సోలోగా.. జాలీగా | City people interest in traveling abroad alone | Sakshi
Sakshi News home page

సోలోగా.. జాలీగా

Published Wed, Jul 3 2024 1:13 AM | Last Updated on Wed, Jul 3 2024 1:13 AM

City people interest in traveling abroad alone

ఒంటరిగా విదేశాల్లో టూర్లకు వెళ్లడంపై సిటీ జనుల ఆసక్తి 

తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ ప్రాంతాలు చుట్టివచ్చేలా పర్యటనలు

వీసా అవసరం లేకుండా టూర్‌ వేయగల దేశాలకు క్యూ..

థాయ్‌లాండ్, మలేసియా, మాల్దీవులు, నేపాల్‌లకు వెళ్తున్న హైదరాబాదీలు

‘వీసా ఆన్‌ అరైవల్‌’ సదుపాయమున్న దేశాలకు సైతం డిమాండ్‌

ఇలాంటి వారి కోసం ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తున్న టూర్‌ ఆపరేటర్లు

చేతిలో పాస్‌పోర్టు.. బ్యాగులో మూడు, నాలుగు డ్రెస్సులు, అవసరమైన డబ్బులు.. అంతే.. విమానం ఎక్కేయడం, విదేశాలకు చెక్కేయడమే. ముందుగా వీసా అవసరం లేకుండా వెళ్లగలిగే దేశాలను చుట్టేసి వచ్చేయడమే. ఇది సోలో టూరిస్టుల నయా ట్రెండ్‌. అదీ గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరవాసుల్లో మరింత ఎక్కువగా కనిపిస్తోంది. నిమిషం తీరికలేని హడావుడి జీవితంలో కాస్త ఉపశమనం పొందేందుకు విదేశాల బాటపడుతున్నారు. వివిధ దేశాలకు చెందిన పర్యాటక సంస్థలు, ట్రావెల్‌ ఏజెన్సీలు రకరకాల టూరిస్టు ప్యాకేజీలు, రాయితీలతో హైదరాబాదీలను ఆకట్టుకుంటున్నాయి.    ..: సాక్షి, హైదరాబాద్‌ :..

సోలో టూర్‌లో ఇలా..
సోలో టూరిస్టులు చాలా వరకు డమ్మీ హోటల్‌ బుకింగ్‌లతో ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటారు. వెళ్లిన దేశాల్లో డార్మిటరీలు, హాస్టల్‌ సదుపాయం ఉన్నచోట రాత్రి బస చేస్తారు. చిన్న హోటళ్లలో భోజనం చేస్తారు. వీటన్నింటి వల్ల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది.

⇒ ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లాల్సివచ్చినప్పుడు.. రాత్రి పూట రైళ్లలో ప్రయాణం చేయడం వల్ల ఎక్కడో ఒకచోట బసచేయాల్సిన అవసరం కూడా ఉండదు. విమాన చార్జీలు, స్థానిక రవాణా చార్జీలు మాత్రమే సోలో టూరిస్టుల బడ్జెట్‌లో ఎక్కువ ఖర్చు కింద లెక్క.
⇒లగేజీ తక్కువే. దీంతో ప్రత్యేకంగా హోటల్లోనే ఉండాలనే ఇబ్బంది కూడా ఉండదు.

వీసాలు సులువుగా వస్తుండటంతో..
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు సుమారు 15 వేల మంది వివిధ దేశాలకు వెళుతుండగా..అందులో 60శాతం వరకు ‘సోలో టూరిస్టులే’ ఉంటున్నట్లు టూర్‌ ఆపరేటర్లు చెప్తున్నారు. గోవా, జైపూర్, కశ్మీర్‌ వంటి పర్యాటక, వినోద ప్రాంతాలకు వెళ్లినట్టుగానే.. ఇప్పుడు సిటీ టూరిస్టులు విదేశీ టూర్లకు వెళ్తున్నారని అంటున్నారు. కోవిడ్‌ అనంతరం పరిస్థితుల్లో మార్పు వచ్చిందని.. చాలా దేశాలు పర్యాటకులను ఆకట్టుకునేందుకు ‘వీసా ఆన్‌ అరైవల్, ఫ్రీ వీసా’ వంటివి అందిస్తున్నాయని చెప్తున్నారు.

సర్క్యూట్‌ టూర్‌లు
సాధారణంగా నగర పర్యాటకులు దుబాయ్, సింగపూర్‌ పర్యటనలకు ఎక్కువగా వెళ్తారు. ఇంటిల్లిపాది కలిసి ఏదో ఒక దేశంలో పర్యటిస్తారు. ఈ మేరకు టూరిస్టు సంస్థలు వీసాతో కలిపి టూర్‌ ప్యాకేజీలు అందజేస్తాయి. ఇలా నలుగురు కుటుంబ సభ్యులు కలిసి వెళ్లినప్పుడు ఒకటి కంటే ఎక్కువ దేశాల్లో పర్యటించడం కష్టమే. ఫ్యామిలీగా వెళ్లే టూర్లు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర యూరప్‌ దేశాలకు ఎక్కువ. కానీ సోలో టూర్‌లు వీటికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. సోలో టూరిస్టులు ఒకసారి ఇంటి నుంచి బయలుదేరితే మూడు, నాలుగు దేశాల్లో పర్యటించేలా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు.

ప్రస్తుతం మలేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక, మాల్దీవులు, నేపాల్‌ ఉచిత వీసా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది ఈ దేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సింగపూర్‌కు ఈ–వీసా సదుపాయం ఉంది. దీంతో చాలా మంది సింగపూర్‌కు ఈ–వీసాపై వెళ్లి అక్కడి నుంచి మలేసియా, థాయ్‌లాండ్‌లనూ చుట్టి వచ్చేస్తున్నారు. ఇక ఇండోనేషియా, కంబోడియా, వియత్నాం తదితర దేశాలు వీసా ఆన్‌ అరైవల్‌ సదుపాయం అందిస్తున్నాయి. సోలో టూరిస్టులు ఈ దేశాలకు కూడా ఎక్కువగా వెళ్తున్నట్లు పర్యాటక సంస్థలు చెప్తున్నాయి. కంబోడియాలోని పల్లవుల నాటి అంగ్‌కోర్‌వాట్‌ దేవాలయం, ఇండోనేషియాలోని బాలి, జావా, సుమత్రా తదితర ద్వీపాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయని అంటున్నాయి.

వియత్నాంలో బైక్‌ రైడింగ్‌
సిటీ టూరిస్టులను కొంత కాలం నుంచి విశేషంగా ఆకట్టుకుంటున్న మరో పర్యాటక దేశం వియత్నాం. తక్కువ విమానచార్జీలతో ఈ చిన్న దీవుల దేశంలో పర్యటించవచ్చు. ఇండోనేషియాలోని బాలి బీచ్‌ కల్చర్‌ పర్యాటకులను ఆకట్టుకుంటుండగా.. వియత్నాంలో బైక్‌ రైడింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా మారింది. హైదరాబాద్‌ నుంచి అక్కడికి వెళ్లిన పర్యాటకులు అద్దె బైక్‌లపై ఉత్తరం నుంచి దక్షిణం వరకు రైడ్‌ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ‘వియత్నాం చిన్న దేశం. ఉత్తరం నుంచి దక్షిణం వరకు 2,000 కిలోమీటర్లలోపే ఉంటుంది.

బైక్‌పై ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది’’ అని నగరానికి చెందిన టూరిస్టు సుబ్బారెడ్డి తెలిపారు. దేశ, విదేశాలకు చెందిన టూరిస్టులు బైక్‌ రైడింగ్‌ కోసం వియత్నాంకు వస్తారని చెప్పారు. ఇక తక్కువ బడ్జెట్‌లో సందర్శించే సదుపాయమున్న మరో దేశం ఫిలిప్పీన్స్‌. దీవుల సముదాయమైన ఈ దేశంలో పర్యటించడం హైదరాబాద్‌ నుంచి గోవా ట్రిప్పు కోసం వెళ్లినట్లుగానే సింపుల్‌గా ఉంటుంది. వీసా ఆన్‌ అరైవల్, ఈ–వీసా సదుపాయాలున్న తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ తదితర దేశాలకు కూడా సిటీ పర్యాటకులు వెళ్తున్నారు.

వేర్వేరు దేశాలకు వెళ్తూ ఉంటా..
2013 నుంచీ విదేశాల్లో పర్యటిస్తున్నాను. ఇప్పటివరకు 65 దేశాలు తిరిగాను. విదేశాల్లో విభిన్నమైన, వైవిధ్యమైన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానం, ఆహార అలవాట్లు వంటివి తెలుసుకోవడం, పరిశీలించడం నాకెంతో ఇష్టం. ఎక్కడికెళ్లినా అక్కడి ప్రజలతో మమేకమవుతాను. పర్యాటక ప్రదేశాలను సందర్శించడం కంటే అక్కడి ప్రజలను కలిసేందుకే ఇష్టపడతాను.  – సుబ్బారెడ్డి, రెగ్యులర్‌ టూరిస్ట్‌

2 నెలలకోసారి మలేసియా వెళ్తా..
కనీసం రెండు, మూడు నెలలకు ఒకసారి మలేసియాకు వెళ్తాను.ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తాను. అక్కడి తెలుగు సంఘాల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లలో పిల్లలకు తెలుగు బోధిస్తాను.దాంతో మలేసియాతో ఒక అనుబంధం ఏర్పడింది.  – రాఘవాచార్య, టీచర్‌

ఇదీ రాకపోకల లెక్క (సుమారుగా)..
⇒ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు రాకపోకలు సాగించే ప్రయాణికులు 65,000 నుంచి 70,000
⇒ అందులో దేశీయ ప్రయాణికులు 55,000
⇒ అంతర్జాతీయ ప్రయాణికులు దాదాపు 15,000
⇒ సోలో టూరిస్టులు 7,000 నుంచి 9,000

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement