తెలంగాణ ఉద్యమ వేదిక ఆవిర్భావం | Telangana Movement Venue The emergence | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఉద్యమ వేదిక ఆవిర్భావం

Published Sat, May 2 2015 4:11 AM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM

Telangana Movement Venue The emergence

- చెరుకు సుధాకర్ నేతృత్వంలో నకిరేకల్‌లో పతాకావిష్కరణ
- ఏకమవుతున్న టీఆర్‌ఎస్ మాజీ నేతలు
- రాజకీయ ప్రత్యామ్నాయంగా రూపుదిద్దుకునే యోచన

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ పునాదులే ఆశయాలుగా మరో రాజకీయ ‘వేదిక’ పురుడు పోసుకుంటోంది. టీఆర్‌ఎస్‌లో గతంలో పనిచేసి నిర్లక్ష్యానికి గురైన వారు, రాజకీయ జేఏసీలో క్రియాశీల పాత్ర పోషించిన నేతలు ఏకమయ్యేందుకు ఇది మరో వేదిక కాబోతోంది.

ప్రభుత్వం వైఖరికి వ్యతిరేకంగా, రాజకీయ జేఏసీ ఉదాసీన వైఖరికి సమాంతరంగా సామాజిక వర్గాల కోణంలో ఏర్పాటు చేస్తున్న ఈ సంస్థను రాజకీయ ప్రత్యామ్నాయంగా మారుస్తామని కొత్త వేదిక రూపకర్తలు చెబుతున్నారు.  రాష్ట్ర సాధన ఫలాలు క్షేత్రస్థాయికి చేరుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వారంటున్నారు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో మేడే సందర్భంగా  టీఆర్‌ఎస్ మాజీ నేత డాక్టర్ చెరుకు సుధాకర్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమ వేదిక పతాకాన్ని ఆవిష్కరించారు.
 
సంప్రదాయానికి భిన్నంగా...
సంప్రదాయ నాయకత్వానికి భిన్నంగా ముందుకెళ్లే యోచనలో వేదిక నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీలు ప్రతిపక్ష పార్టీలుగా చెపుతున్నా.. ఆ పార్టీల నేతలు అట్టడుగు వర్గాల భాగస్వామ్యం గురించి ప్రశ్నించడం లేదని, అందుకే తాము రాజకీయ ప్రత్యామ్నాయంగా ముందుకెళ్లాలని వారు భావిస్తున్నారు.  
 
చిలకపచ్చ పతాకం
వేదిక పతాకాన్ని పరిశీలిస్తే.. ఇందులో అనేక ఉద్యమ, సామాజిక కోణాలు కనిపిస్తున్నారు. ముఖ్యంగా వేదికపై ఉద్యమ యోధురాలు చాకలి ఐలమ్మ, ప్రొఫెసర్ జయశంకర్‌ల చిత్రపటాలను ముద్రించారు. నీలిరంగు తెలంగాణ చిహ్నంలో ఎరుపు రంగు పిడికిలి ముద్రించారు. పతాకాన్ని చిలకపచ్చ రంగుతో తయారు చేయడం గమనార్హం.  
 
ఉద్యమ హామీల అమలుకు పోరాడాలి
జేఏసీ నేతలు పిట్టల రవీందర్, గురజాల రవీందర్ రావు
జనగామ : ‘తెలంగాణ సాధనకు ఎలా పోరాడామో... ఇప్పుడు సమస్యల సాధనకు అదేవిధంగా పోరాడేందుకు అందరూ ఏకమవ్వాలి. సామాజిక తెలంగాణ  కోసం మరో ఉద్యమం చేయాలి.. కోదండరాం నేతృత్వంలోని జేఏసీ స్తబ్దంగా మారింది. ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిలదీతలు లేవు.. ఉద్యమ కాలం నాటి హామీలను కేసీఆర్ ప్రభుత్వం మరి చింది. మన సమస్యల సాధనకు మరో వేదిక అవసరం.. దీని విధివిధాలనాలను త్వరలోనే ప్రకటించుకుందాం.. బైరాన్‌పల్లి అమరుల స్ఫూర్తిగా.. పోరుగడ్డ జనగామ నుంచే ఉద్య మం ప్రారంభిద్దాం’అని జేఏసీ రాష్ట్ర సమన్వయకర్త పిట్టల రవీందర్, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురజాల రవీందర్‌రావు అన్నారు.

వరంగల్ జిల్లా జనగామలో జేఏసీ డివిజన్ కన్వీనర్ కన్నా పరుశరాములు అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం ఉద్యమకారుల సన్నాహక సమావేశం నిర్వహించారు. అతిథులుగా పిట్టల రవీందర్, గురజాల రవీందర్‌రావులు హాజరయ్యారు. సమావేశంలో వారు మాట్లాడుతూ  టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాథమ్యాలను మరిచిందన్నారు.  తెలంగాణ ద్రోహులను కేసీఆర్ చేరదీస్తున్నాడని అన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కోల జనార్దన్, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement