అంతా ‘బ్రాంది’యేనా..!
Published Thu, Aug 8 2013 1:28 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు..’ అన్నట్టు మద్యం వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎవరెన్ని ఆంక్షలు పెట్టినా వ్యాపారం మూడ్ ఫుల్స్, ఆరు నిబ్‌లు మాదిరిగా సాగేలా వ్యాపారులు కొత్త దారులు వెదుకుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆంక్షలతో ఈసారి మద్యం కేటాయింపులపై కచ్చితమైన చర్యలు తీసుకున్నారు. పల్లెపోరు నేపథ్యంలో అవకాశం ఉన్నంతమేర విక్రయాలు జరపడంలో లిక్కర్ సిండికేట్లు ఫలప్రదమయ్యారు. ఆంక్షలు కాస్త సడలిస్తే మరిన్ని లాభాలు వచ్చేవని మధనపడుతున్న సిండికేట్లకు తాజాగా సమైక్యాంధ్ర ఉద్యమం, అవనిగడ్డ ఉపఎన్నిక కోడ్ మింగుడుపడనీయడం లేదు.
సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా మద్యం ఏరులై పారింది. గత ఏడాది జూలైలో ఎంత సరకు కేటాయించారో.. ఈ ఏడాది జూలైలోను అదే కోటాను అమలుచేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. గత్యంతరంలేని ఎక్సైజ్ అధికారులు గతంలో వలే ఇప్పుడూ కోటా ఇచ్చారు. గుడివాడ, విజయవాడ డిపోల నుంచి నెలవారీగా ఇచ్చే మద్యం కోటాపై కంట్రోల్ పెట్టారు. గత ఏడాది జూలైలో విజయవాడ డిపో నుంచి మద్యం 1,88,509 కేసులు, బీర్లు 74,425 కేసులు ఇవ్వగా.. ఈ ఏడాది జూలైలో మద్యం 1,68,081 కేసులు, బీర్లు 63,879 కేసులు ఇచ్చారు.
గుడివాడ డిపో నుంచి గత జూలైలో లిక్కర్ 1,02,007 కేసులు, బీర్లు 29,609 కేసులు, ఈ ఏడాది జూలైలో మద్యం 93,796, బీర్లు 23,206 కేసులు కోటాగా ఇచ్చారు. గత ఏడాది మాదిరిగానే కోటా ఇచ్చినా ఈ ఏడాది దాదాపు 57 మద్యం షాపుల లెసైన్సులు రెన్యువల్ కాలేదు. వాటికి కేటాయించే కోటా తగ్గినా లిక్కర్ సిండికేట్లు పంచాయతీ ఎన్నికలపై గంపెడాశలు పెట్టుకుని అడ్డదారులు వెదికారు. రెండు నెలలుగా దాచిన మద్యం నిల్వలను ఎన్నికల్లో వదిలించుకున్నారు. దీనికితోడు పట్టణాల్లోని బార్లు, మద్యం షాపుల్లో ఉన్న నిల్వలను పల్లెలకు తరలించి సొమ్ము చేసుకున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో మద్యానికి డిమాండ్ ఉన్నప్పటికీ సరిపడే మద్యం స్టాకు లేకపోవడంతో వారి ఆశలకు అడ్డుకట్ట పడినట్టయింది. ఎన్నికల వేళ బెల్ట్ షాపులను తొలగిస్తామన్న అధికారుల ప్రకటనలు అరకొరగానే నెరవేరాయి. పోలింగ్‌కు 48 గంటల ముందు మద్యం షాపుల్ని సీజ్ చేసినట్టు బిల్డప్ ఇచ్చినా.. వేరేచోట బెల్ట్ షాపుల ద్వారా యథేచ్ఛగా అమ్మకాలు సాగించారు. పలుచోట్ల నాటుసారా కూడా బాగానే తయారైంది.
ఆశ నిరాశేనా..
జిల్లాలో చోటుచేసుకున్న వరుస పరిణామాలు మద్యం వ్యాపారులకు మింగుడుపడడం లేదు. ఇటీవల 335 మద్యం షాపుల రెన్యువల్ విషయంలో ఎక్సైజ్ అధికారులు సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించారు. చివరి అస్త్రంగా పంచాయతీ ఎన్నికల్లో చూసీచూడనట్టుగానే ఉంటామని, అమ్మకాలు బాగుంటాయి కాబట్టి లాభాలు వస్తాయని ఆశ చూపారు. జిల్లాలో 57 షాపులు మినహా అన్నింటినీ రెన్యువల్ చేసుకున్నారు.
అంతవరకు బాగానే ఉన్నా పంచాయతీ ఎన్నికల్లో అడ్డంగా సంపాదించేద్దాం అనుకున్నవారికి జూలై కోటా ఆంక్షలు అవరోధంగా మారాయి. ప్రస్తుతం తాజాగా సమైక్యాంధ్ర ఉద్యమంతో షాపులు మూతపడుతున్నాయి. మరోవైపు అవనిగడ్డలో ఉపఎన్నిక జరుగుతుంటే ఎన్నికల కోడ్ కారణంగా జిల్లా అంతటా గత ఆగస్టు మాదిరిగానే ఈ నెలలోనూ మద్యం కోటా కేటాయిస్తున్నారు. అదనపు కోటా పొంది లాభాలు పొందుదామనుకున్న వ్యాపారులకు ప్రభుత్వం ఝలక్ ఇవ్వడంతో అడ్డదారులు వెదుకుతున్నారు.
Advertisement