జాతిపిత సాక్షిగా సమైక్య ప్రతిజ్ఞ | Seemandhra People makes United Pledge for mahatma Gandhi Jayanti | Sakshi
Sakshi News home page

జాతిపిత సాక్షిగా సమైక్య ప్రతిజ్ఞ

Published Thu, Oct 3 2013 2:59 AM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM

జాతిపిత సాక్షిగా సమైక్య ప్రతిజ్ఞ

జాతిపిత సాక్షిగా సమైక్య ప్రతిజ్ఞ

సాక్షి నెట్‌వర్క్ : జాతిపిత మహాత్మాగాంధీ జయంతి నాడు సీమాంధ్రవాసులు ఆయన విగ్రహాల సాక్షిగా సమైక్య ప్రతిజ్ఞ చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మొదటిదైన ఆంధ్రప్రదేశ్ ముక్కలు కాకుండా ఒక్కటిగా ఉంచేందుకు దేనికైనా సిద్ధమని ప్రతినబూనారు. వరుసగా 64వ రోజూ బుధవారం కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వివిధ రూపాల్లో సమైక్యపోరాటం హోరెత్తింది. రాష్ట్ర విభజన జరిగితే నీటి కరువు తీవ్రత ఎలా ఉంటుందో తెలియజేస్తూ కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం గురజలో ఆర్‌ఎంపీ వైద్యులు ఉగ్గు గిన్నెలతో స్నానం చేశారు. ఇబ్రహీంపట్నంలో  2 వేల మంది విద్యార్ధులు భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు ఇంటర్ బోర్డు ఆర్జేడీ కార్యాలయం వద్ద అధ్యాపకులు గాంధీగిరి పద్ధతిలో శాంతియుత నిరసన వ్యక్తం చేశారు.
 
  ప్రకాశం జిల్లా వ్యాప్తంగా శాంతి ర్యాలీలు నిర్వహించి మహాత్ముని విగ్రహాలకి వినతిపత్రాలు సమర్పించారు. పలుచోట్ల జాతిపిత విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. నెల్లూరుజిల్లా వేదాయపాళెం సెంటర్‌లో ముదిరాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరాయి. విశాఖ జిల్లా వేంపాడు వద్ద జాతీయ రహదారిపై పాయకరావుపేట, తుని ప్రాంతాలకు చెందిన శెట్టి బలిజలు భారీ ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో విద్యార్థులు ప్రదర్శన చేపట్టారు.  కాకినాడ గాంధీనగర్ పార్కులోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించి కేంద్రం మనసు మార్చాలని వేడుకున్నారు. పశ్చిమ గోదావరిజిల్లా ఏలూరులో ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా 144 మంది ఉపాధ్యాయులు దీక్షలో కూర్చున్నారు.
 
  విజయనగరంలో మహిళా జేఏసీ ఆధ్వర్యంలో కోట జంక్షన్‌లో నిర్వహించిన నారీభేరి కార్యక్రమం విజయవంతంగా సాగింది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి ఉద్యమాన్ని కొనసాగించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో గిరిజన గర్జనకు జనం పోటెత్తారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ స్త్రీ వేషంలో గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. కర్నూలు నగరంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు రాజ్‌విహార్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు.  అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ కూడలిలో ‘సమైక్య గర్జన’ నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 1869 మంది మహిళలు రిలే దీక్షలు చేపట్టారు. కడపలో వేలాది మంది విద్యార్థులు భారీ జాతీయజెండాతో ర్యాలీ నిర్వహించి సమైక్య గర్జన నిర్వహించారు. రాజంపేటలో జేఏసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ప్రొద్దుటూరులో నివాసాలు, వాహనాలపై సమైక్య జెండాలు ఎగరవేశారు. పులివెందులలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
 
 జేఏసీ నేతలపై పనబాక చిందులు
 సాక్షి నెట్‌వర్క్ : గుంటూరుజిల్లా బాపట్లలోని పనబాక నివాస గృహాన్ని జేఏసీ నేతలు ముట్టడించి, లోపలికి వెళ్లేందుకు యత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం బయటకు వచ్చిన ఆమె.. ‘వచ్చినప్పుడల్లా రాజీనామా..రాజీనామా అంటూ నసపెడుతున్నారు... నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తే మళ్లీ గెలిపిస్తారా... వైఎస్సార్‌సీపీ, టీడీపీ అభ్యర్థులను పోటీకి నిలపకుండా చూస్తారా..?’ అంటూ చిందులేశారు. మరోవైపు విశాఖలో కేంద్రమంత్రి కృపారాణిని విద్యుత్‌శాఖ ఉద్యోగులు అడ్డుకున్నారు. తాను రాజీనామా చేస్తే సామాన్య పౌరురాలిని అవుతానని, పార్లమెంట్‌లో వాదనలు విన్పించడం కష్టమవుతుందన్నారు.
 
 ఢిల్లీలో అంధ ఉద్యోగుల ధర్నా
 సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్ర అంధ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏపీ భవన్ ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. విభజనపై కాంగ్రెస్ నిర్ణయాన్ని తప్పుపడుతూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించవద్దని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అంధ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొర్రెపాటి రవీంద్రబాబు మాట్లాడుతూ... అంధులకు సంబంధించి వసతి గృహాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని, ఇప్పుడు విభజన జరిగితే తమ పరిస్థితి మరింత అంధకారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 కేంద్రమే పరిష్కరించాలి :ఎస్పీ బాలు
 కావలి : రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వమే పరిష్కార మార్గం చూపాలని సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో బుధవారం రాత్రి జరిగిన బాలసుబ్రహ్మణ్యం ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత సంక్షోభంతో ప్రజల సమస్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
 
 మరో ఇద్దరి మృతి
 రాష్ట్ర విభజనలో  హైదరాబాద్‌ను కోల్పోతే తనకు భవిష్యత్ ఉండదనే భయంతో చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం కాంట్రపల్లెకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి వినోద్(24) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విభజన ప్రక్రియను తట్టుకోలేక విజయనగరంలోని ప్రదీప్‌నగర్ కాలనీకి చెందిన తిరుమలాదేవి(45) మంగళవారం రాత్రి గుండె ఆగి చనిపోయారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement