బల్మూరి వెంకట్‌ అరెస్టు  | Telangana: Donkey Theft Case Against Balmuri Venkat | Sakshi
Sakshi News home page

బల్మూరి వెంకట్‌ అరెస్టు 

Published Sat, Feb 19 2022 3:43 AM | Last Updated on Sat, Feb 19 2022 3:43 AM

Telangana: Donkey Theft Case Against Balmuri Venkat - Sakshi

కేక్‌ తినిపిస్తున్న వెంకట్‌.. 

జమ్మికుంట/హుజూరాబాద్‌: మూగజీవాలను దొంగిలించి, రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచారన్న ఆరోపణలపై ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను కరీంనగర్‌ జిల్లా జమ్మి కుంట పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం కరీంనగర్‌ అదనపు డీసీపీ శ్రీనివాస్‌ జమ్మికుంట స్టేషన్‌ లో విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. గురు వారం సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని అభాసుపాలు చేశారని జమ్మికుంట అర్బన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్య క్షుడు టంగుటూరి రాజ్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెంకట్, మరో 10 మంది కలసి ఒక గాడిదను దొంగతనంగా కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీకి తరలించి దానికి కేసీఆర్‌ చిత్రపటాన్ని తగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం దాని కాలితో కేక్‌ కోయించి బలవంతం గా గాడిదకు తినిపించారని ఆరోపించారు. సీఎంను అవమానించడంతోపాటు కాంగ్రెస్‌–టీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించిన బల్మూరి వెంకట్‌పై చర్యలు తీసుకోవాలని గురువారం రాత్రి జమ్మికుంట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అర్ధరాత్రి దాటాక వెంకట్‌ను హుజూరాబాద్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్దకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకట్‌తోపాటు గుర్తుతెలియని పది మందిపై కేసు నమోదు చేశామని, వెంకట్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని డీసీపీ తెలిపారు. 

అరెస్టులతో మా పోరాటం ఆపలేరు..: కాంగ్రెస్‌ నేతలను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తోందని, ఇలాంటి చర్యలతో తమ పోరాటం ఆగ దని బల్మూరి వెంకట్‌ అన్నారు. శుక్రవారం ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపరచగా.. బెయిల్‌ మంజూరు చేసింది. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రజల బాధలు ప్రభుత్వానికి అర్థం కావడానికి నిరసన తెలిపితే, తాను గాడిదను చోరీ చేశానని తప్పుడు కేసు బనాయించారని తెలిపారు.

నిరుద్యోగంపై పోరాడితే అరెస్టా?: రేవంత్‌
సాక్షి, హైదరాబాద్‌: నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేస్తున్న ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను ఎలాంటి నోటీసులు లేకుండా అర్థరాత్రి అరెస్టు చేయడం దుర్మార్గమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ హక్కులను కాలరాస్తూ పోలీసులు కాంగ్రెస్‌ నాయకులపై దౌర్జన్యంగా వ్యహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేసి వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement