స్థానికత ఆధారంగానే.. ఉద్యోగుల తాత్కాలిక విభజన | Temporary partition on the basis of local employees | Sakshi
Sakshi News home page

స్థానికత ఆధారంగానే.. ఉద్యోగుల తాత్కాలిక విభజన

Published Mon, May 26 2014 1:19 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM

Temporary partition on the basis of local employees

 సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్
 
*
పోస్టులను బట్టి జూనియర్లను అటు, ఇటు కేటాయించినట్టు వెల్లడి
*శాశ్వత విభజన సమయంలో
*అభ్యంతరాలను పరిష్కరిస్తామని హామీ

 
 సాక్షి, హైదరాబాద్: స్థానికత ఆధారంగానే సచివాలయ ఉద్యోగులు, పోస్టుల తాత్కాలిక విభజన జరుగుతుందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ ఉద్యోగ సంఘాల నేతలకు స్పష్టం చేశారు. సచివాలయ ఉద్యోగుల విభజనపై వివాదాలు నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నేతలతో ఆయన ఆదివారమిక్కడ సమావేశమయ్యారు. స్థానికత ఆధారంగా తాత్కాలిక విభజన చేశామని ఉద్యోగ సంఘాల నేతలకు తెలిపారు. అయితే కొన్ని పోస్టు ల్లో ఖాళీలను బట్టి జూనియర్లను అటు, ఇటు కేటాయించామని.. ఈ మేరకు కొంతమంది సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణకు, తెలంగాణ ఉద్యోగులను సీమాంధ్రకు తాత్కాలికంగా పంపిణీ చేశామని వివరించారు.
 
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కేడర్‌లో కొంత మంది తెలంగాణ ఉద్యోగులను సీమాంధ్రకు కేటాయించినట్లు చెప్పారు. అలాగే డిప్యూటీ, అడిషనల్ సెక్రటరీ కేడర్‌లో కొంతమంది సీమాంధ్ర అధికారులను తెలంగాణకు కేటాయించామని పేర్కొన్నారు. ఉద్యోగుల సహకరిస్తే మూడు నెలల్లోపే శాశ్వత కేటాయింపులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాల ఆవిర్భావ దినం సమీపిస్తున్న తరుణంలో తాత్కాలిక కేటాయింపులు వెంటనే పూర్తి చేయాలని, ఈ మేరకు రూపొందించిన ఉద్యోగుల కేటాయింపుల జాబితాను కేంద్రానికి పంపించి ఆమోదం తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన జాబితాకు అంగీకరిస్తే సోమవారం కేంద్రానికి పంపిస్తానని రమేష్ ఉద్యోగ సంఘాలకు చెప్పారు.
 
 ఏ ప్రాంతం ఉద్యోగులను ఆ ప్రాంతానికే కేటాయించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు చేసిన విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించలేదు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే కేటాయింపులు చేసినట్టు స్పష్టంచేశారు. అయితే వారి అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళతానని చెప్పారు. ఈ తాత్కాలిక కేటాయింపుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మూడు నెలల్లో అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో శాశ్వత కేటాయింపులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
 
దీంతో తాత్కాలిక కేటాయింపుల జాబితా పట్ల ఇరు ప్రాంతాల నేతలు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. కాగా, సచివాలయ ఉద్యోగుల సీనియారిటీని నిర్ధారించడం ప్రభుత్వానికి కష్టతరంగా ఉందని, ఉద్యోగ సంఘాల నేతలే కూర్చుని సీనియారిటీ జాబితా రూపొందించాలని పీవీ రమేష్ సూచించారు. అయితే, ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని ఉద్యోగ సంఘాల నేతలు ఆయనకు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement