అడ్డదారుల్లో అక్రమ కిక్కు! | Alcohol Smuggling in Kurnool | Sakshi
Sakshi News home page

అడ్డదారుల్లో అక్రమ కిక్కు!

Published Fri, Dec 13 2019 12:54 PM | Last Updated on Fri, Dec 13 2019 12:54 PM

Alcohol Smuggling in Kurnool - Sakshi

చిప్పగిరి మండలం ఖాజీపురం గ్రామానికి చెందిన బోయ నారాయణ కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి 1,056 మద్యం బాటిళ్లను జిల్లాకు తీసుకువస్తుండగా ఎక్సైజ్‌ పోలీసులు పక్కా సమాచారంతో కాపుకాచి పట్టుకున్నారు.

కర్నూలు:  కర్నూలు మండలం పడిదెంపాడు గ్రామానికి చెందిన రాఘవేంద్రగౌడు తన అనుచరుడు ఈడిగ మహేంద్రగౌడు ద్వారా అలంపూర్‌ నుంచి 315 మద్యం సీసాలు ఆటోలు తరలిస్తూ గ్రామ శివారులో ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. అదే రోజు ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన దూదేకుల సిద్ధయ్య, దూదేకుల దస్తగిరిలు 126 మద్యం బాటిళ్లను మోటర్‌ సైకిల్‌పై ఆళ్లగడ్డకు తరలిస్తుండగా ఎక్సైజ్‌ పోలీసులు కాపు కాచి పట్టుకున్నారు.  

... ఇలా ప్రతి రోజూ  కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి జిల్లాలోకి విచ్చలవిడిగా మద్యం రవాణా అవుతోంది. ఏపీలో మద్యం ధరలు పెరగడం, విక్రయాల విషయంలో పరిమితులు విధించడంతో పొరుగు రాష్ట్రాలకు చెందిన మద్యం అమ్మకాలు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. మొన్నటి వరకు బెల్ట్‌ దుకాణాలు నిర్వహించిన వారు వివిధ మార్గాల్లో మద్యం సీసాలు తెచ్చి జిల్లాలో అమ్మకాలు సాగిస్తున్నారు. తెలంగాణలో మద్యం ధరలు తక్కువగా ఉండడంతో అక్కడ కొనుగోలు చేసి జిల్లాలోని కొంతమంది బార్ల యజమానులు ఎక్కువ ధరలకువిక్రయాలు చేసి సొమ్ము చేసుకుంటున్నట్లు బయటపడింది. నంద్యాలకు చెందిన టీడీపీ మాజీ కౌన్సిలర్‌ ఇదే తరహాలో భారీగా మద్యం తరలిస్తూ ఎక్సైజ్‌ పోలీసులకు పట్టుబడడం ఇందుకు బలం చేకూరుతోంది. తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్మకాలు చేస్తూ బార్ల యజమానులు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. 

వెలుగులోకి గ‘మ్మతై’న అంశాలు..
జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటైన తర్వాత గ‘మ్మతై’న అంశాలు చోటు చేసుకుంటున్నాయి. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ప్రభుత్వమే జిల్లాలో మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. గతంలో ఉన్న దుకాణాలను 20 శాతం మేర తగ్గించింది. డిగ్రీ, ఇంటర్‌ చదివి నిరుద్యోగులుగా ఉన్న వారిని సేల్స్‌ మెన్, సూపర్‌వైజర్లుగా నియమించి వారి ద్వారా అమ్మకాలు చేస్తున్నారు. గతంలో మద్యం సీసాల విషయంలో ఆంక్షలు ఉండేవికావు. ఎన్ని సీసాలైనా మందుబాబులు తీసుకునేవారు. ఇప్పుడు ఒక మనిషికి రోజుకు గరిష్టంగా మూడు సీసాలు మాత్రమే ఇస్తున్నారు. మరోవైపు 21 ఏళ్లు దాటిన వారికే మందు ఇస్తున్నారు. రాత్రి 8గంటలు దాటితే మద్యం దొరకని పరిస్థితి. దీన్ని ఆసరాగా చేసుకుని గతంలో మద్యం వ్యాపారంలో సంబంధాలు ఉన్న వారు లాభపడాలని చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పల్లెల్లో బెల్ట్‌ దుకాణాలు నిర్వహించిన వారు ఎక్కువ భాగం తెలంగాణ రాష్ట్రం నుంచి మద్యాన్ని తరలించిరాత్రి వేళల్లో రహస్యంగా వ్యాపారాలు సాగిస్తున్నారు. జిల్లాలోని మద్యం సీసాలకు తెలంగాణ ధరల విషయంలో ఎంతో వ్యత్యాసం ఉంది. క్వార్టర్‌ సీసాకు రూ.40 నుంచి రూ.60, ఫుల్‌బాటిల్‌కు రూ.200 నుంచి రూ.250 వరకు తేడా ఉంది. దీనికితోడు అక్కడ ఎన్ని సీసాలైనా ఇస్తున్నారు. ద్విచక్రవాహనాలు, కార్లు, లారీల్లో సరిహద్దు రాష్ట్రం తెలంగాణ నుంచి డ్యూటీ చెల్లించని మద్యం తీసుకువచ్చి విక్రయాలు జరుపుతున్నారు. దీంతో ప్రభుత్వం ఆదాయానికి గండి పడుతోంది. గతంలో బెల్ట్‌ దుకాణాలు నిర్వహించిన వారు కర్నూలు మండలంలోని ప్రతి పల్లెల్లో ఇప్పుడు ఇదే తరహా వ్యాపారానికి తెరతీశారు. ద్విచక్రవాహనాల ద్వారా తెలంగాణ మద్యాన్ని తరలిస్తున్నారు. కర్నూలుకు ఆనుకునే తెలంగాణ ప్రాంతం ఉండడంతో అక్కడ మద్యాన్ని ఇక్కడకు తీసుకువచ్చి అమ్మకాలు చేయడం సులువైంది. ఎక్సైజ్‌ పోలీసులు నమోదు చేస్తున్న కేసులే ప్రభుత్వానికి సుంకం చెల్లించని మద్యం విక్రయాల వ్యవహారాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.

అక్రమ రవాణాలో యువకులే కీలకం...
మద్యం అక్రమ రవాణాలో యువకులే కీలకపాత్ర పోషిస్తున్నారు. కొద్దిగా కష్టపడితే భారీగా డబ్బు సంపాదించుకోవచ్చన్న దురాశ యువకులను పెడమార్గం పట్టిస్తుంది. కర్నూలు – తెలంగాణ నడుమ జిల్లాను ఆనుకుని సుమారు 60 కిలో మీటర్ల మేరకు తుంగభద్రనది ఉంది. నదిలో ప్రవాహం తగ్గితే ఖాళీ నడకన, ద్విచక్రవాహనాల ద్వారా మద్యం తరలించే పరిస్థితి ఏర్పడింది. సుంకేసుల వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేవామని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నప్పటికీ కర్నూలు స్టేషన్‌లో ఉన్న సిబ్బందితో చెక్‌పోస్టు విధులు నిర్వర్తింపజేయడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది.  

సరిహద్దుల్లో నిఘా పెట్టాం
తెలంగాణ మద్యం జిల్లాలోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించాం. సుంకం చెల్లించని మద్యం అమ్మకాలు నిల్వరించేందుకు చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాం. బెల్ట్, మొబైల్‌ వ్యాపారులపై కూడా సమాచారం తెలిసిన వెంటనే తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేస్తున్నాం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మద్యం విక్రయాలు జరిగేలా చూస్తాం.  చెన్నకేశవరావు, డిప్యూటీ కమిషనర్‌     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement