సహకరించాలంటూ సద్భావన యాత్ర: తెలంగాణ జేఏసీ
సాక్షి, నెట్‌వర్‌క: రాష్ర్ట ఏర్పాటుకు అడ్డుపడవద్దని కోరుతూ టీ-జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ జిల్లాల్లో శాంతిర్యాలీలు, సద్భావనా యాత్రలు కొనసాగుతున్నాయి. సీమాంధ్ర అధికారుల వ్యవహారశైలిని నిరసిస్తూ పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఖమ్మంలో మధ్యాహ్న భోజన సమయంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సీమాంధ్ర దిష్టిబొమ్మను దహనం చేశారు. మణుగూరు, కొత్తగూడెం, పాల్వంచ, బోనకల్లులలో శాంతిర్యాలీలు నిర్వహించగా అశ్వారావుపేటలో మోటార్‌సైకిల్ ర్యాలీ తీశారు. రాష్ట్ర విభజనకు సీమాంధ్రులు సహకరించాలంటూ నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ సెంటర్ వద్ద శనివారం శాంతి సద్భావన ర్యాలీ నిర్వహించారు.
కరీంనగర్‌లో అన్ని శాఖల ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భూమి తలకిందులైనా సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం మారదన్నారు. కరీంనగర్‌లో విద్యార్థులు శాంతి సద్భావన ర్యాలీ నిర్వహించగా, గిరిజన ఉద్యోగి హన్మంతు నాయక్‌పై దాడిని నిరసిస్తూ తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్‌లో సీమాంధ్ర దిష్టిబొమ్మ దహనం చేశారు. గోదావరిఖనిలో ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. మేడిపెల్లిలో ఉద్యోగులు తహశీల్దార్ కార్యాలయంతోపాటు ఐకేపీ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు.
చందుర్తిలో ఏబీవీపీ నాయకులు సీమాంధ్ర నాయకుల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఐదోరోజు నిరసన కొనసాగింది. ఇచ్చోడలో రాజకీయ జేఏసీ, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శాంతిర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సబ్ కలెక్టర్ దిగంబర్ మంజూలేకు వినతిపత్రం అందజేశారు. కాగా, తెలంగాణవాదులతో సమాచార హక్కుచట్టం కమిషనర్ తాంతియా కుమారి వ్యవహరశైలిని నిరసిస్తూ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపట్టారు.