మృతి చెందిన దంపతులు మల్లికార్జున, ముత్తమ్మ
సాక్షి,కర్నూలు(హొళగుంద): మద్యం వ్యసనం రెండు ప్రాణాలను బలి తీసుకుంది. తాగుడుకు బానిసైన వ్యక్తి మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన మండల కేంద్రమైన హొళగుందలో సోమవారం చోటు చేసుకుంది. ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్, ఆలూరు సీఐ ఈశ్వరయ్య కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.హొళగుంద ఎస్సీ కాలనీకి చెందిన మల్లప్ప, శంకరమ్మ పెద్ద కుమారుడు మల్లికార్జున (28)కు కర్ణాటక రాష్ట్రం బళ్లారి పట్టణానికి చెందిన ముత్తమ్మ(24)తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి గణేశ్, వంశీ ఇద్దరు కుమారులు. మల్లికార్జున తన భార్యా పిల్లలతో పాటు తన తల్లి శంకరమ్మ, ఇద్దరు సోదరులు వీరేశ్, రాజశేఖర్ బెంగళూరుకు వలస వెళ్లి కొన్నేళ్లుగా అక్కడే ఉన్నారు. లాక్‌డౌన్ కారణంగా ఆరు నెలల క్రితం అందరూ హొళగుందకు చేరుకున్నారు.
తాగుడుకు బానిసైన మల్లికార్జున తరచూ మద్యానికి డబ్బులు ఇవ్వాలని భార్య ముత్తమ్మతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా ఆమెతో గొడవ పడ్డాడు. వారుంటున్న గుడిసె చిన్నది కావడంతో గొడవను చూడ లేక మల్లికార్జున తల్లి, ఇద్దరు సోదరులు పిల్లలను తీసుకుని సమీపంలో వేరే వారి ఇంటికి వెళ్లి నిద్ర పోయారు. ఉదయం వారు ఇంటికి తిరిగి వచ్చి చూడగా గుడిసెకు లోపల తాళం వేసి ఉండడంతో అనుమానంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు తలుపు విరగ్గొట్టి లోపలికెళ్లి చూడగా మల్లికార్జున, ముత్తమ్మ ఉరికి వేలాడుతూ విగత జీవులుగా కనిపించారు. ముత్తమ్మ నుదటిపై గాయముండి నోటిలో రక్తం కారిన దృశ్యాలు ఉన్నాయి.
అనాథలుగా మారిన పిల్లలు
విషయం తెలుసుకున్న ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్, ఆలూరు సీఐ ఈశ్వరయ్య హొళగుంద ఎస్‌ఐ విజయ్‌కుమార్‌తో కలిసిసంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తన కుమార్తెను అల్లుడే కొట్టి చంపి ఉరేశాడని, తర్వాత భయపడి తను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, మృతురాలి తండ్రి శివప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు హత్య, ఆత్మహత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయకుమార్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన చిన్నారులను చూసి పలువురు కంటతడి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment