తెలంగాణపైసీఎం కుట్ర | cm kiran kumar reddy conspiracy on telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణపైసీఎం కుట్ర

Published Sat, Sep 7 2013 1:35 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM

cm kiran kumar reddy  conspiracy on telangana

 సాక్షి ప్రతినిధి,  నిజామాబాద్ :
 హైదరాబాద్‌లో సభ నిర్వహించుకునేందుకు ఏపీఎన్జీవోలకు అనుమతి ఇచ్చి, తెలంగాణ రాజకీయ జేఏసీ తలపెట్టిన శాంతి ర్యాలీకి అనుమతి నిరాకరించడం ద్వారా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన సీమాంధ్ర కుట్రను బయట పెట్టుకున్నారని ఆరోపిస్తూ జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. జేఏసీ పిలుపు మేరకు ఇందూరులో బంద్ ను విజయవంతం చేయటానికి తెలంగాణవాదులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇప్పటికే విద్యాసంస్థలు బంద్ ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులు జిల్లాలోని ఆరు డిపోల్లోని బస్సులను బయటకు తీయవద్దని, విధులను 24 గంటలు బహ్కిరించాలని తీర్మానించారు. టీఎంయూ, ఈయూ, ఎన్‌ఎంయూలు సంపూర్ణ బంద్‌పై ప్రత్యేక దృష్టి సారిం చాయి. దీంతో జిల్లాలోని ఆరు డిపోలకు చెంది న 635 బస్సులు రోడ్డు ఎక్కని పరిస్థితి నెల కొంది. ఉద్యోగ, విద్యార్థి, ప్రజా, కుల సంఘాలతో పాటు వివిధ యూనియన్‌లు, సంఘాలతో కూడిన జేఏసీలు కూడా బంద్ విజయవంతం కోసం కృషి చేస్తున్నాయి. సీమాంధ్రకు చెంపపెట్టుగా తెలంగాణ రాజకీయ జేఏసీ ఇచ్చిన బంద్‌ను జయప్రదం చేయాలని తెలంగాణవాదులు పట్టుదలతో ఉన్నారు.
 
  తెలంగాణ వాదుల నిరసన వెల్లువలను గమనిస్తున్న జిల్లా పోలీసు శాఖ కూడా భారీ బందోబస్తును ఏర్పా టు చేసింది.  అవాంఛనీయ ఘటనలు జరుగకుండా తగిన చర్యలకు పోలీసుశాఖ శ్రీకారం చుట్టింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాల సముదాయాలు, మార్కెట్‌లు, సినిమాథియేటర్లు, పెట్రోల్‌బంకులు, ఆటోలు ఇతర వాహనాలు స్వచ్ఛందంగా బంద్ చేయాలని తీర్మానించారు. అత్యవసర సర్వీసులను మినహాయించి జిల్లా బంద్ విజయవంతం చేయడమే లక్ష్యంగా జిల్లా రాజకీయ జేఏసీతో పాటు  టీఆర్‌ఎస్, న్యూడెమోక్రసీ కృషి చేస్తున్నాయి. ఏపీఎన్జీవో సభ నిర్వహణను వ్యతిరేకించనప్పటికీ సీఎం కుట్రపూరిత వైఖరికి నిరసనగా రాజకీయ జేఏసీ పిలుపుమేరకు  జిల్లా బంద్‌ను విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ నిర్ణయించింది. సీపీఐ కూడా బంద్‌లో భాగస్వామి అవుతోంది.  
 
 బంద్ విజయవంతం కోసం...
 జిల్లాలో బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ విద్యార్థి, ప్రజాసంఘాలు, టీఆర్‌ఎస్ ల ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నిజామాబాద్‌లోని నటరాజ్, దేవి, లలితామహల్, ఉషాప్రసాద్ థియేటర్లలో ప్రదర్శిస్తున్న తుఫాన్ సినిమాను విద్యార్థి జేఏసీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కొన్ని థియేటర్ల వద్ద టీఆర్‌ఎస్ కార్యకర్తలు కూడా ఈ ధర్నాలో పాల్గొని సినిమా పోస్టర్లను చింపివేశారు. తెలంగాణలో కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ నటించిన తుఫాన్ సినిమాను నడువకుండా అడ్డుకుంటామన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కల్పించిన బందోబస్తుతో అడ్డంకుల నడుమ నాలుగు థియేటర్లలో తుఫాన్ సినిమాను ప్రదర్శితమైంది. బాన్సువాడ, ఆర్మూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాల్లోని థియేటర్లలో ప్రదర్శిస్తు న్న తుఫాన్ సినిమాను అడ్డుకోవడానికి విద్యార్థి సంఘాల జేఏసీ కార్యకర్తలు తీవ్రంగా ప్రయత్నించారు.
 
  సినిమా పోస్టర్లను తగులబెట్టారు. హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన శాంతి ర్యాలీకి అనుమతిని ఇవ్వాలని కోరుతూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు నిజామాబాద్‌లో ప్రదర్శన చేపట్టి, మానవహారాన్ని నిర్మిం చారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును సత్వరమే చేపట్టాలని నందిపేటలో తెలంగాణ దీక్ష లు కొనసాగాయి.  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర పక్షపాతిగా వ్యవరిస్తున్న తీరును నిరసిస్తూ డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీకి చెందిన ఎంఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశాయి. సీఎం కుట్రపూరిత వైఖరికి నిరసనగా నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్ కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. హైదరాబాద్‌లో సభ నిర్వహించుకోవడానికి ఏపీఎన్జీవోలకు అనుమతి ఇచ్చిన తెలంగాణ జేఏసీ శాంతి ర్యా లీకి అనుమతి ఇవ్వకపోవడాన్ని వారు తప్పు పట్టారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేశ్‌రెడ్డిల వైఖరిని తప్పుపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement