అన్ని వర్గాలూ ఏకమవుతుండటంతో సమైక్య పోరు మరింత రాజుకుంది. 13 జిల్లాల ఏపీ ఎన్జీవోలు, మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ, పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఆదివారం విజయవాడలో సమావేశమై కార్యాచరణ రూపొందించారు.
సాక్షి, మచిలీపట్నం/విజయవాడ : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకు బలపడుతూ మరింత ఉధృతమవుతోంది. ఐదోరోజైన ఆదివారం ఏపీ ఎన్జీవోలు, మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు విజయవాడలో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడంతో ఉద్యమానికి మరింత బలం చేకూరింది. వారితో కలిసి పోరాటం చేయడానికి విద్యార్థి సంఘ జేఏసీ నేతలు సిద్ధమౌతున్నారు. వీరికితోడు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు రోడ్లపైకి వచ్చి ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తామంటూ ప్రకటనలు చేయడంతో రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత తీవ్రతరమయ్యే పరిస్థితి కనబడుతోంది. రాష్ట్ర విభజనపై 13 జిల్లాల ఏపీ ఏన్జీవోల సంఘ ప్రతినిధులు గాంధీనగర్‌లోని ఎన్జీఓ హోమ్‌లో సమావేశమవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మున్సిపల్ గెస్ట్‌హౌస్‌లో 13 జిల్లాల ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు సమావేశమై సమైక్యాంధ్రకు మద్దతుగా నిర్ణయాలు తీసుకున్నారు. తొలుత మూడు రోజులు విధులు బహిష్కరించాలని, పౌరసేవల్ని నిలిపివేయాలని నిర్ణయించారు.
పొలిటికల్ జేఏసీ నిరసన ప్రదర్శన..
విజయవాడలో పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు కొలనుకొండ శివాజీ, ఆకుల శ్రీనివాసకుమార్, వైఎస్సార్ సీపీ నాయకులు తాడి శకుంతల, అబ్దుల్ ఖాదర్, తెలుగుదేశం నాయకులు బొండా ఉమామహేశ్వరరావు, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొని సమైక్యాంధ్ర ఉద్యమానికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. వీఆర్‌ఓల సంక్షేమ సంఘం స్వర్ణాప్యాలెస్‌లో సమావేశమై కేసీఆర్‌ను ఉరితీయాలని, సోనియాను తరిమేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ తూర్పునియోజకవర్గ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ కార్యాలయం నుంచి రంగా విగ్రహం వరకు కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు.
మచిలీపట్నంలో కార్లు, బైక్‌ల ర్యాలీ..
మచిలీపట్నంలో సమైక్యంధ్ర ప్రతినిధులు కార్లు, బైక్‌లతో ర్యాలీ నిర్వహించి తమ నిరసన తెలియజేశారు. జగ్గయ్యపేటలో సమైక్యంధ్రకు మద్దతుగా మహిళలు రోడ్లపైకి వచ్చి కబడ్డీ ఆడారు. రాష్ట్రాన్ని విడదీస్తే సహించబోమని హెచ్చరించారు. గుడివాడ నెహ్రూ చౌక్‌లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వంటావార్పులు నిర్వహించి ర్యాలీ జరిపారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. ఉయ్యూరులో జర్నలిస్టు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా, ప్రధాన వీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి గాంధీ విగ్రహం వద్ద అధికారులకు పూలు అందచేసి సమైక్యాంధ్రకు మద్దతుగా సహకరించాలని కోరారు. భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో కార్మికులు ప్రదర్శన చేశారు. తిరువూరులో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించగా వైఎస్సార్ సీపీ నేతలు అందులో పాల్గొన్నారు.
కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం..
రాష్ట్ర విభజనకు నిరసనగా హనుమాన్‌జంక్షన్‌లో కేసీఆర్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి దహనం చేశారు. కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఆధ్వర్యంలోనూ కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి, తాలూకా కార్యాలయం వద్ద నిరవధిక నిరాహారదీక్షకు సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు తాను దీక్ష కొసాగిస్తానని ప్రకటించారు. అవనిగడ్డలో అధికార భాషాసంఘం చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో పాల్గొన్న శ్రీనివాసరావు అనే యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోగా పోలీసులు అడ్డుకున్నారు.
సమైక్య పోరు మరింత రాజుకుంది
Published Mon, Aug 5 2013 1:43 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
Advertisement
Advertisement