సాక్షి, గుంటూరు: రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కుట్ర పన్నిన కాంగ్రెస్ అధిష్టానానికి తగిన గుణపాఠం తప్పదని జిల్లా ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఓవైపు వర్షాలు కురుస్తున్నా ప్రజల్లో ఎక్కడా ఉద్యమస్ఫూర్తి తగ్గ లేదు. పేద,ధనిక తేడా లేకుండా అంతా ఐక్యంగా నిరసన ప్రదర్శనలు చే స్తున్నారు. జిల్లాలో శనివారం సమైక్యాంధ్ర జేఏసీ, రాజకీయ జేఏసీ, విద్యార్థి, ప్రజాసంఘాల జేఏసీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ లు, మానవహారాలు, ధర్నాలు నిర్వహించారు. రాజకీయ జేఏసీ జిల్లా కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు, సమైక్యాంధ్ర జేఏసీ నేతలు ఆచార్య ఎన్. శామ్యూల్, ఆచార్య పి.నరసింహారావు, మండూరి వెంకటరమణల నేతృత్వంలో ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు ర్యాలీలు చేశారు. రాజకీయ జేఏసీ నేతృత్వంలో జరిగిన రిలేదీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంఘీభావం తెలిపారు. సత్తెనపల్లి, నరసరావుపేట, తెనాలి, చిలకలూరిపేటలలో ఆర్టీసీ ఉద్యోగులు మౌన ప్రదర్శన, రాస్తారోకోలు నిర్వహించగా, రేపల్లెలో ఆర్టీసీ కార్మికులు ఒంటికాలిపై నిలబడి సమైక్యాంధ్ర నినాదాలిచ్చారు. జిల్లా కోల్డ్‌స్టోరేజీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంద్, మున్సిపల్ ఉద్యోగుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ వైద్యులు, నర్సులు వినూత్నంగా నిరసన తెలిపారు. యూపీఏ అధినేత్రి సోనియా, దిగ్విజయ్, కేసీఆర్ వేషాల మాస్క్‌లు ధరించి కూరగాయలు కోసి ఇలానే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల సిబ్బంది, విద్యార్థులు రోడ్డుపైనే వంట చేసి భోజనాలు చేశారు.
ఉద్యోగుల నిరసనలు ..
ఏపీ ఎన్జీవోస్ జేఏసీ చేస్తున్న సమ్మెకు వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, గజిటెడ్ అధికారులు మద్దతు తెలుపుతున్నారు. చిలకలూరిపేటలో కమిషనర్, తహశీల్దార్, గజిటెడ్ అధికారులు విధులు బహిష్కరించి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.
గుంటూరులో వ్యవసాయశాఖ ఉద్యోగులు స్థానిక కలెక్టర్ కార్యాలయం నుంచి అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహం వరకు భారీ ప్రదర్శన, మానవహారం చేశారు. రోడ్డుపై వరినాట్లు వేసి తమ నిరసన తెలిపారు. పురుగుమందుల కంపెనీల అసోసియేషన్‌తో పాటు ఆదర్శ రైతులు ట్రాక్టర్‌లతో ర్యాలీ చేపట్టారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ నాన్‌టీచింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన నినాదాలిచ్చారు. తెనాలిలో న్యాయశాఖ ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. బాపట్లలో వీఆర్‌వోల ర్యాలీ, చిలకలూరిపేటలోని కావూరు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విధులు బహిష్కరించి విద్యార్థులతో సహా ర్యాలీ చేశారు. అన్నిచోట్లా ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. నరసరావుపేట, చిలకలూరిపేట, గుంటూరులో ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికులు ఆర్ధనగ్న ప్రదర్శన చేశారు. మాచర్లలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీప్రదర్శన చేశారు. ఆర్టీసీ కార్మిక జేఏసీతో ఆయన క్రికెట్ ఆడి నిరసన తెలిపారు.
దీక్షలకు సంఘీభావం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు, నరసరావుపేట, తెనాలి, చిలకలూరిపేట, రేపల్లెలలో రిలేదీక్షలు కొనసాగుతు న్నాయి. గుంటూరు హిందూ కళాశాల సెంటర్‌లో పలు ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బంది, విద్యార్థులతో పాటు డిగ్రీ విద్యార్థులు దీక్షలకు కూర్చొన్నారు. దాచేపల్లిలో దళితనాయకుడు మస్తాన్ ఆమరణ నిరాహారదీక్ష కొనసాగుతోంది. మంగళగిరి, తాడేపల్లిలో ్రపభుత్వ ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు రిలేదీక్షలు చేపట్టారు. మంగళగిరిలో బైక్ మెకానిక్‌ల ర్యాలీ జరిగింది. జిల్లా వ్యాప్తంగా ప్రజలు సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు విద్యుత్ వాడకాన్ని బంద్ చేసి నిరసన తెలిపారు. గుంటూరులో బార్ అసోసియేషన్ ఇప్పటికే సమ్మె చేస్తుండగా, ఈనెల 31న సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ సభ గుంటూరులో నిర్వహించాలని నిర్ణయమైంది.
జిల్లా వ్యాప్తంగా కదంతొక్కుతున్న సమైక్యవాదులు
Published Sun, Aug 18 2013 4:09 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement