గాయపడిన వ్యక్తి నుంచి వివరాలు సేకరిస్తోన్న ఎస్‌ఐ
మహబూబాబాద్ రూరల్: మానుకోట మండలంలోని బేతోలులో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య మంగళవారం రాత్రి ఘర్షణ జరిగింది. స్థానికులు, బాధితుల బంధువుల కథనం ప్రకారం... టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోతు శంకర్‌నాయక్ గెలుపు అనంతరం మానుకోట మండలంలోని బేతోలులో టీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా టీఆర్‌ఎస్ గ్రామ నాయకులు దార యాదగిరిరావు, మల్యాల శ్రీనివాసరావు, గద్దపాటి సంతోష్, ఎస్.కే.ఖాదర్‌బాబా ఆధ్వర్యంలో గ్రామశివారులోని భజనతండాలో ఊరేగింపు అనంతరం బేతోలుకు వచ్చారు. ఈ క్రమంలో భజనతండా గిరిజనులు గ్రామంలో బాణాసంచా కాలుస్తూ ముందుకు వెళ్లారు. ఆ సందర్భంలో వీఆర్‌ఓ మస్తాన్, అతడి కుటుంబ సభ్యులు కొంత దూరం వెళ్లి బాణాసంచా కాల్చుకోమని గిరిజనులకు చెప్పారు.
దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అదే విధంగా వీఆర్‌ఓ మస్తాన్, అతడి కుటుంబ సభ్యులు గిరిజనులపై కత్తి, కర్రలతో దాడికి యత్నించడంతో భజనతండాకు చెందిన గుగులోతు శ్రీను అనే వ్యక్తి తలకు, చేతులకు గాయాలయ్యాయి. అంతలోనే ఆగ్రహించిన గిరిజనులు వీఆర్‌వో మస్తాన్ ఇంటిపై దాడిచేసి ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేశారు. శ్రీనును చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీఆర్‌ఓ మస్తాన్‌పై దాడి జరగడంతో అతడు మానుకోట ఏరియా ఆస్పత్రికి వచ్చి ఉంటాడని భావించిన ఆయన కుమారుడు ఖాజా, గ్రామానికి చెందిన మరో వ్యక్తి ఏర్పుల మల్సూర్ ఆస్పత్రికిరాగా గుగులోతు శ్రీను, బంధువులు, తండావాసులు వారిద్దరిపై దాడిచేశారు.
దీంతో ఆసుపత్రిలోనూ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సంఘటన స్థలాన్ని, ఏరియా ఆసుపత్రిలో ఇరువర్గాల బాధితులను మానుకోట టౌన్, రూరల్ సీఐలు రవికుమార్, లింగయ్య, మానుకోట, కురవి ఎస్సైలు రమేష్‌బాబు, అరుణ్‌కుమార్ కలిసి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. గాయపడిన గుగులోతు శ్రీనును టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, జిల్లా నాయకులు తేళ్ల శ్రీనివాస్, ఎడ్ల రమేష్ పరామర్శించారు.
అకారణంగా మా ఇంటిపై దాడిచేశారు...
భజనతండా గిరిజనులు బాణాసంచా కాలుస్తూ ఇంటిముందుకు రాగా వీఆర్‌వో మస్తాన్ గుండెజబ్బు ఉన్న వ్యక్తిఅని, కొంత దూరం వెళ్ళి బాణాసంచ కాల్చమని చెప్పాం. అకారణంగా మస్తాన్‌పై గిరిజనులు దాడిచేయగా ఆయన ఆచూకి కనిపించకుండా పోయింది. ఇంట్లోని సామాను ధ్వంసం చేశారు. వీఆర్‌వో మస్తాన్‌కు ఏమైనా హానీ జరిగితే టీఆర్‌ఎస్ నాయకులు, భజనతండావాసులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. టీఆర్‌ఎస్ నాయకులు మల్యాల శ్రీనివాసరావు, దార యాదగిరిరావు, రవీందర్‌రావు, ఖాదర్‌బాబా, జాబిల్లి, గద్దపాటి సంతోష్ అందరు కలిసి గిరిజనులను తమ ఇంటిపైకి ఉసిగొలిపి చంపే ప్రయత్నం చేశారు. వారిపై చర్య తీసుకోవాలి.
– నన్నీబీ, వీఆర్‌ఓ మస్తాన్ భార్య
Comments
Please login to add a commentAdd a comment