Peace rallies
-
అభినందన్ కోసం పాకిస్థాన్‌లో ర్యాలీలు
ఇస్లామాబాద్: భారత పైలట్ అభినందన్ వర్ధమాన్‌ను విడుదల చేయాలంటూ పాకిస్థాన్‌లో పౌర సంఘాలు నినదించాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చల్లబరిచి, శాంతి నెలకొనేలా చేయాలన్న నినాదాలతో పలు నగరాల్లో ప్రదర్శనలు నిర్వహించాయి. యుద్ధం రావాలని కోరుకోవడం లేదని పాకిస్థానీయులు పేర్కొన్నారు. భారత్-పాక్ కాల్పుల విరమణకు కట్టుబడాలని ఆకాంక్షించారు. (ఎవరీ అభినందన్?) పాకిస్థాన్ మానవ హక్కుల సంఘం, ఆస్మా జహంగీర్ లీగల్ ఎయిడ్ సెల్, బాండెడ్ లేబర్ లిబరేషన్ ఫ్రంట్(బీఎల్ఎల్ఎఫ్), సౌత్ ఆసియా పార్టనర్షిప్ పాకిస్థాన్(ఎస్ఏపీ-పీకే), వుమెన్ యాక్షన్ ఫోరమ్(డబ్లూఏఎఫ్), అవామీ వర్కర్స్ పార్టీ తదితర సంస్థలు పాకిస్థాన్ వ్యాప్తంగా శాంతి ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించాయి. లాహోర్, ఇస్లామాబాద్, పెషావర్, కరాచీ నగరాల్లో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యవాదులు పాల్గొన్నారు. అభినందన్‌ను విడుదల చేయాలంటూ ఆందోళనకారులు ప్లకార్డులు ప్రదర్శించి, శాంతి గీతాలు ఆలపించారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాకిస్థాన్‌లో అత్యధిక శాతం మంది ప్రజలు యుద్ధం కోరుకోవడం లేదని వుమెన్ ఇన్ స్ట్రగుల్ ఫర్ ఎంపర్మెంట్(డబ్ల్యూఐఎస్‌ఈ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బుష్రా ఖాలిక్ తెలిపారు. ‘యుద్ధం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా నష్టపోతారు. వారికి అండగా నిలిచే కుటుంబ సభ్యులను కోల్పోతారు. యుద్ధం వస్తే రెండు తీవ్రంగా నష్టపోతాయ’ని అన్నారు. కాగా, అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో భారత పైలట్ అభినందన్‌ను విడుదల చేయాలని పాకిస్థాన్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. (అణు యుద్ధం వస్తే..?) Protests against war took place all over Pakistan. This is a huge win for the civil society which has been under constant crackdown since last few years. Here is a video from Islamabad. Many people had banners asking for #Abhinandhan’s release #PakIndiaCeasefire #MakeChaiNotWar pic.twitter.com/aNapExVnyT — Ammara Ahmad (@ammarawrites) February 28, 2019 -
జాతిపిత సాక్షిగా సమైక్య ప్రతిజ్ఞ
సాక్షి నెట్వర్క్ : జాతిపిత మహాత్మాగాంధీ జయంతి నాడు సీమాంధ్రవాసులు ఆయన విగ్రహాల సాక్షిగా సమైక్య ప్రతిజ్ఞ చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మొదటిదైన ఆంధ్రప్రదేశ్ ముక్కలు కాకుండా ఒక్కటిగా ఉంచేందుకు దేనికైనా సిద్ధమని ప్రతినబూనారు. వరుసగా 64వ రోజూ బుధవారం కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వివిధ రూపాల్లో సమైక్యపోరాటం హోరెత్తింది. రాష్ట్ర విభజన జరిగితే నీటి కరువు తీవ్రత ఎలా ఉంటుందో తెలియజేస్తూ కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం గురజలో ఆర్ఎంపీ వైద్యులు ఉగ్గు గిన్నెలతో స్నానం చేశారు. ఇబ్రహీంపట్నంలో 2 వేల మంది విద్యార్ధులు భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు ఇంటర్ బోర్డు ఆర్జేడీ కార్యాలయం వద్ద అధ్యాపకులు గాంధీగిరి పద్ధతిలో శాంతియుత నిరసన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా శాంతి ర్యాలీలు నిర్వహించి మహాత్ముని విగ్రహాలకి వినతిపత్రాలు సమర్పించారు. పలుచోట్ల జాతిపిత విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. నెల్లూరుజిల్లా వేదాయపాళెం సెంటర్లో ముదిరాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరాయి. విశాఖ జిల్లా వేంపాడు వద్ద జాతీయ రహదారిపై పాయకరావుపేట, తుని ప్రాంతాలకు చెందిన శెట్టి బలిజలు భారీ ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో విద్యార్థులు ప్రదర్శన చేపట్టారు. కాకినాడ గాంధీనగర్ పార్కులోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించి కేంద్రం మనసు మార్చాలని వేడుకున్నారు. పశ్చిమ గోదావరిజిల్లా ఏలూరులో ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా 144 మంది ఉపాధ్యాయులు దీక్షలో కూర్చున్నారు. విజయనగరంలో మహిళా జేఏసీ ఆధ్వర్యంలో కోట జంక్షన్లో నిర్వహించిన నారీభేరి కార్యక్రమం విజయవంతంగా సాగింది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి ఉద్యమాన్ని కొనసాగించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో గిరిజన గర్జనకు జనం పోటెత్తారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ స్త్రీ వేషంలో గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. కర్నూలు నగరంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు రాజ్‌విహార్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ కూడలిలో ‘సమైక్య గర్జన’ నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 1869 మంది మహిళలు రిలే దీక్షలు చేపట్టారు. కడపలో వేలాది మంది విద్యార్థులు భారీ జాతీయజెండాతో ర్యాలీ నిర్వహించి సమైక్య గర్జన నిర్వహించారు. రాజంపేటలో జేఏసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ప్రొద్దుటూరులో నివాసాలు, వాహనాలపై సమైక్య జెండాలు ఎగరవేశారు. పులివెందులలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జేఏసీ నేతలపై పనబాక చిందులు సాక్షి నెట్వర్క్ : గుంటూరుజిల్లా బాపట్లలోని పనబాక నివాస గృహాన్ని జేఏసీ నేతలు ముట్టడించి, లోపలికి వెళ్లేందుకు యత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం బయటకు వచ్చిన ఆమె.. ‘వచ్చినప్పుడల్లా రాజీనామా..రాజీనామా అంటూ నసపెడుతున్నారు... నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తే మళ్లీ గెలిపిస్తారా... వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యర్థులను పోటీకి నిలపకుండా చూస్తారా..?’ అంటూ చిందులేశారు. మరోవైపు విశాఖలో కేంద్రమంత్రి కృపారాణిని విద్యుత్‌శాఖ ఉద్యోగులు అడ్డుకున్నారు. తాను రాజీనామా చేస్తే సామాన్య పౌరురాలిని అవుతానని, పార్లమెంట్లో వాదనలు విన్పించడం కష్టమవుతుందన్నారు. ఢిల్లీలో అంధ ఉద్యోగుల ధర్నా సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్ర అంధ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏపీ భవన్ ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. విభజనపై కాంగ్రెస్ నిర్ణయాన్ని తప్పుపడుతూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించవద్దని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అంధ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొర్రెపాటి రవీంద్రబాబు మాట్లాడుతూ... అంధులకు సంబంధించి వసతి గృహాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని, ఇప్పుడు విభజన జరిగితే తమ పరిస్థితి మరింత అంధకారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రమే పరిష్కరించాలి :ఎస్పీ బాలు కావలి : రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వమే పరిష్కార మార్గం చూపాలని సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో బుధవారం రాత్రి జరిగిన బాలసుబ్రహ్మణ్యం ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత సంక్షోభంతో ప్రజల సమస్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మరో ఇద్దరి మృతి రాష్ట్ర విభజనలో హైదరాబాద్‌ను కోల్పోతే తనకు భవిష్యత్ ఉండదనే భయంతో చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం కాంట్రపల్లెకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి వినోద్(24) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విభజన ప్రక్రియను తట్టుకోలేక విజయనగరంలోని ప్రదీప్‌నగర్ కాలనీకి చెందిన తిరుమలాదేవి(45) మంగళవారం రాత్రి గుండె ఆగి చనిపోయారు. -
7న చలో హైదరాబాద్: ప్రొఫెసర్ ఎం.కోదండరాం
సాక్షి, హైదరాబాద్: ‘చలో హైదరాబాద్’ పిలుపుతో సెప్టెంబరు మొదటివారంలో రాజధానిలో భారీ శాంతిర్యాలీని నిర్వహించనున్నట్టు తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద గురువారం నిర్వహించిన సద్భావనాదీక్ష (శాంతిదీక్ష)లో ఆయన మాట్లాడుతూ సెప్టెంబరు 4-7 తేదీల మధ్య తెలంగాణ ప్రజలంతా హైదరాబాద్‌కు తరలి రావడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి భయాలు లేవని, సంపన్న సీమాంధ్రులే తెలంగాణను అడ్డుకునే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రపంచంలోని ఏ ప్రాంతం వారైనా కలిసే ఉంటామని చెప్పడానికి సెప్టెంబరు మొదటివారంలో భారీశాంతి ర్యాలీని నిర్వహిస్తున్నట్టుగా వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఉపద్రవం ఏదో వస్తున్నట్టుగా, భారతదేశం నుండి విడిపోతున్నట్లుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా ఇదే ఫెడరల్ వ్యవస్థ ఉంటుందని, రాష్ట్రాలన్నీ ఇప్పటిలాగానే పనిచేస్తాయని వివరించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో ఒక మాట, ఢిల్లీలో మరోమాట చెప్తూ ఇటు ప్రజలను, అటు అధిష్టానాన్ని మోసం చేస్తున్నాడని విమర్శించారు. నదీ జలాల పంపకం, హైదరాబాద్ వంటివాటిని వివాదం చేసే విధంగా కిరణ్ వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చేదాకా ఇదే ఐకమత్యంతో పోరాడాల్సిందేనని కోదండరాం పిలుపునిచ్చారు. పార్టీ వైఖరిని స్పష్టం చేసిన తర్వాతనే చంద్రబాబు సీమాంధ్రలో యాత్రకు పోవాలని, లేదంటే అది ఆత్మవంచన యాత్రే అవుతుందని టీఆర్ఎస్ సంస్థాగత, శిక్షణా శిబిరాల నిర్వహణ కమిటీ చైర్మన్ కడియం శ్రీహరి విమర్శించారు. తెలంగాణ ప్రజల సహనాన్ని చేతకానితనంగా భావిస్తే ఎవరికీ మంచిదికాదని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు హెచ్చరించారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలనుకుంటే ఎవరూ సహించబోరని ఆయన చెప్పారు. వైషమ్యాలు పెంచడానికి ఎంఐఎం కుట్రలు: కవిత తెలంగాణపై ఇలాంటి కుట్రలే కొనసాగితే ఇప్పటిదాకా బతుకమ్మలు ఎత్తుకున్న చేతులతోనే బరిసెలను పడతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజల ఇంటిపై ఎంఐఎం పేరు రాసుకోవాలని అసదుద్దీన్ చెప్తున్నారని, రాజకీయ లబ్ధికోసం తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య వైషమ్యాలను పెంచడానికి ఎంఐఎం కుట్రలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణపై ఇంకా మోసపూరితంగా వ్యవహరించకుండా చంద్రబాబునాయుడు వైఖరేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. పొట్ట నింపుకోవడానికి వచ్చినవారితో సామరస్యంగా ఉంటామని, పొట్టలు కొట్టేవారితోనే తమ పోరాట మని చెప్పారు. ప్రజల మధ్య ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టకుండా, శాంతియుత విభజనకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీక్షలో జేఏసీ నేతలు దేవీప్రసాద్, మల్లేపల్లి లక్ష్మయ్య, వి.శ్రీనివాస్‌గౌడ్, సి.విఠల్, అద్దంకి దయాకర్, రఘు, జల వనరులరంగం నిపుణులు ఆర్.విద్యాసాగర్‌రావు తదితరులు ప్రసంగించారు. సెప్టెంబరు 7న శాంతిర్యాలీ..? జేఏసీ నిర్వహించ తలపెట్టిన శాంతిర్యాలీ సెప్టెంబరు 7న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 4 నుంచి7 తేదీల మధ్యనే దీనిని నిర్వహించాలని మొదట భావించారు. అయితే సెప్టెంబరు 3, 4 తేదీల్లో ముల్కీ అమరుల సంస్మరణ దినంగా జరుపుకోనున్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం సెప్టెంబరు 5న ఉండటంతో శాంతి ర్యాలీని 7న నిర్వహించాలని జేఏసీ నేతలు సూత్రప్రాయంగా నిర్ణయించారు. -
సహకరించాలంటూ సద్భావన యాత్ర: తెలంగాణ జేఏసీ
సాక్షి, నెట్వర్క: రాష్ర్ట ఏర్పాటుకు అడ్డుపడవద్దని కోరుతూ టీ-జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ జిల్లాల్లో శాంతిర్యాలీలు, సద్భావనా యాత్రలు కొనసాగుతున్నాయి. సీమాంధ్ర అధికారుల వ్యవహారశైలిని నిరసిస్తూ పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఖమ్మంలో మధ్యాహ్న భోజన సమయంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సీమాంధ్ర దిష్టిబొమ్మను దహనం చేశారు. మణుగూరు, కొత్తగూడెం, పాల్వంచ, బోనకల్లులలో శాంతిర్యాలీలు నిర్వహించగా అశ్వారావుపేటలో మోటార్‌సైకిల్ ర్యాలీ తీశారు. రాష్ట్ర విభజనకు సీమాంధ్రులు సహకరించాలంటూ నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ సెంటర్ వద్ద శనివారం శాంతి సద్భావన ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్లో అన్ని శాఖల ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భూమి తలకిందులైనా సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం మారదన్నారు. కరీంనగర్లో విద్యార్థులు శాంతి సద్భావన ర్యాలీ నిర్వహించగా, గిరిజన ఉద్యోగి హన్మంతు నాయక్‌పై దాడిని నిరసిస్తూ తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్లో సీమాంధ్ర దిష్టిబొమ్మ దహనం చేశారు. గోదావరిఖనిలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. మేడిపెల్లిలో ఉద్యోగులు తహశీల్దార్ కార్యాలయంతోపాటు ఐకేపీ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు. చందుర్తిలో ఏబీవీపీ నాయకులు సీమాంధ్ర నాయకుల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఐదోరోజు నిరసన కొనసాగింది. ఇచ్చోడలో రాజకీయ జేఏసీ, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శాంతిర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సబ్ కలెక్టర్ దిగంబర్ మంజూలేకు వినతిపత్రం అందజేశారు. కాగా, తెలంగాణవాదులతో సమాచార హక్కుచట్టం కమిషనర్ తాంతియా కుమారి వ్యవహరశైలిని నిరసిస్తూ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపట్టారు. -
హోరెత్తిన శాంతి నినాదం
సాక్షి, న్యూస్‌లైన్ : సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు పెంపొందాలని.. రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్రులు అడ్డుపడవద్దని కోరుతూ రాజకీయ జేఏసీ ఆధ్వర్యం లో తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం శాంతి, సద్భావన ర్యాలీలు నిర్వహించారు. సీమాంధ్ర ప్రాంతంలో ప్రస్తుతం సాగుతున్న ఉద్యమం కృత్రిమమని నినదించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి ప్రత్యక్ష మద్దతునిస్తూ తెలంగాణపై వివక్ష చూపుతున్న సర్కారు కుట్రలను తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని టీఎన్జీవోల నేతలు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన ర్యాలీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, కావేటి సమ్మయ్య, పార్టీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు అశోక్, ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు పాల్గొన్నారు. మంచిర్యాల, కాగజ్‌నగర్‌లలో శాంతి సద్భావన ర్యాలీలు నిర్వహించారు. నిజామాబాద్‌లో జరిగిన ర్యాలీలో జేఏసీ చైర్మన్ గోపాల్‌శర్మ, టీ ఎన్జీవోల నేతలు గైని గంగారాం, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏఎస్ పోశెట్టి, ఉద్యోగులు పాల్గొన్నారు. కరీంనగర్లో టీఎన్జీవోల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా, సద్భావన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎంఏ.హమీద్, నర్సింహస్వామి మాట్లాడుతూ సీమాంధ్రులది కృత్రిమ ఉద్యమమన్నారు. గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శాంతిర్యాలీ నిర్వహించారు. జగిత్యాలలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు. మంథనిలో టీఎన్జీవోల ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టగా, పెద్దపల్లిలో ఉద్యోగులు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. ఖమ్మంలో వివిధ శాఖల ఉద్యోగులు కలెక్టరేట్ నుంచి శాంతి ర్యాలీ, బస్టాండ్‌లో మానవహారం చేపట్టారు. భద్రాచలం, అశ్వారావుపేటలలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని గనుల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించారు. పాలమూరులో జేఏసీ ఆధ్వర్యంలో శాంతిర్యాలీ నిర్వహించారు. షాద్‌నగర్‌లో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారులు, సిబ్బంది, జూనియర్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, జేఏసీ నాయకులు శాంతిర్యాలీ నిర్వహించారు. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు పెంపొందాలని కోరుతూ వరంగల్ జిల్లా నర్సంపేటలో జేఏసీ ఆధ్వర్యంలో 10వేల మందితో ర్యాలీ నిర్వహించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హన్మకొండ కోర్టులో విధులు బహిష్కరించి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ఉద్యోగులపై దాడులు కొనసాగితే ఆంధ్రా ఉద్యోగులు గోబ్యాక్ నినాదాన్ని తీసుకోవాల్సి ఉంటుందని రాష్ర్ట బార్‌కౌన్సిల్ సభ్యుడు ఎం. సహోదర్‌రెడ్డి హెచ్చరించారు. అనంతరం డీఆర్వో కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. మహబూబాబాద్, హన్మకొండల్లో టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగులు దాడులను ఖండిస్తూ నిరసన ర్యాలీలు నిర్వహించారు. టీ-ఉద్యోగులపై దాడులు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఉద్యోగ జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు హెచ్చరించారు.