హోరెత్తిన శాంతి నినాదం | Political JAC peace rallies in Telangana | Sakshi
Sakshi News home page

హోరెత్తిన శాంతి నినాదం

Published Sat, Aug 17 2013 3:26 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM

హోరెత్తిన శాంతి నినాదం - Sakshi

హోరెత్తిన శాంతి నినాదం

సాక్షి, న్యూస్‌లైన్ : సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు పెంపొందాలని.. రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్రులు అడ్డుపడవద్దని కోరుతూ రాజకీయ జేఏసీ ఆధ్వర్యం లో తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం శాంతి, సద్భావన ర్యాలీలు నిర్వహించారు. సీమాంధ్ర ప్రాంతంలో ప్రస్తుతం సాగుతున్న ఉద్యమం కృత్రిమమని నినదించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి ప్రత్యక్ష మద్దతునిస్తూ తెలంగాణపై వివక్ష చూపుతున్న సర్కారు కుట్రలను తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని టీఎన్జీవోల నేతలు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
 
 ఆదిలాబాద్‌లో నిర్వహించిన ర్యాలీలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, కావేటి సమ్మయ్య, పార్టీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు అశోక్, ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు పాల్గొన్నారు. మంచిర్యాల, కాగజ్‌నగర్‌లలో శాంతి సద్భావన ర్యాలీలు నిర్వహించారు. నిజామాబాద్‌లో జరిగిన ర్యాలీలో జేఏసీ చైర్మన్ గోపాల్‌శర్మ, టీ ఎన్‌జీవోల నేతలు గైని గంగారాం, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏఎస్ పోశెట్టి, ఉద్యోగులు పాల్గొన్నారు. కరీంనగర్‌లో టీఎన్‌జీవోల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా, సద్భావన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎంఏ.హమీద్, నర్సింహస్వామి మాట్లాడుతూ సీమాంధ్రులది కృత్రిమ ఉద్యమమన్నారు.
 
 గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శాంతిర్యాలీ నిర్వహించారు. జగిత్యాలలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు. మంథనిలో టీఎన్జీవోల ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టగా, పెద్దపల్లిలో ఉద్యోగులు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. ఖమ్మంలో వివిధ శాఖల ఉద్యోగులు కలెక్టరేట్ నుంచి శాంతి ర్యాలీ, బస్టాండ్‌లో మానవహారం చేపట్టారు. భద్రాచలం, అశ్వారావుపేటలలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని గనుల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించారు. పాలమూరులో జేఏసీ ఆధ్వర్యంలో శాంతిర్యాలీ నిర్వహించారు.
 
 షాద్‌నగర్‌లో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారులు, సిబ్బంది, జూనియర్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, జేఏసీ నాయకులు శాంతిర్యాలీ నిర్వహించారు. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు పెంపొందాలని కోరుతూ వరంగల్ జిల్లా నర్సంపేటలో జేఏసీ ఆధ్వర్యంలో 10వేల మందితో ర్యాలీ నిర్వహించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హన్మకొండ కోర్టులో విధులు బహిష్కరించి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ఉద్యోగులపై దాడులు కొనసాగితే ఆంధ్రా ఉద్యోగులు గోబ్యాక్ నినాదాన్ని తీసుకోవాల్సి ఉంటుందని రాష్ర్ట బార్‌కౌన్సిల్ సభ్యుడు ఎం. సహోదర్‌రెడ్డి హెచ్చరించారు. అనంతరం డీఆర్వో కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. మహబూబాబాద్, హన్మకొండల్లో టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగులు దాడులను ఖండిస్తూ నిరసన ర్యాలీలు నిర్వహించారు. టీ-ఉద్యోగులపై దాడులు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఉద్యోగ జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు హెచ్చరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement