మైసూరు: గాంధీజీ ఆశయాలను వల్లెవేయడం అధికారంలో ఉన్న వారికి తేలికే కానీ, వాటిని అనుసరించడం కష్టమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన ఆదివారం మైసూరు సమీపంలోని బదనవాలు గ్రామంలోని ఖాదీ గ్రామోద్యోగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రాన్ని గాంధీజీ 1927, 1932 సంవత్సరాల్లో సందర్శించడం విశేషం. ఈ సందర్భంగా జరిగిన గాంధీజీ జయంతి వేడుకల్లో రాహుల్ పాల్గొన్నారు. ఆ కేంద్రంలో చేనేత ఉత్పత్తులను పరిశీలించి, మహిళా కార్మికులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. గాంధీజీని పొట్టనబెట్టుకున్న సిద్ధాంతంతోనే గడిచిన ఎనిమిదేళ్లుగా దేశంలో అసమానతలు, విభేదాలను వ్యాపింప జేస్తున్నారంటూ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లనుద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న హింస, అసత్య రాజకీయాలకు వ్యతిరేకంగా అహింస, స్వరాజ్య భావనను పెంచేందుకే జోడో యాత్ర చేపట్టామన్నారు. బదనవాలు గ్రామంలో వీరశైవ, దళితులతో కలిసి రాహుల్ భోజనం చేశారు. ప్రముఖ శ్రీ నంజుండేశ్వర (శ్రీకంఠేశ్వర) ఆలయంలో పూజలు చేశారు. తర్వాత పాదయాత్ర మైసూరు ప్యాలెస్ మైదానం ఎదురుగా ఉన్న వస్తు ప్రదర్శన ఆవరణకు చేరుకుంది.
ఆరున యాత్రలో సోనియా
కర్ణాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో ఈనెల ఆరో తేదీన సోనియా గాంధీ పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో యాత్ర 511 కిలోమీటర్ల పొడవునా 21 రోజులపాటు కొనసాగనుంది. వైద్య పరీక్షల నిమిత్తం విదేశాలకు వెళ్లి వచ్చిన సోనియా తొలిసారిగా యాత్రలో పాలుపంచుకోనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్తున్న కర్ణాటకగుండా ప్రస్తుతం యాత్ర కొనసాగుతుండటం గమనార్హం. బీజేపీపాలిత రాష్ట్రం గుండా యాత్ర కొనసాగడం ఇదే తొలిసారి.
బదనవాలులో ఖాదీ గ్రామోద్యోగ్ కేంద్రంలో మగ్గాన్ని పరిశీలిస్తున్న రాహుల్
Comments
Please login to add a commentAdd a comment