బంద్... | telangana bandh.. | Sakshi
Sakshi News home page

బంద్...

Published Sun, Jul 13 2014 12:57 AM | Last Updated on Wed, Apr 3 2019 5:51 PM

బంద్... - Sakshi

బంద్...

- 300 మందికి పైగా అరెస్ట్.. విడుదల
- బస్సు సర్వీసులకు ఆటంకం
- పలుచోట్ల దిష్టిబొమ్మల దహనం

సాక్షి, సిటీబ్యూరో: ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రలో కలుపుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రాజకీయ జేఏసీ, టీఆర్‌ఎస్, వామపక్ష పార్టీలు శనివారం చేపట్టిన తెలంగాణ బంద్ నగరంలో స్వల్ప ఉద్రిక్తల నడుమ ప్రశాంతంగా ముగిసింది. బంద్ వ ల్ల ఆర్టీసీ ముందస్తుగా 250 బస్సులను రద్దు చేసింది. 500 సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎంఎంటీఎస్ రైలే సర్వీసులు యధావిధిగా నడిచాయి. ఆందోళనకారులు ఉదయం ఏడు గంటలకే రోడ్డు పైకి వచ్చి విద్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, సినిమా హాళ్లు, పెట్రోలు బంక్‌లను బలవంతంగా బంద్ చేయించారు.

ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల, జేఎన్‌టీయూ క్యాంపస్, సాగర్ రింగ్ రోడ్డు, ఎల్బీ నగర్, చందా నగర్, ఫలక్‌నుమా స్టేషన్, ముసారంబాగ్, కొత్తపేట్, చాదర్‌ఘాట్, సైదాబాద్, మాదన్నపేట, సరూర్‌నగర్, మల్కజ్‌గిరి, బాలాపూర్ చౌరస్తాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలనూ దహనం చేశారు. హస్తినాపురం చౌరస్తాలో ఏపీ సీఏం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. బంద్ వల్ల మెజంజాహీ మార్కెట్, కోఠి, అబిడ్స్, సికింద్రాబాద్, హబ్సిగూడ, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, సోమాజిగూడ, ఖైరతాబాద్, హిమయత్‌నగర్, లక్డీకాపూల్ తదితర ప్రాంతాలు బోసిపోయాయి. జంట నగర కమిషనరేట్ల పరిధిలో సుమారు 300 మంది ఆందోళనకారులను అరెస్టు చేసి, సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
 
అట్టుడికిన ఆర్టీసీ క్రాస్ రోడ్డు
నిరసనలు, నినాదాలు, దిష్టిబొమ్మల దహనం, బైఠాయింపులు, అరెస్ట్‌లతో ఆర్టీసీ క్రాస్ రోడ్డు అట్టుడికింది. కొంత మంది ఆందోళనకారులు రోడ్డు పైకి వచ్చిన ఆర్టీసీ బస్సులను ఆపి, టైర్లలో గాలి తీశారు. అవి రోడ్డుపైనే నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో పలువును తెలంగాణ వాదులు చిక్కడపల్లి వైపు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించగా, స్వరాజ్ హోటల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. సీపీఎం ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయగా, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో విద్యానగర్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ సహా సీపీఎం నాయకుడు వీరయ్య, డీజీ న రసింహారావు, సీపీఐ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, అజిజ్ పాషా, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ ఉపాధ్యక్షురాలు విమలక్క, సీపీఐఎం ఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు గోవర్థన్, పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య, పద్మ, సత్య తదితర నాయకులను బలవంతంగా అరెస్ట్ చేశారు.
 
బీజేపీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నం
తెలంగాణ జాగృతికి చెందిన పలువురు కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించగా, ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి చేయి దాటి పోతుండటంతో పోలీసులు ముందస్తుగా తెలంగాణ జాగృతి నేతలను అరెస్టు చేశారు.
 
బువ్వ తెలంగాణ కావాలి...
తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో గన్‌పార్కులోని అమర వీరుల స్థూపం వద్ద ప్రజా గాయకుడు గద్దర్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉపాధ్యక్షుడు వేదకుమార్ నిరసన తెలిపారు. ప్రజా కళాకారులు ధూం ధాం ఆటలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ, ఎన్నికలు, రాజకీయ పార్టీల ద్వారా తెలంగాణ రాలేదని, కేవలం ఉద్యమాలతోనే సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. అలా వచ్చిందని ఎవరైనా భ్రమపడితే భవిష్యత్తే వారికి సరైన సమాధానం ఇస్తుందని చెప్పారు. బంగారు తెలంగాణ కంటే ముందు బువ్వ తెలంగాణ కావాలని కోరారు.
 
గిరిజనులపై దాడి లాంటిదే:? - ప్రొఫెసర్ కోదండరామ్
ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ అమాయక గిరిజనులపై దాడి చేయడం లాంటిదేనని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు. గత యూపీఏ ప్రభుత్వ విధానాలనే తాము అనుసరిస్తున్నామని బీజేపీ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. యూపీఏ ప్రభుత్వ విధానాలు కొనసాగించేందుకే మీరు అధికారంలోకి వచ్చారా? అని ఘటుగా ప్రశ్నించారు. రాజ్యాంగంపై గౌరవం ఉంటే  ఏకపక్షంగా బిల్లును ఆమోదించే వారు కాదని మండిపడ్డారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, పోలవరం ఆర్డినెన్స్‌ను లోకసభలో ఆమోదించి ఖమ్మంలోని రెండు లక్షల మంది గిరిజనులకు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు.

బిల్లు ఉపసంహరించేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య మాట్లాడుతూ కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ (రాయల వర్గం) కేంద్ర కమిటీ సభ్యుడు పి.సూర్యం మాట్లాడుతూ పోలవరం ఆర్డినెన్స్‌ను అప్రజాస్వామికంగా ఆమోదించారని ధ్వజమెత్తారు.సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం) రాష్ట్ర అధ్యక్షుడు కె.గోవర్థన్ మాట్లాడుతూ బడాపారిశ్రామికవేత్తలకు మేలు చేయడానికే పోలవరం నిర్మిస్తున్నారని ఆరోపించారు. 300 గ్రామాలను ముంచేసి 2 లక్షలకు పైగా గిరిజనుల అస్థిత్వాన్ని దెబ్బ తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement