బోయినపల్లి: చొప్పదండి నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ బీజేపీలో చేరడంతో ఇంతకాలం ఆమె వర్గంలో ఉన్న మండలంలోని పలువురు టీఆర్‌ఎస్ నేతలు తమ భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. గురువారం కరీంనగర్‌లో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నివాసంలో సమావేశమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే సమావేశంలో మెజార్టీ నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లోనే కొనసాగాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. గతంలో మండలంలో టీఆర్‌ఎస్ రెండు గ్రూపులుగా ఉండేది. వీరిలో కొంతమంది ఎమ్మెల్యే వర్గంలో, మరికొంత మంది స్థానిక నేతలతో మరో వర్గంగా ఉండేవారు. మండలంలో పార్టీ పరంగా ఏ కార్యక్రమం నిర్వహించినా రెండు వర్గాల నేతలు వేర్వేరుగా నిర్వహించే వారు. ఈ క్రమంలో మండలంలో టీఆర్‌ఎస్ తీరు చర్చనీయాంశంగా ఉండేది.
కాగా సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేయడం, ఎన్నికలకు వెళ్లడం చక చకా జరిగింది. ఈ క్రమంలో చొప్పదండి టీఆర్‌ఎస్ టికెట్ తాజా మాజీ ఎమ్మెల్యేకు కేటాయించవద్దని మండలంలోని కొంతమంది నేతలు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. కాగా టీఆర్‌ఎస్ టికెట్ తనకే వస్తుందని మాజీ ఎమ్మెల్యే శోభ చివరి క్షణం వరకు వేచి చూశారు. చివరకు ఈ నెల 14న బీజేపీ పార్టీ తరపున నామినేషన్ వేశారు. దీంతో చాలా రోజులు టికెట్ పెండింగ్‌లో ఉంచిన సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్‌కు టికెట్ కేటాయించారు.
నేతల సమాలోచనలు...
ఇంతకాలం ఒకే పార్టీలో ఉన్న రెండు వర్గాలుగా ఉన్న నేతలు.. ఇపుడు మాజీ ఎమ్మెల్యే శోభ బీజేపీలో చేరడంతో తమ భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. మండలంలోని మాజీ సర్పంచులు, నామినేటెడ్ పదవులు పొందిన పలువురు కరీంనగర్‌లో గెట్‌టూగెదర్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. రెండు వర్గాలుగా ఉన్న నాయకులం దరినీ ఒకేచోట చేర్చేందుకు ఓ సీనియర్ నాయకుడు చొరవ తీసుకుంటున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment