రాష్ట్రంలో మెగా క్రీడా టోర్నీకి తెరలేస్తోంది. ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో క్రీడా సంబరాల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పోటీలు ప్రారంభించేలా ప్రణాళికలు రచిస్తోంది.
17ఏళ్లు పైబడిన బాలబాలికలకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖోతో పాటు 3కే మారథాన్, యోగా, టెన్నికాయిట్ వంటి పోటీలను నిర్వహించనుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ క్రీడల్లోనూ పోటీలను చేపట్టనుంది. గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి క్రీడాకారులను పోటీలకు ఆహ్వానిస్తోంది. మొత్తం ఐదు దశల్లో 2.99 లక్షల మ్యాచ్‌లు, ఈవెంట్స్ జరగనున్నాయి. – సాక్షి, అమరావతి
స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ..
‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలకు సుమారు మూడు నెలల సమయం ఉండటంతో గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో క్రీడాకారులను గుర్తించి.. వారు మంచి తర్ఫీదు పొందేలా శాప్ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఆయా సచివాలయాల పరిధిలో బాలబాలికలకు విడివిడిగా స్పోర్ట్స్ కిట్లను అందించనుంది. బ్యాడ్మింటన్ రాకెట్లు, రింగ్‌లు, క్రికెట్ కిట్, వాలీబాల్‌లు సమకూర్చనుంది. 26 జిల్లాల వారీగా ఎన్ని కిట్లు అవసరమో.. వాటి జాబితాను సిద్ధం చేస్తోంది.
సీఎస్ పర్యవేక్షణలో..
ప్రభుత్వం యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచడానికి, ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఏటా దీన్ని నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా 13 మందికిపైగా వివిధ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయిలో అపెక్స్ కమిటీని నియమించింది.
పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు టోర్నీ నిర్వహణ, విజేతలకు బహుమతుల పంపిణీ తదితర అంశాలపై కమిటీ సమగ్రంగా అధ్యయనం చేస్తోంది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి భవిష్యత్తులో మంచి శిక్షణ అందించనుంది. తద్వారా వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సత్తా చాటేలా తీర్చిదిద్దనుంది.
క్రీడా శక్తిని పెంపొందిస్తాం..
యువతకు చదువు ఒక్కటే కాదు.. క్రీడలు కూడా ఉండాలి. అందుకే ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ ద్వారా పెద్ద ఎత్తున క్రీడా శక్తిని పెంపొందిస్తోంది. దాదాపు నెలన్నర రోజుల పాటు ఈ పోటీలు ఉంటాయి. ఆరోగ్యకర జీవనశైలికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఈ క్రీడలు మేలు చేస్తాయి.
ఈ పోటీల నిర్వహణలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు భాగమవుతాయి. క్రీడాకారులకు అవసరమైన స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేస్తాం. పోటీలకు క్రీడా ప్రాంగణాలను గుర్తించి అభివృద్ధి చేస్తాం. – జి.వాణీమోహన్, ముఖ్య కార్యదర్శి, క్రీడలు, యువజన సర్విసులు
15వేల గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో..
తొలుత 15 వేల గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో 1.50 లక్షల మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇందులో అర్హత సాధిస్తే మండల స్థాయిలో (680 మండలాల్లో) 1.42 లక్షల మ్యాచ్‌లు, వడపోత అనంతరం నియోజకవర్గ స్థాయిలో 5,250, జిల్లా స్థాయిలో 312, రాష్ట్ర స్థాయిలో 250 మ్యాచ్‌లతో పాటు ఫైనల్ పోటీలు చేపట్టి విజేతలను ప్రకటిస్తారు. పోటీల నిర్వహణకు సంబంధించి శాప్.. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్‌వోపీ)ను సిద్ధం చేసి ఆయా జిల్లా కలెక్టర్లకు పంపించనుంది.
ఇప్పటికే పాఠశాలల మైదానాలు, మున్సిపల్ క్రీడా ప్రాంగణాలతో పాటు పోటీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పీఈటీ, పీడీలను గుర్తించే పనిలో నిమగ్నమైంది. స్థానికంగా క్రీడల్లో గుర్తింపు పొందిన వారి సహాయంతో యువతను పెద్ద ఎత్తు¯]∙పోటీలకు హాజరయ్యేలా ప్రోత్సహించనుంది.
Comments
Please login to add a commentAdd a comment