. దిగ్విజయ్‌సింగ్ ఇప్పుడెందుకు రాష్ట్రానికి వచ్చారని అశోక్‌బాబు ప్రశ్నించారు. అసెంబ్లీలో బిల్లు నెగ్గదన్న భయంతోనే దిగ్విజయ్ హైదరాబాద్ వచ్చారన్నారు. ప్రత్యేక సమావేశంలో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే చలో హైదరాబాద్ నిర్వహించి అసెంబ్లీని ముట్టడిస్తామని.. ఉద్యోగులంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. -
రాయల గీయల జాన్తానై
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకంపై ప్రజాసంఘాలు, రాజకీయ జేఏసీ తీ వ్రంగా ధ్వజమెత్తాయి. జిల్లావ్యాప్తంగా కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. టీఆర్ఎస్ జిల్లా శాఖ పిలుపునిచ్చిన గురువారం బంద్‌ను విజయవంతం చేయాలని ఆయాసంఘాలు మద్దతు పలికాయి. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు, థియేటర్ల యజమానులు, పెట్రోల్‌బంకులు, మార్కెట్ల యజమాన్యం బంద్‌కు సహకరించాలని టీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. జిల్లాబంద్‌కు రాజకీయ జేఏసీ, వివిధ సంఘాలు, బీజేపీ, న్యూడెమోక్రసీ, సీపీఐలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. విద్యార్థి, యువజన, ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ, రైతు, లెక్చరర్ల సంఘాలు బంద్‌లో భాగస్వామ్యాన్ని పంచుకోవాలని శ్రేణులకు పిలుపునిచ్చాయి. తెలంగాణ ఆర్టీసీ సంఘాలు బస్సులు నిలిపివేయనున్నట్లు తెలిపాయి. ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవును ప్రకటించాయి. తెలుగుదేశం పార్టీ పరోక్షంగా జిల్లా బంద్‌కు సహకరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. రగిలిన ఇందూరు.. రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ బుధవారం జిల్లాలో నిరసన ప్రదర్శనలు, ఆందోనళలు, దిష్టిబొమ్మల దహనాలు, ధర్నాలు, మానవహారాలు కొనసాగాయి. నిజాంసాగర్ మండలం హాసన్‌పల్లిలో పీజీడీసీఏ విద్యార్థి మొకిరె రాములు సంపూర్ణ తెలంగాణ ఇవ్వాలని కోరుతూ సోనియాకు లేఖ రాసి ఆత్మహాత్యకు పాల్పడిన సంఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ సందర్భంగా విద్యార్థులు, యువకులు, తెలంగాణవాదులు ధర్నా, రాస్తారోకో, నిరసన ర్యాలీ చేపట్టి, ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. మృతుడు రాములు ఆత్మహత్యకు ముందు అమ్మనాన్నలకు , కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పుతూ రాసిన లేఖ తెలంగాణవాదులను తీవ్రంగా కదిలిం చింది. జిల్లాలో న్యాయవాదులు రెండోరోజు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తంచేశారు. పలు చోట్ల కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో కూడిన శవయాత్రను నిర్వహించి దహనం చేశారు. ఎల్లారెడ్డిలో మూడువేల మంది విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ర్యాలీలు, దిష్టిబొమ్మల ను దహనం చేశారు. బాన్సువాడ, కామారెడ్డిల్లో జరిగి న నిరసన కార్యక్రమాల్లో టీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీశ్‌రావు పాల్గొన్నారు. బాన్సువాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కామారెడ్డిలో ఎమ్మె ల్యే గంపగోవర్ధన్, ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి నిరసనల్లో భాగస్వాములయ్యారు. ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ యూనివర్శిటీలో విద్యార్థులు రాయల తెలంగాణకు వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. -
సమైక్యాంధ్ర ఉద్యమం మరింత ఉధృతం
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతస్థాయికి తీసుకెళ్లాలని రాజకీయ జేఏసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా నవంబర్ ఒకటో తేదీన రాష్ట్రావతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి, పార్లమెంటు సీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్ జరిగే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. స్థానిక హిందూ కళాశాల సెంటర్లోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద రాజకీయ జేఏసీ వేదికపై బుధవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, ఎండీ నసీర్ అహ్మద్, ఆతుకూరి ఆంజనేయులు, కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, ఎండీ హిదాయత్, కనపర్తి శ్రీనివాస్, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, కొమ్మాలపాటి శ్రీధర్, సమైక్యాంధ్ర జేఏసీ గౌరవాధ్యక్షుడు ఆచార్య పి. నరసింహారావు, కన్వీనర్ ఆచార్య ఎన్. శ్యామ్యూల్, విద్యార్థి జేఏసీ కో-ఆర్డినేటర్ వెంకటరమణ తదితరులు చరించి పలు తీర్మానాలు చేశారు. రాజకీయ జేఏసీ దీక్షా శిబిరాన్ని డిసెంబర్ 15వ తేదీ వరకూ కొనసాగించాలని నిర్ణయించారు. -
తెలంగాణపైసీఎం కుట్ర
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : హైదరాబాద్‌లో సభ నిర్వహించుకునేందుకు ఏపీఎన్జీవోలకు అనుమతి ఇచ్చి, తెలంగాణ రాజకీయ జేఏసీ తలపెట్టిన శాంతి ర్యాలీకి అనుమతి నిరాకరించడం ద్వారా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన సీమాంధ్ర కుట్రను బయట పెట్టుకున్నారని ఆరోపిస్తూ జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. జేఏసీ పిలుపు మేరకు ఇందూరులో బంద్ ను విజయవంతం చేయటానికి తెలంగాణవాదులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇప్పటికే విద్యాసంస్థలు బంద్ ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులు జిల్లాలోని ఆరు డిపోల్లోని బస్సులను బయటకు తీయవద్దని, విధులను 24 గంటలు బహ్కిరించాలని తీర్మానించారు. టీఎంయూ, ఈయూ, ఎన్‌ఎంయూలు సంపూర్ణ బంద్‌పై ప్రత్యేక దృష్టి సారిం చాయి. దీంతో జిల్లాలోని ఆరు డిపోలకు చెంది న 635 బస్సులు రోడ్డు ఎక్కని పరిస్థితి నెల కొంది. ఉద్యోగ, విద్యార్థి, ప్రజా, కుల సంఘాలతో పాటు వివిధ యూనియన్లు, సంఘాలతో కూడిన జేఏసీలు కూడా బంద్ విజయవంతం కోసం కృషి చేస్తున్నాయి. సీమాంధ్రకు చెంపపెట్టుగా తెలంగాణ రాజకీయ జేఏసీ ఇచ్చిన బంద్‌ను జయప్రదం చేయాలని తెలంగాణవాదులు పట్టుదలతో ఉన్నారు. తెలంగాణ వాదుల నిరసన వెల్లువలను గమనిస్తున్న జిల్లా పోలీసు శాఖ కూడా భారీ బందోబస్తును ఏర్పా టు చేసింది. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా తగిన చర్యలకు పోలీసుశాఖ శ్రీకారం చుట్టింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాల సముదాయాలు, మార్కెట్లు, సినిమాథియేటర్లు, పెట్రోల్‌బంకులు, ఆటోలు ఇతర వాహనాలు స్వచ్ఛందంగా బంద్ చేయాలని తీర్మానించారు. అత్యవసర సర్వీసులను మినహాయించి జిల్లా బంద్ విజయవంతం చేయడమే లక్ష్యంగా జిల్లా రాజకీయ జేఏసీతో పాటు టీఆర్ఎస్, న్యూడెమోక్రసీ కృషి చేస్తున్నాయి. ఏపీఎన్జీవో సభ నిర్వహణను వ్యతిరేకించనప్పటికీ సీఎం కుట్రపూరిత వైఖరికి నిరసనగా రాజకీయ జేఏసీ పిలుపుమేరకు జిల్లా బంద్‌ను విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ నిర్ణయించింది. సీపీఐ కూడా బంద్‌లో భాగస్వామి అవుతోంది. బంద్ విజయవంతం కోసం... జిల్లాలో బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ విద్యార్థి, ప్రజాసంఘాలు, టీఆర్ఎస్ ల ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నిజామాబాద్‌లోని నటరాజ్, దేవి, లలితామహల్, ఉషాప్రసాద్ థియేటర్లలో ప్రదర్శిస్తున్న తుఫాన్ సినిమాను విద్యార్థి జేఏసీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కొన్ని థియేటర్ల వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఈ ధర్నాలో పాల్గొని సినిమా పోస్టర్లను చింపివేశారు. తెలంగాణలో కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ నటించిన తుఫాన్ సినిమాను నడువకుండా అడ్డుకుంటామన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కల్పించిన బందోబస్తుతో అడ్డంకుల నడుమ నాలుగు థియేటర్లలో తుఫాన్ సినిమాను ప్రదర్శితమైంది. బాన్సువాడ, ఆర్మూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాల్లోని థియేటర్లలో ప్రదర్శిస్తు న్న తుఫాన్ సినిమాను అడ్డుకోవడానికి విద్యార్థి సంఘాల జేఏసీ కార్యకర్తలు తీవ్రంగా ప్రయత్నించారు. సినిమా పోస్టర్లను తగులబెట్టారు. హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన శాంతి ర్యాలీకి అనుమతిని ఇవ్వాలని కోరుతూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు నిజామాబాద్‌లో ప్రదర్శన చేపట్టి, మానవహారాన్ని నిర్మిం చారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లును సత్వరమే చేపట్టాలని నందిపేటలో తెలంగాణ దీక్ష లు కొనసాగాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర పక్షపాతిగా వ్యవరిస్తున్న తీరును నిరసిస్తూ డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీకి చెందిన ఎంఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశాయి. సీఎం కుట్రపూరిత వైఖరికి నిరసనగా నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్ కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. హైదరాబాద్‌లో సభ నిర్వహించుకోవడానికి ఏపీఎన్జీవోలకు అనుమతి ఇచ్చిన తెలంగాణ జేఏసీ శాంతి ర్యా లీకి అనుమతి ఇవ్వకపోవడాన్ని వారు తప్పు పట్టారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేశ్‌రెడ్డిల వైఖరిని తప్పుపట్టారు. -
తెలంగాణపైసీఎం కుట్ర
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : హైదరాబాద్‌లో సభ నిర్వహించుకునేందుకు ఏపీఎన్జీవోలకు అనుమతి ఇచ్చి, తెలంగాణ రాజకీయ జేఏసీ తలపెట్టిన శాంతి ర్యాలీకి అనుమతి నిరాకరించడం ద్వారా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన సీమాంధ్ర కుట్రను బయట పెట్టుకున్నారని ఆరోపిస్తూ జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. జేఏసీ పిలుపు మేరకు ఇందూరులో బంద్ ను విజయవంతం చేయటానికి తెలంగాణవాదులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇప్పటికే విద్యాసంస్థలు బంద్ ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులు జిల్లాలోని ఆరు డిపోల్లోని బస్సులను బయటకు తీయవద్దని, విధులను 24 గంటలు బహ్కిరించాలని తీర్మానించారు. టీఎంయూ, ఈయూ, ఎన్‌ఎంయూలు సంపూర్ణ బంద్‌పై ప్రత్యేక దృష్టి సారిం చాయి. దీంతో జిల్లాలోని ఆరు డిపోలకు చెంది న 635 బస్సులు రోడ్డు ఎక్కని పరిస్థితి నెల కొంది. ఉద్యోగ, విద్యార్థి, ప్రజా, కుల సంఘాలతో పాటు వివిధ యూనియన్లు, సంఘాలతో కూడిన జేఏసీలు కూడా బంద్ విజయవంతం కోసం కృషి చేస్తున్నాయి. సీమాంధ్రకు చెంపపెట్టుగా తెలంగాణ రాజకీయ జేఏసీ ఇచ్చిన బంద్‌ను జయప్రదం చేయాలని తెలంగాణవాదులు పట్టుదలతో ఉన్నారు. తెలంగాణ వాదుల నిరసన వెల్లువలను గమనిస్తున్న జిల్లా పోలీసు శాఖ కూడా భారీ బందోబస్తును ఏర్పా టు చేసింది. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా తగిన చర్యలకు పోలీసుశాఖ శ్రీకారం చుట్టింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాల సముదాయాలు, మార్కెట్లు, సినిమాథియేటర్లు, పెట్రోల్‌బంకులు, ఆటోలు ఇతర వాహనాలు స్వచ్ఛందంగా బంద్ చేయాలని తీర్మానించారు. అత్యవసర సర్వీసులను మినహాయించి జిల్లా బంద్ విజయవంతం చేయడమే లక్ష్యంగా జిల్లా రాజకీయ జేఏసీతో పాటు టీఆర్ఎస్, న్యూడెమోక్రసీ కృషి చేస్తున్నాయి. ఏపీఎన్జీవో సభ నిర్వహణను వ్యతిరేకించనప్పటికీ సీఎం కుట్రపూరిత వైఖరికి నిరసనగా రాజకీయ జేఏసీ పిలుపుమేరకు జిల్లా బంద్‌ను విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ నిర్ణయించింది. సీపీఐ కూడా బంద్‌లో భాగస్వామి అవుతోంది. బంద్ విజయవంతం కోసం... జిల్లాలో బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ విద్యార్థి, ప్రజాసంఘాలు, టీఆర్ఎస్ ల ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నిజామాబాద్‌లోని నటరాజ్, దేవి, లలితామహల్, ఉషాప్రసాద్ థియేటర్లలో ప్రదర్శిస్తున్న తుఫాన్ సినిమాను విద్యార్థి జేఏసీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కొన్ని థియేటర్ల వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఈ ధర్నాలో పాల్గొని సినిమా పోస్టర్లను చింపివేశారు. తెలంగాణలో కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ నటించిన తుఫాన్ సినిమాను నడువకుండా అడ్డుకుంటామన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కల్పించిన బందోబస్తుతో అడ్డంకుల నడుమ నాలుగు థియేటర్లలో తుఫాన్ సినిమాను ప్రదర్శితమైంది. బాన్సువాడ, ఆర్మూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాల్లోని థియేటర్లలో ప్రదర్శిస్తు న్న తుఫాన్ సినిమాను అడ్డుకోవడానికి విద్యార్థి సంఘాల జేఏసీ కార్యకర్తలు తీవ్రంగా ప్రయత్నించారు. సినిమా పోస్టర్లను తగులబెట్టారు. హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన శాంతి ర్యాలీకి అనుమతిని ఇవ్వాలని కోరుతూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు నిజామాబాద్‌లో ప్రదర్శన చేపట్టి, మానవహారాన్ని నిర్మిం చారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లును సత్వరమే చేపట్టాలని నందిపేటలో తెలంగాణ దీక్ష లు కొనసాగాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర పక్షపాతిగా వ్యవరిస్తున్న తీరును నిరసిస్తూ డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీకి చెందిన ఎంఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశాయి. సీఎం కుట్రపూరిత వైఖరికి నిరసనగా నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్ కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. హైదరాబాద్‌లో సభ నిర్వహించుకోవడానికి ఏపీఎన్జీవోలకు అనుమతి ఇచ్చిన తెలంగాణ జేఏసీ శాంతి ర్యా లీకి అనుమతి ఇవ్వకపోవడాన్ని వారు తప్పు పట్టారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేశ్‌రెడ్డిల వైఖరిని తప్పుపట్టారు. -
ఉద్యమమే ఊపిరి
సాక్షి, కడప : సమైక్యాంధ్ర కోసం జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సమైక్య రాష్ట్రాన్ని పరిరక్షించేంతవరకూ పోరు ఆగదని ఉద్యోగులు, వ్యాపారులు, పలు సంఘాల వారు స్పష్టం చేశారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ఉద్యోగ, రాజకీయ వర్గాలు ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నేతల ఆమరణ దీక్షలు ఉద్యమానికి ఊతమయ్యాయి. నానాటికీ ఉద్యమం బలోపేతం అయ్యేందుకు దీక్షలు దోహదం చేస్తున్నాయి. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి దీక్షను ఆదివారం రాత్రి భగ్నం చేసినప్పటికీ రిమ్స్‌లో దీక్షను కొనసాగించారు. ఆర్డీఓ వీరబ్రహ్మం పలు దఫాలుగా చర్చలు జరిపి మధ్యాహ్న సమయంలో దీక్షను విరమింపజేశారు. కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, కడప నియోజకవర్గ సమన్వయకర్త అంజాద్బాష, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి కుమారుడు నాగిరెడ్డి సోమవారం ఆమరణ దీక్షకు పూనుకున్నారు. పులివెందుల, మైదుకూరు నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కడప నగర మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాజు ఇంగ్లీషు మీడియం పాఠశాల విద్యార్థులు వినూత్నరీతిలో నిరసన తెలియజేశారు. విద్యుత్ ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేదనాయకం, కలెక్టరేట్ ఏఓ గుణభూషణ్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఉపాధ్యాయుల జేఏసీ, న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్జీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కళాజాత బృందం పాటలు సమైక్యవాదులను ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో జేఏసీ, వైవీయూలో విద్యార్థులు, ప్రొద్దుటూరులోని వైఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంసెట్ కౌన్సెలింగ్‌ను అడ్డుకున్నారు. జమ్మలమడుగులో ఎన్జీఓలు, వైద్యుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. గూడెంచెరువు కాలనీ గ్రామస్తులు పట్టణంలో ర్యాలీ, ధర్నా నిర్వహించి వంటా వార్పు చేపట్టారు. పాలిటెక్నిక్ ఉద్యోగులు రహదారిని దిగ్బంధనం చేసి జమ్మలమడుగులో రోడ్డుపైనే వంటా వార్పు చేపట్టారు. చిలంకూరులో ఐసీఎల్ ఆధ్వర్యంలో చెక్కభజనతో భారీ ర్యాలీ నిర్వహించి వంటా వార్పు చేపట్టారు. ఈ దీక్షలకు వైఎస్సార్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి, మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి సంఘీభావం తెలిపారు. ఆర్టీపీపీలో మహిళా ఉద్యోగులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఎర్రగుంట్లలో జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు సాగుతున్నాయి. రాయచోటిలో ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పెద్ద ఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించి వంటా వార్పు చేపట్టారు. ఈ కార్యక్రమానికి సూపరింటెండెంట్ లక్ష్మిప్రసాద్, చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్బయారెడ్డి నేతృత్వం వహించారు. న్యాయవాదులు, జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు సాగుతున్నాయి. జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ దేవనాథరెడ్డి, మాజీ ఎంపీపీ జీఎం రఫీ ఆధ్వర్యంలో పట్టణంలో బంద్ సాగింది. గాలివీడు, చిన్నమండెం, వీరబల్లిలో సమైక్య ఉద్యమం జోరుగా సాగింది. రైల్వేకోడూరులో జేఏసీ ఆద్వర్యంలో ఐకేపీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుకు సంఘీభావం తెలిపారు. వీరి ఆధ్వర్యంలోనే వంటా వార్పు, ధర్నా చేపట్టడంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. ఈ దీక్షలకు వైఎస్సార్ సీపీ నేత వైఎస్ కొండారెడ్డి సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే కొరమట్లు శ్రీనివాసులు అమరణ దీక్ష సోమవారంతో ఐదవ రోజు ముగిసింది. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి దీక్ష సోమవారంతో ఐదవ రోజు పూర్తయింది. వైద్యులు దీక్ష విరమించాలని సూచించినప్పటికీ ఆయన ససేమిరా అంటూ కొన సాగిస్తున్నారు. వీరబల్లి నుంచి విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది పాదయాత్రగా వచ్చి ఎమ్మెల్యేకు సంఘీభావం తెలిపారు. ఆకేపాటి దీక్షకు వైఎస్ కొండారెడ్డి తన సంపూర్ణ మద్దతు తెలిపారు. బద్వేలులో మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు సాగుతున్నాయి. అరవింద విద్యాలయం విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. పోరుమామిళ్లలో వేలాది మంది విద్యార్థులు పిరమిడ్ ఆకృతిలో ఏర్పడి నిరసన తెలిపారు. లారీ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిచి వంటా వార్పు చేపట్టారు. పులివెందులలో జేఏసీ, ఉలిమెల గ్రామస్తులు, విద్యార్థులు, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. సరాయపల్లె, చిన్నరంగాపురం గ్రామస్తులు జెఎన్టీయూ వద్ద భారీ ర్యాలీ, రాస్తారోకో చేపట్టారు. ఎన్జీఓల సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో నల్లబ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శన చేపట్టారు. ప్రొద్దుటూరులో ఎన్జీఓలు, రెవెన్యూ, పంచాయతీ, విద్యుత్, ఆర్టీసీ, సహకారశాఖ, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తి సర్కిల్లో సభ నిర్వహించారు. పట్టణంలోని వైద్యులు సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేసి మానవహారంగా ఏర్పడ్డారు. కమలాపురంలో మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డిని బలవంతంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ చావిడి నుంచి క్రాస్ రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. -
ఊరూవాడా సమైక్య సమరం
సాక్షి, తిరుపతి: పట్టణాలు, పల్లెలని తేడా లేకుండా వాడవాడలా సమైక్య ఉద్యమం రోజురోజుకూ ఉధృతమవుతోంది. రాజకీయ పార్టీలకు అతీతంగా నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసేందుకు సోమవారం తిరుపతితో ఉద్యమ సారథులు సమావేశ మయ్యారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం తిరుపతిలో మానస అనాథాశ్రమం, సాయిశ్రీ స్కూలు విద్యార్థులు సమైక్యాంధ్ర జాతర నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వాన్ని దున్నపోతుతో పోల్చారు. దున్నపోతు ఆకారంలో తయారు చేసిన బొమ్మను కార్పొరేషన్ కార్యాలయం ముందు రోడ్డుపై నరికారు. దున్నను నరికితే రక్తం వచ్చేలా బొమ్మను తీర్చిదిద్దారు. మున్సిపల్ ఉద్యోగ సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎల్.వర్మ ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అలాగే ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగులు సుమారు వెయ్యి బైక్‌లతో ర్యాలీ చేశారు. ఏపీ ఎన్జీవోలు ఎన్టీఆర్ కూడలిలో వంటావార్పు నిర్వహించారు. ఆటోవాలాలు ర్యాలీ, బధిరుల సంఘం ఆధ్వర్యంలో విభజన పరులు దిష్టిబొమ్మలను దహనం చేశారు. రెస్టారెంట్ల అసోసియేషన్ వారు బంద్ పాటించారు. హోటల్ యజమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్పొరేషన్ కార్యాలయం వద్ద జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు దీక్షలు చేశారు. కోర్టు సిబ్బంది విధుల బహిష్కరణ జిల్లాలో కోర్టుల్లో పనిచేసే సిబ్బంది సోమవారం విధులు బహిష్కరించారు. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, పీలేరు, పుత్తూరులో సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలుపంచుకున్నారు. న్యాయవాదులు సంఘీబావం ప్రకటించారు. చిత్తూరులో వైద్యఆరోగ్య శాఖ జేఏసీ ఆధ్వర్యంలో రాల్యీ నిర్వహించారు. తిరుపతి, చిత్తూరులో ఫొటో వీడియో గ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో షాపులు మూసివేసి నిరసన తెలిపారు. చిత్తూరులో పూలమార్కెట్లో కేసీఆర్‌కు పాడెకట్టి శవయాత్ర నిర్వహించారు. ఐసీడీఎస్ ఉద్యోగులు, అంగన్వాడీలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పీలేరులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సుమారు 3 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ, వైఎస్సార్ సీపీ రిలే దీక్షలు కొనసాగాయి. ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పశు సంవర్థకశాఖ అధికారులు, సిబ్బంది నిరసన ర్యాలీ చేశారు. గర్జించిన విద్యార్థులు శ్రీకాళహస్తిలో సుమారు 10 వేల మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. రామకుప్పంలో విద్యార్థుల ర్యాలీ, మానవహారం నిర్వహించారు. పలమనేరులో జేఏసీ ఆధ్వర్యంలో అన్ని మండలాల తహశీల్దార్లు, వీఆర్వో, వీఆర్ఏ, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు నిరవధిక దీక్షలో పాల్గొన్నారు. వీరికి మద్దతుగా న్యాయవాదులు పాల్గొన్నారు. నడింపల్లి, చిన్నూరు గ్రామస్తులు సుమారు వెయ్యిమంది జేఏసీ వారికి మద్దతు తెలిపి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మున్సిపల్ అధికారులు విధులు బహిష్కిరించారు. గంగవరం మండలంలో ఉపాధ్యాయులు బైక్ ర్యాలీ చేశారు. బెరైడ్డిపల్లిలో టీడీపీ కార్యకర్తలు అర్థనగ్న ప్రదర్శన చేశారు. వీకోటలో చికెన్ దుకాణ యజమానులు రాస్తారోకో నిర్వహించారు. వైఎస్సార్ సీపీ మహిళలు పాల్గొన్నారు. మదనపల్లెలో న్యాయ, విద్య, వైద్య, మహిళా, మున్సిపల్ ఉద్యోగులు, సెరికల్చర్, ఇరిగేషన్, పంచాయతీ రాజ్ సంఘాలు, ప్రైవేటు కళాశాలల విద్యార్థులు సుమారు నాలుగు వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, ఎమ్మెల్యే షాజహాన్ బాషా, మున్సిపల్ మాజీ చైర్మన్ నరేష్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రీవెన్ససెల్ను అడ్డుకున్నారు. సత్యవేడులో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులు, ఎన్జీవోలు, విద్యార్థులు, కోర్టు సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారుల దిగ్బంధం సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనకారులు పలుచోట్ల జాతీయ రహదారులను దిగ్బంధించారు. చంద్రగిరిలో పొలిటికల్ జేఏసీ, సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. అనంతరం వంటావార్పు నిర్వహించారు. కుప్పం వద్ద జాతీయ రహదారులను దిగ్బంధించారు. శాంతిపురంలో జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. పుంగనూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభించారు. వాల్మీకి సంఘ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు. పుత్తూరులో విద్యుత్‌శాఖ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నగరిలో ముస్లిం సోదరులు దీక్షలు చేశారు. -
జిల్లా వ్యాప్తంగా కదంతొక్కుతున్న సమైక్యవాదులు
సాక్షి, గుంటూరు: రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కుట్ర పన్నిన కాంగ్రెస్ అధిష్టానానికి తగిన గుణపాఠం తప్పదని జిల్లా ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఓవైపు వర్షాలు కురుస్తున్నా ప్రజల్లో ఎక్కడా ఉద్యమస్ఫూర్తి తగ్గ లేదు. పేద,ధనిక తేడా లేకుండా అంతా ఐక్యంగా నిరసన ప్రదర్శనలు చే స్తున్నారు. జిల్లాలో శనివారం సమైక్యాంధ్ర జేఏసీ, రాజకీయ జేఏసీ, విద్యార్థి, ప్రజాసంఘాల జేఏసీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ లు, మానవహారాలు, ధర్నాలు నిర్వహించారు. రాజకీయ జేఏసీ జిల్లా కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు, సమైక్యాంధ్ర జేఏసీ నేతలు ఆచార్య ఎన్. శామ్యూల్, ఆచార్య పి.నరసింహారావు, మండూరి వెంకటరమణల నేతృత్వంలో ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు ర్యాలీలు చేశారు. రాజకీయ జేఏసీ నేతృత్వంలో జరిగిన రిలేదీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంఘీభావం తెలిపారు. సత్తెనపల్లి, నరసరావుపేట, తెనాలి, చిలకలూరిపేటలలో ఆర్టీసీ ఉద్యోగులు మౌన ప్రదర్శన, రాస్తారోకోలు నిర్వహించగా, రేపల్లెలో ఆర్టీసీ కార్మికులు ఒంటికాలిపై నిలబడి సమైక్యాంధ్ర నినాదాలిచ్చారు. జిల్లా కోల్డ్‌స్టోరేజీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంద్, మున్సిపల్ ఉద్యోగుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ వైద్యులు, నర్సులు వినూత్నంగా నిరసన తెలిపారు. యూపీఏ అధినేత్రి సోనియా, దిగ్విజయ్, కేసీఆర్ వేషాల మాస్క్‌లు ధరించి కూరగాయలు కోసి ఇలానే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల సిబ్బంది, విద్యార్థులు రోడ్డుపైనే వంట చేసి భోజనాలు చేశారు. ఉద్యోగుల నిరసనలు .. ఏపీ ఎన్జీవోస్ జేఏసీ చేస్తున్న సమ్మెకు వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, గజిటెడ్ అధికారులు మద్దతు తెలుపుతున్నారు. చిలకలూరిపేటలో కమిషనర్, తహశీల్దార్, గజిటెడ్ అధికారులు విధులు బహిష్కరించి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. గుంటూరులో వ్యవసాయశాఖ ఉద్యోగులు స్థానిక కలెక్టర్ కార్యాలయం నుంచి అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహం వరకు భారీ ప్రదర్శన, మానవహారం చేశారు. రోడ్డుపై వరినాట్లు వేసి తమ నిరసన తెలిపారు. పురుగుమందుల కంపెనీల అసోసియేషన్‌తో పాటు ఆదర్శ రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ నాన్‌టీచింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన నినాదాలిచ్చారు. తెనాలిలో న్యాయశాఖ ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. బాపట్లలో వీఆర్వోల ర్యాలీ, చిలకలూరిపేటలోని కావూరు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విధులు బహిష్కరించి విద్యార్థులతో సహా ర్యాలీ చేశారు. అన్నిచోట్లా ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. నరసరావుపేట, చిలకలూరిపేట, గుంటూరులో ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికులు ఆర్ధనగ్న ప్రదర్శన చేశారు. మాచర్లలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీప్రదర్శన చేశారు. ఆర్టీసీ కార్మిక జేఏసీతో ఆయన క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. దీక్షలకు సంఘీభావం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు, నరసరావుపేట, తెనాలి, చిలకలూరిపేట, రేపల్లెలలో రిలేదీక్షలు కొనసాగుతు న్నాయి. గుంటూరు హిందూ కళాశాల సెంటర్లో పలు ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బంది, విద్యార్థులతో పాటు డిగ్రీ విద్యార్థులు దీక్షలకు కూర్చొన్నారు. దాచేపల్లిలో దళితనాయకుడు మస్తాన్ ఆమరణ నిరాహారదీక్ష కొనసాగుతోంది. మంగళగిరి, తాడేపల్లిలో ్రపభుత్వ ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు రిలేదీక్షలు చేపట్టారు. మంగళగిరిలో బైక్ మెకానిక్‌ల ర్యాలీ జరిగింది. జిల్లా వ్యాప్తంగా ప్రజలు సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు విద్యుత్ వాడకాన్ని బంద్ చేసి నిరసన తెలిపారు. గుంటూరులో బార్ అసోసియేషన్ ఇప్పటికే సమ్మె చేస్తుండగా, ఈనెల 31న సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ సభ గుంటూరులో నిర్వహించాలని నిర్ణయమైంది. -
సహకరించాలంటూ సద్భావన యాత్ర: తెలంగాణ జేఏసీ
సాక్షి, నెట్వర్క: రాష్ర్ట ఏర్పాటుకు అడ్డుపడవద్దని కోరుతూ టీ-జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ జిల్లాల్లో శాంతిర్యాలీలు, సద్భావనా యాత్రలు కొనసాగుతున్నాయి. సీమాంధ్ర అధికారుల వ్యవహారశైలిని నిరసిస్తూ పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఖమ్మంలో మధ్యాహ్న భోజన సమయంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సీమాంధ్ర దిష్టిబొమ్మను దహనం చేశారు. మణుగూరు, కొత్తగూడెం, పాల్వంచ, బోనకల్లులలో శాంతిర్యాలీలు నిర్వహించగా అశ్వారావుపేటలో మోటార్‌సైకిల్ ర్యాలీ తీశారు. రాష్ట్ర విభజనకు సీమాంధ్రులు సహకరించాలంటూ నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ సెంటర్ వద్ద శనివారం శాంతి సద్భావన ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్లో అన్ని శాఖల ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భూమి తలకిందులైనా సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం మారదన్నారు. కరీంనగర్లో విద్యార్థులు శాంతి సద్భావన ర్యాలీ నిర్వహించగా, గిరిజన ఉద్యోగి హన్మంతు నాయక్‌పై దాడిని నిరసిస్తూ తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్లో సీమాంధ్ర దిష్టిబొమ్మ దహనం చేశారు. గోదావరిఖనిలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. మేడిపెల్లిలో ఉద్యోగులు తహశీల్దార్ కార్యాలయంతోపాటు ఐకేపీ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు. చందుర్తిలో ఏబీవీపీ నాయకులు సీమాంధ్ర నాయకుల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఐదోరోజు నిరసన కొనసాగింది. ఇచ్చోడలో రాజకీయ జేఏసీ, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శాంతిర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సబ్ కలెక్టర్ దిగంబర్ మంజూలేకు వినతిపత్రం అందజేశారు. కాగా, తెలంగాణవాదులతో సమాచార హక్కుచట్టం కమిషనర్ తాంతియా కుమారి వ్యవహరశైలిని నిరసిస్తూ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపట్టారు. -
తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం బిల్లును వెంటనే పార్లమెంట్లో పెట్టి ఆమోదించాలని పొలి టికల్ జేఏసీ చైర్మన్ జి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం భోజన విరామ సమయంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చిరకాల వాంఛైన ప్రత్యేక రాష్ట్రం బిల్లు ఆమోదానికి సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. పస్తుతం జరుగుతున్న సమావేశాలలోనే బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టకుండా అక్కడి ప్రజా ప్రతినిధులు సంయమనం పాటించాలన్నారు. ఎంతో మంది అమర వీరుల త్యాగాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వచ్చిందన్నారు. కేంద్రం జాప్యం చే యకుండా బిల్లు ప్రవేశపెట్టాని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోవాలన్నారు. అన్ని పార్టీలు తెలంగాణకు ఒప్పుకొని ఇప్పుడు సీమాంధ్రలో ఆందోళనలు చేయడంలో అర్ధం లేదన్నారు. అక్కడి ప్రజలను మభ్యపెట్టడానికే డ్రా మాలు ఆడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు పందిరి వెంకటేశ్వరమూర్తి, జి.మోహన్‌రావు, ఏడుదొడ్ల వెంకట్రాంరెడ్డి, జిల్లా కోశాధికారి సురభి వెంకటేశ్వర్లు, రమేష్, రమణ, అంజయ్య, అశోక్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమైక్య పోరు మరింత రాజుకుంది
అన్ని వర్గాలూ ఏకమవుతుండటంతో సమైక్య పోరు మరింత రాజుకుంది. 13 జిల్లాల ఏపీ ఎన్జీవోలు, మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ, పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఆదివారం విజయవాడలో సమావేశమై కార్యాచరణ రూపొందించారు. సాక్షి, మచిలీపట్నం/విజయవాడ : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకు బలపడుతూ మరింత ఉధృతమవుతోంది. ఐదోరోజైన ఆదివారం ఏపీ ఎన్జీవోలు, మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు విజయవాడలో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడంతో ఉద్యమానికి మరింత బలం చేకూరింది. వారితో కలిసి పోరాటం చేయడానికి విద్యార్థి సంఘ జేఏసీ నేతలు సిద్ధమౌతున్నారు. వీరికితోడు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు రోడ్లపైకి వచ్చి ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తామంటూ ప్రకటనలు చేయడంతో రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత తీవ్రతరమయ్యే పరిస్థితి కనబడుతోంది. రాష్ట్ర విభజనపై 13 జిల్లాల ఏపీ ఏన్జీవోల సంఘ ప్రతినిధులు గాంధీనగర్‌లోని ఎన్జీఓ హోమ్‌లో సమావేశమవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మున్సిపల్ గెస్ట్‌హౌస్‌లో 13 జిల్లాల ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు సమావేశమై సమైక్యాంధ్రకు మద్దతుగా నిర్ణయాలు తీసుకున్నారు. తొలుత మూడు రోజులు విధులు బహిష్కరించాలని, పౌరసేవల్ని నిలిపివేయాలని నిర్ణయించారు. పొలిటికల్ జేఏసీ నిరసన ప్రదర్శన.. విజయవాడలో పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు కొలనుకొండ శివాజీ, ఆకుల శ్రీనివాసకుమార్, వైఎస్సార్ సీపీ నాయకులు తాడి శకుంతల, అబ్దుల్ ఖాదర్, తెలుగుదేశం నాయకులు బొండా ఉమామహేశ్వరరావు, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొని సమైక్యాంధ్ర ఉద్యమానికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. వీఆర్ఓల సంక్షేమ సంఘం స్వర్ణాప్యాలెస్‌లో సమావేశమై కేసీఆర్‌ను ఉరితీయాలని, సోనియాను తరిమేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ తూర్పునియోజకవర్గ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ కార్యాలయం నుంచి రంగా విగ్రహం వరకు కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు. మచిలీపట్నంలో కార్లు, బైక్‌ల ర్యాలీ.. మచిలీపట్నంలో సమైక్యంధ్ర ప్రతినిధులు కార్లు, బైక్‌లతో ర్యాలీ నిర్వహించి తమ నిరసన తెలియజేశారు. జగ్గయ్యపేటలో సమైక్యంధ్రకు మద్దతుగా మహిళలు రోడ్లపైకి వచ్చి కబడ్డీ ఆడారు. రాష్ట్రాన్ని విడదీస్తే సహించబోమని హెచ్చరించారు. గుడివాడ నెహ్రూ చౌక్‌లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వంటావార్పులు నిర్వహించి ర్యాలీ జరిపారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. ఉయ్యూరులో జర్నలిస్టు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా, ప్రధాన వీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి గాంధీ విగ్రహం వద్ద అధికారులకు పూలు అందచేసి సమైక్యాంధ్రకు మద్దతుగా సహకరించాలని కోరారు. భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో కార్మికులు ప్రదర్శన చేశారు. తిరువూరులో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించగా వైఎస్సార్ సీపీ నేతలు అందులో పాల్గొన్నారు. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం.. రాష్ట్ర విభజనకు నిరసనగా హనుమాన్‌జంక్షన్‌లో కేసీఆర్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి దహనం చేశారు. కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఆధ్వర్యంలోనూ కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి, తాలూకా కార్యాలయం వద్ద నిరవధిక నిరాహారదీక్షకు సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు తాను దీక్ష కొసాగిస్తానని ప్రకటించారు. అవనిగడ్డలో అధికార భాషాసంఘం చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో పాల్గొన్న శ్రీనివాసరావు అనే యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోగా పోలీసులు అడ్డుకున్నారు.