సీఎం తప్పుదారి పట్టించారు | Kiran kumar reddy mislead us : Seemandhra congress Leaders | Sakshi
Sakshi News home page

సీఎం తప్పుదారి పట్టించారు

Published Sat, Oct 12 2013 2:38 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM

సీఎం తప్పుదారి పట్టించారు - Sakshi

సీఎం తప్పుదారి పట్టించారు

 సీమాంధ్ర కాంగ్రెస్ నేతల ఆగ్రహం  
అసెంబ్లీ తీర్మానం అడ్డుకుందామని చెప్తున్న సీఎం  
అసలు తీర్మానమే రాదని తేల్చిచెప్పిన షిండే

 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విభజనకు సంబంధించి రాష్ట్ర శాసనసభ తీర్మానం కోరడం లేదనీ, కేవలం బిల్లుపై అభిప్రాయం మాత్రమే కోరుతూ పంపిస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే స్పష్టంగా చెప్పడంతో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో పడిపోయారు. ఇంతకాలం అసెంబ్లీలో తీర్మానం అడ్డుకుందామంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్న మాటలను నమ్మిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తాజా పరిణామాల్లో ఏం చేయాలన్న అంశంపై తర్జనభర్జన మొదలైంది.
 
 తీర్మానాన్ని అడ్డుకుంటామన్న సాకు చూపి ఇంతకాలం నెట్టుకురాగా ఇప్పుడేం చేయాలన్న అంశంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి తమను తప్పుదోవ పట్టించారని కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణపై జూలై 30 న సీడబ్ల్యూసీ తీర్మానం చేసినప్పటి నుంచి ఈరోజు వరకు అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయని, తెలంగాణ నోట్ కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన తర్వాత తీర్మానం చేయమని కోరే సంప్రదాయం ఎక్కడా లేదని, ముఖ్యమంత్రి ఇంతకాలం చెబుతూ వచ్చిందంతా ఒక పథకం ప్రకారమే జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కేబినేట్ నోట్ ఆమోదం పొందడానికి ముందే అసెంబ్లీని సమావేశపరిచి సమైక్యంగా ఉంచాలని కోరుతూ తీర్మానం చేసి పంపిద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతిపాదనను పట్టించుకోకుండా ఆరోజు ప్రతిష్టకు పోయినందుకు ఈరోజు ఇరకాటమైన పరిస్థితి తలెత్తిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ‘‘ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు సైతం అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించాలని ప్రతిచోటా మాట్లాడుతూ ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా అదే మాట చెబుతూ వస్తుంటే తీర్మానాన్ని అడ్డుకోవచ్చని భావించాం. రెండు రోజుల కిందట ఏపీఎన్జీవోలతో జరిపిన చర్చల్లోనూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడిస్తామని ముఖ్యమంత్రి చెబుతుంటే అడ్డుకోవడం సాధ్యమవుతుందని భావిస్తూ వచ్చాం. షిండే ప్రకటన, కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు గమనించిన తర్వాత ఇప్పుడు అలాంటిదేమీ లేదని, కేవలం అభిప్రాయం కోసమే బిల్లు అసెంబ్లీకి వస్తుందని తెలిసిన తర్వాత ఏం చేయాలో మా వాళ్లకు అర్థం కావడం లేదు’’ అని మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు.
 
 విభజనను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడమే మేలు: గాదె
 అసెంబ్లీకి తెలంగాణ తీర్మానమే రాదని కేంద్రం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే సుమోటోగా అసెంబ్లీని సమావేశపరిచి విభజనను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపడమే మేలని మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. తద్వారా కేంద్రం పునరాలోచనలో పడే అవకాశాలున్నాయన్నారు. మంత్రి ఎస్.శైలజానాథ్, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ పద్మరాజు శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో తాజా పరిణామాలపై చర్చించారు. దీనిపై సీఎంను కలిసి తగిన విధంగా కార్యాచరణ రూపొందించుకోవడమే మేలని శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు అంతకుముందు వివిధ పనుల నిమిత్తం మంత్రులు ఎన్.రఘువీరారెడ్డి, టీజీ వెంకటేశ్, పార్ధసారథి, కొండ్రు మురళీమోహన్, దానం నాగేందర్, మహీధర్‌రెడ్డిసహా పలువురు ప్రజాప్రతినిధులు సీఎంను కలిశారు. వీరిలో కొందరు నేతలు షిండే ప్రకటనను సీఎం వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది.
 
 అయితే సీఎం మాత్రం కేంద్రం నుంచి వచ్చిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తేనే ప్రయోజనం ఉంటుందే తప్ప అసెంబ్లీ తనంతట తాను విభజనను వ్యతిరేకిస్తూ తీర్మానం పంపితే లాభం ఉండదని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. షిండే ప్రకటననే అంతిమమని అనుకోవాల్సిన పనిలేదని, దీనిపై మరింత స్పష్టత ఇవ్వాలని తాను శుక్రవారం ఉదయం దిగ్విజయ్‌సింగ్‌కు ఫోన్ చేసినట్లు వారితో చెప్పారు. కేంద్ర పెద్దలు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నప్పటికీ చివరకు విభజన తీర్మానం రాక తప్పదని చెప్పుకొచ్చారు. కేంద్ర హోంమంత్రి విభజన తీర్మానం అసెంబ్లీకి రాదని కరాఖండిగా చెబుతున్నా సీఎం మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతుండటం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆశ్చర్యపోయారు. సీఎం ఎందుకిలా మాట్లాడుతున్నారో తమకు అర్థం కావడం లేదని సీనియర్ మంత్రి ఒకరు అసహనం వ్యక్తం చేశారు. సీమాంధ్ర ప్రజలంతా సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తిస్తూ రోడ్లపైకి వస్తుంటే సీఎం మాత్రం చివరివరకు పదవిలో కొనసాగాలనే భావనతో దాటవేత ధోరణిని అవలంబిస్తున్నారని భావన కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.  
 
 దిగ్విజయ్‌సింగ్‌కు సీఎం ఫోన్

 ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్‌సింగ్‌కు ఫోన్ చేసి రాష్ట్ర విభజన తీర్మానం అసెంబ్లీకి వస్తుందా? రాదా? అన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ‘‘మీరేమో అసెంబ్లీకి విభజన తీర్మానం రెండుసార్లు వస్తుందని నాతో చెప్పారు. షిండే గారేమో తీర్మానం రాదని, ముసాయిదా బిల్లును మాత్రమే అసెంబ్లీకి పంపి అభిప్రాయం కోరతామంటున్నారు. అసలు విభజనపై ఏ విధానాన్ని అనుసరిస్తున్నారు? ఒకే మాటగా చెప్పండి’’ అని కోరారని ముఖ్యమంత్రి కార్యాలయవర్గాలు చెప్పారు. ప్రస్తుతం తాను మధ్యప్రదేశ్‌లో ఉన్నందున ఢిల్లీ వెళ్లిన తరువాత హైకమాండ్‌తో మాట్లాడి విభజన తీర్మానంపై స్పష్టమైన ప్రకటన చేయిస్తానని దిగ్విజయ్‌సింగ్ సీఎంకు హామీనిచ్చినట్లు ఆ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement