2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో దాడి ఘటనాస్థలి(ఫైల్)
ఇస్లామాబాద్: పుల్వామా దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనీ, ఆ ఘటన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విజయమని ఆ దేశ మంత్రి ఒకరు ప్రకటించడం సంచలనం రేపింది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో గురువారం జరిగిన చర్చ సందర్భంగా శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఫవద్ చౌధరి ఈ మేరకు ప్రకటన చేశారు. ‘‘భారత్‌ను వారి దేశంలోనే గట్టి దెబ్బ తీశాం. పుల్వామా విజయం ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో మన జాతి సాధించిన విజయం. ఈ విజయంలో మీరు, మేము, మనందరమూ భాగస్వాములమే’’అని అన్నారు. పుల్వామాలో విజయం అని మంత్రి పేర్కొనడంపై సభలో కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ఫావద్ మీడియాతో మాట్లాడుతూ.. పుల్వామా ఘటన అనంతరం పాక్ బలగాలు దాడి చేసేందుకు భారత్ భూభాగంలోకి వెళ్లగలిగాయని తెలిపారు.
ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో పుల్వామాలో విజయం అన్న వ్యాఖ్యలను మాత్రం వెనక్కు తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. అభినందన్‌ని విడుదల చేయకపోతే భారత్ దాడి చేస్తుందని ఆర్మీ చీఫ్‌కే కాళ్లలో వణుకు పుట్టినట్టుగా పీఎంఎల్–ఎన్ నేత అయాజ్ సాధిక్ ప్రకటన చేసిన నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు అత్యంత సన్నిహితుడైన చౌధరి ఈ వ్యాఖ్యలు చేశారు. సాధిక్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని ఆయన పేర్కొన్నారు. ‘ప్రభుత్వాన్ని వ్యతిరేకించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ, జాతిని కించపరచడం తగదు’ అని తెలిపారు. గత ఏడాది జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత్ జవాన్లు నేలకొరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం రెండు దేశాల మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి.
కాళ్లు వణికాయి.. చెమటలు పట్టాయి
మేజర్ అభినందన్ వర్ధమాన్.. ఈ పేరు వింటేనే చాలు భారతీయుల గుండెలు ఉప్పొంగుతాయి. గత ఏడాది ఫిబ్రవరిలో కశ్మీర్‌లోని పుల్వామా దాడి ఘటన అనంతరం పాక్ చెరలో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ప్రదర్శించిన శౌర్య పరాక్రమాలకు సాక్షాత్తూ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ చీఫ్ కమర్ జావేద్ బాజ్వా వెన్నులో వణుకు పుట్టింది. ‘‘బాజ్వా కాళ్లు వణికాయి, నుదుటంతా చెమటలు పట్టాయి, పాక్ చెరలో ఉన్న అభినందన్‌ను విడుదల చేయకపోతే భారత్ ఎక్కడ దాడికి దిగుతుందోనని ఆయన నిలువెల్లా వణికిపోయారు’’అని పాకిస్తాన్ ఎంపీ, పాక్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) నాయకుడు సర్దార్ అయాజ్ సాధిక్ బుధవారం పార్లమెంటులో వెల్లడించారు. పుల్వామా దాడి ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై ఫిబ్రవరి 26, 2019న భారత్ బాంబులతో దాడి చేసింది. ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య జరిగిన వైమానిక పోరులో పాక్ యుద్ధవిమానం ఎఫ్–16ని అభినందన్ మిగ్–21 విమానంతో వెంబడించారు. పాక్ విమానాన్ని కూల్చేశారు. అదే సమయంలో మిగ్ విమానం పాక్ భూభాగంలో కూలిపోవడంతో అభినందన్‌ను పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది.
ఆనాటి సమావేశంలో ఏం జరిగిందంటే..!
మేజర్ అభినందన్ వర్ధమాన్‌ను పాక్ చెరలోకి తీసుకున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆ సమయంలో పాక్‌లో పార్లమెంటరీ పార్టీ నాయకులతో కూడిన ఉన్నతస్థాయి సమావేశంలో జరిగిన విషయాలను సాధిక్ వెల్లడించారు. ‘‘ఆనాటి సమావేశానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ హాజరు కాలేదు. విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి సమావేశంలో ఉన్నారు. అప్పుడే గదిలోకి వచ్చిన ఆర్మీ చీఫ్ బాజ్వా కాళ్లు వణుకుతున్నాయి. శరీరమంతా చెమటలతో నిండిపోయింది. చర్చలు జరిగిన అనంతరం ఖురేషి అభినందన్‌ను వెంటనే విడుదల చేయనివ్వండి. లేకపోతే భారత్ రాత్రి 9 గంటలకి మన దేశంపై దాడికి దిగుతుందని ఖురేషి అన్నారు’’ అంటూ సాధిక్ ఆనాటి సమావేశ వివరాలను గుర్తు చేసుకున్నారు. భారత్ దాడి చేయడానికి సన్నాహాలు చేయకపోయినా, పాక్ సర్కార్ భారత్ ముందు మోకరిల్లి అభినందన్‌ని అప్పగించిందంటూ సాధిక్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై మాటల తూటాలు విసిరారు. తన మాటల్ని వక్రీకరించారంటూ ఆ తర్వాత సాధిక్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment