సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సచివాలయంలో రగులుతున్న ‘స్థానికేతర’ చిచ్చు జిల్లాకు పాకింది. తెలంగాణ సచివాలయం లోని స్థానికేతర ఉద్యోగులను సీమాంధ్రకు పంపాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల డిమాండ్ తెరపైకి వచ్చిన విషయం విదితమే. ఈ అంశం ఇప్పుడు జిల్లాలోనూ చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ కూడా స్థానికేతర ఉద్యోగులు ఎంత మంది ఉన్నారనే అంశంపై ఉద్యోగ సంఘాల నేతలు ఆరా తీస్తున్నారు. వారి పూర్తి వివరాలు ఇవ్వాలని కలెక్టర్ అహ్మద్‌బాబుకు సమాచార హక్కు చట్టం కింద ఇటీవల దరఖాస్తు చేశామని టీఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ తెలిపారు.
అటెండర్ నుంచి ఉన్నతాధికారి వరకు వారి పేరు, హోదా, ఏ ప్రాంతానికి చెందిన వారు, ఎక్కడి నుంచి బదిలీపై వచ్చారు వంటి అన్ని వివరాలు ఇవ్వాలని దరఖాస్తులో కోరారు. ఈ వివరాలను వారం రోజుల్లో పంపాలని కలెక్టర్ ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే తెలంగాణ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కూడా ఇటీవల డీఎంహెచ్‌వోకు ఇచ్చిన వినతిపత్రంలో ఈ స్థానికేతర ఉద్యోగుల అంశాన్ని ప్రస్తావించారు. ఇలా సేకరించిన వివరాలను అన్ని జిల్లాల్లో క్రోడీకరించి కేంద్రానికి పంపాలనే నిర్ణయానికి వచ్చినట్లు టీఎన్‌జీవో నేతలు పేర్కొన్నారు.
8 వేలకు పైగా స్థానికేతరులు?
జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి సుమారు 8వేల మంది స్థానికేతర ఉద్యోగులుంటారని టీఎన్‌జీవో నాయకులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ముఖ్యంగా ఐదారు శాఖల్లో సీమాంధ్ర ఉద్యోగులు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. విద్యాశాఖలో అనేక మంది ఉపాధ్యాయులు స్థానికేతరులు ఉన్నట్లు తేలింది. వైద్య ఆరోగ్యశాఖలో కూడా ఈ సంఖ్య అధికంగా ఉన్నట్లు గుర్తించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో కూడా అనేక మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లున్నట్లు భావిస్తున్నారు. ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ), గుడిపేట బెటాలియన్‌లో ఎక్కువగా స్థానికేతర ఉద్యోగులున్నట్లు గుర్తించారు. ఒక్క సింగరేణిలోనే నాలుగు వేలకుపైగా స్థానికేతరులు ఉన్నట్లు సమాచారం.
సమావేశంలో జిల్లా నేతలు
స్థానికేతర ఉద్యోగుల గుర్తింపు విషయమై హైదరాబాద్‌లో గురువారం జరిగిన ఉద్యోగ సంఘాల భేటీలో జిల్లా నుంచి టీఎన్‌జీవో నాయకులు అశోక్, పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.
లోకల్ లొల్లి
Published Fri, May 23 2014 2:46 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM
Advertisement