
విద్యా ఉద్యోగాల్లో క్రీడాకారులకు రెండు శాతం రిజర్వేషన్లను వర్తింపచేస్తూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు క్రీడాభివృద్ధికి దోహదం చేస్తుంది. క్రీడాకారులకు ఎంతో మేలు చేసే నిర్ణయమిది. తమ ప్రతిభ ద్వారా దేశానికి, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టే క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడం ప్రభుత్వం బాధ్యత. ర్యాంక్‌లు, మార్కులకోసం పోటీపడే ప్రస్తుత కాలంలో ఆటలు ఆడితే పిల్లలు పాడవుతారని, చదువుల్లో వెనకబడతారనే తల్లిదండ్రులు ఆలోచిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు క్రీడా సాంస్కృతిక కళల పట్ల ఆసక్తి చూపించడంలేదు. విద్యా సంస్థలు సైతం వీటిని ప్రోత్సహించడంలేదు. క్రీడా పోటీలలో పాల్గొన్న విద్యార్థులు ఏక కాలంలో చదువులపై, ఆటలపై దృష్టి సారించలేరు. అటువంటి విద్యార్థులకు ఉన్నత చదువులలో రిజర్వేషన్ సౌకర్యం ఉండాలి.
ఉద్యోగాలలో రిజర్వేషన్ల వల్ల క్రీడాకారులకు భవిష్యత్ ఉపాధి హామీ ఉంటే క్రీడల్లో తమ పిల్లల్ని ప్రోత్సహించే తల్లిదండ్రుల సంఖ్య క్రమంగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. క్రీడలకు సరైన ప్రోత్సహకాలు లేక ఎంతోమంది భావి క్రీడాకారులు మట్టిలో మాణిక్యాలవలే మిగిలిపోయారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు కూడా దినసరి కూలీలాగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కాలం వెళ్ళదీస్తున్న దీనగాథలు రోజు వినపడుతూనే ఉన్నాయి. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఎయిడెడ్ సంస్థల్లో దాదాపు 29 క్రీడాంశాలలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ఈ రిజర్వేషన్ సౌకర్యం వర్తించే విధంగా ఉత్తర్వులు జారీ చేసారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత పలు సందర్భాల్లో క్రీడారంగ రిజర్వేషన్లపై అనేక విజ్ఞప్తులు వచ్చాయి. చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు కూడా. అయతే క్రీడా రిజర్వేషన్లను అమలు చేయడంలో అసలు గొప్పతనం ఉంటుంది. అర్హులైన వారికి అవకతవకలు లేకుండా విమర్శలకు తావు లేకుండా అమలు జరగాలి. దొంగ సర్టిఫికెట్లకు అవకాశం లేకుండా నిజమైన క్రీడాకారులకు రిజర్వేషన్ల ఫలాలు దక్కేలా అన్ని శాఖలు సమిష్టి కృషి చెయ్యాలి. ఈ ఫలితాలు పొందిన క్రీడాకారులు భావి క్రీడాకారులను ప్రోత్సహించాలి.
- సురేష్ కాలేరు, రాష్ట్ర సహాధ్యక్షులు, తెలంగాణా ఉద్యోగుల సంఘం
Comments
Please login to add a commentAdd a comment