మిర్చిరైతు సంపత్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న రేవంత్ రెడ్డి
సాక్షి, మహబూబాబాద్: ‘ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పి.. విద్యార్థులు, రైతుల ఓట్లతో గద్దెనెక్కి న కేసీఆర్.. ఏడేళ్లుగా ప్రజలను గోస పెడుతున్నారు. ఇప్పుడు సీఎం సార్‌ను సాగనంపే సమయం వచ్చింది. ఓటు ద్వారా బుద్ధి చెప్పి గద్దె దింపాలి’అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన రేవంత్‌రెడ్డి ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్న నెల్లికుదురు మండలం సంధ్యా తండాకు చెందిన ఉపాధ్యాయుడు జేత్రాంనాయక్, మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన మిర్చిరైతు నారమళ్ల సంపత్, బయ్యారం మండల కేంద్రానికి చెందిన నిరుద్యోగి ముత్యాల సాగర్ కుటుంబాలను పరామర్శించారు.
అధైర్య పడవద్దని, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అప్పుడు మీకష్టాలు తీరుతాయని భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ శశాంక, ఆర్డీఓ, తహసీల్దార్‌లతో మాట్లాడి ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం మహబూబాబాద్‌లో రేవంత్ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ వస్తే తమ కష్టాలు తీరిపోతాయని ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగులకు కేసీఆర్ మొండిచేయి చూపించారన్నారు. రైతులను ఆదుకోవడంలోనూ విఫలమయ్యారన్నారు. దీంతో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు.
రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీవో
రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీవోను ప్రకటించి ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాలతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆటలాడుకుంటోందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఈ కుట్రలో బీజేపీ పాత్ర కూడా ఉందన్నారు. ఉద్యోగాలను భర్తీ చేయడం చేతకాని ప్రభుత్వం ప్రస్తుతం పనిచేస్తున్న వారిని చెట్టుకొకరు, పుట్టకొకరుగా బదిలీ చేసిందని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం కూడా ఉద్యోగాల భర్తీ మాటే ఎత్తడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే..
ప్రజల కష్టాలు, బాధలు పట్టకుండా పాలిస్తున్న కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలను తరిమికొట్టే ఆయుధమైన ఓటు మీచేతుల్లోనే ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. ‘ఇంతకాలం ఓపిక పట్టారు.. ఇంకో 18 నెలలు ఆగండి. అప్పుడు కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది’అని జోస్యం చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్‌ను జైలుకు పంపడం తథ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు బలరాం నాయక్, వేం నరేందర్‌రెడ్డి, అయోధ్యరెడ్డి, బెల్లయ్యనాయక్ తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment