అభినందన్‌ కోసం పాకిస్థాన్‌లో ర్యాలీలు | Pakistanis On Street Protest to Release Of IAF Pilot Abhinandan | Sakshi
Sakshi News home page

అభినందన్‌ కోసం పాకిస్థాన్‌లో ర్యాలీలు

Published Fri, Mar 1 2019 3:32 PM | Last Updated on Fri, Mar 1 2019 3:42 PM

Pakistanis On Street Protest to Release Of IAF Pilot Abhinandan - Sakshi

ఇస్లామాబాద్‌: భారత పైలట్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను విడుదల చేయాలంటూ పాకిస్థాన్‌లో పౌర సంఘాలు నినదించాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చల్లబరిచి, శాంతి నెలకొనేలా చేయాలన్న నినాదాలతో పలు నగరాల్లో ప్రదర్శనలు నిర్వహించాయి. యుద్ధం రావాలని కోరుకోవడం లేదని పాకిస్థానీయులు పేర్కొన్నారు. భారత్‌-పాక్‌ కాల్పుల విరమణకు కట్టుబడాలని ఆకాంక్షించారు. (ఎవరీ  అభినందన్‌?)

పాకిస్థాన్‌ మానవ హక్కుల సంఘం, ఆస్మా జహంగీర్‌ లీగల్‌ ఎయిడ్‌ సెల్‌, బాండెడ్‌ లేబర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌(బీఎల్‌ఎల్‌ఎఫ్‌), సౌత్‌ ఆసియా పార్టనర్‌షిప్‌ పాకిస్థాన్‌(ఎస్‌ఏపీ-పీకే), వుమెన్‌ యాక్షన్‌ ఫోరమ్‌(డబ్లూఏఎఫ్‌), అవామీ వర్కర్స్‌ పార్టీ తదితర సంస్థలు పాకిస్థాన్‌ వ్యాప్తంగా శాంతి ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించాయి. లాహోర్‌, ఇస్లామాబాద్‌, పెషావర్‌, కరాచీ నగరాల్లో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యవాదులు పాల్గొన్నారు. అభినందన్‌ను విడుదల చేయాలంటూ ఆందోళనకారులు ప్లకార్డులు ప్రదర్శించి, శాంతి గీతాలు ఆలపించారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

పాకిస్థాన్‌లో అత్యధిక శాతం మంది ప్రజలు యుద్ధం కోరుకోవడం లేదని వుమెన్‌ ఇన్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఎంపర్‌మెంట్‌(డబ్ల్యూఐఎస్‌ఈ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బుష్రా ఖాలిక్‌ తెలిపారు. ‘యుద్ధం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా నష్టపోతారు. వారికి అండగా నిలిచే కుటుంబ సభ్యులను కోల్పోతారు. యుద్ధం వస్తే రెండు తీవ్రంగా నష్టపోతాయ’ని అన్నారు. కాగా, అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో భారత పైలట్‌ అభినందన్‌ను విడుదల చేయాలని పాకిస్థాన్‌ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.  (అణు యుద్ధం వస్తే..?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement