బుధవారం జనగామ జిల్లా పాలకుర్తిలో కాంగ్రెస్ ప్రజా చైతన్య బస్సుయాత్ర సభలో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్. సభకు హాజరైన జనం
సాక్షి, జనగామ: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తోందని, వచ్చే ఎన్నికల్లో అధికారం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి జనగామ జిల్లా పాలకుర్తిలో జరిగిన ఆ పార్టీ ప్రజా చైతన్య బస్సుయాత్ర సభలో ఆయన ప్రసంగించారు. టీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు విసిగిపోయారని, ఆ పార్టీని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు.
డబుల్ బెడ్‌రూం, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, ముస్లింలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇలా.. ప్రజలకు ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకో లేదని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్ పాలనలో దళితులు, గిరిజనులు అవమానాలకు, అణచివేతకు గురవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు చేస్తున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న దళితులను పోలీస్ స్టేషన్‌కు తరలించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని మండిపడ్డారు. నేరెళ్ల బాధితులను పరామర్శించడానికి వచ్చిన లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌ను అవమానపర్చే విధంగా కేసీఆర్ మాట్లాడారని చెప్పారు.
మానకొండూరులో శ్రీనివాస్, పరుశురాం మూడు ఎకరాల భూమి కోసం ఆత్మహత్యాయత్నం చేసుకున్నా.. ఇప్పటికీ కేసు నమోదు కాలేదని ఉత్తమ్ పేర్కొన్నారు. మిర్చి మద్ధతు ధర అడిగిన గిరిజన రైతులకు బేడీలు వేశారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చెందిన రూ.10 వేల కోట్ల నిధులను దారి మళ్లించారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ పెద్ద అబద్ధాలకోరని మండిపడ్డారు. అప్పులు తెచ్చి ఆదాయంగా చూపుతున్నారని కాగ్ నివేదిక మొట్టికాయలు వేసిందన్నారు. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడానికి ప్రయత్నిస్తున్న తమను అసెంబ్లీ నుంచి బహిష్కరించారని ఉత్తమ్ ఆరోపించారు.
ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. పత్తి పంటకు రూ.6 వేల కనీస మద్ధతు, వరి, మొక్కజొన్న, కందులకు రూ.2 వేలు, మిర్చికి రూ.10 వేల మద్దతు ధరను చెల్లిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 60 లక్షల డ్వాక్రా సంఘాల్లో ఉన్న 70 లక్షల మంది మహిళలకు వడ్డీలేని రుణాలను అందిస్తామని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల కింద రూ.10 లక్షలు చెల్లిస్తామన్నారు. ఒక్కో సంఘానికి లక్ష రూపాయల చొప్పున తిరిగి చెల్లించే అవసరం లేకుండా గ్రాంట్ కింద ఇస్తామన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, అభయహస్తం తీసుకుంటున్న మహిళలకు నెలకు రూ.వెయ్యి చొప్పున అందిస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు.
దళితులను మోసం చేస్తున్న ప్రభుత్వాలు
వరంగల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను మోసం చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం హన్మకొండలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ, కేసీఆర్‌లు అనుసరిస్తున్న విధానాల వల్ల దళితులు అన్యాయానికి గురవుతున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రివ్యూ పిటిషన్ వేస్తారని చెప్పారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు కేటాయించలేదని విమర్శించారు. బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు కేటాయించినట్లు ప్రకటించి.. ఆ నిధులను ఇతర పనులకు మళ్లించడంపై ప్రభుత్వానికి కాగ్ మొట్టికాయ వేసిందన్నారు. వర్గీకరణ చేయాలని డిమాండ్ చేసిన మంద కృష్ణను కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికి రెండు సార్లు జైలులో పెట్టిందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment