పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై ‘లెఫ్ట్’ కన్ను
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో తమ సానుభూతిపరులను బరిలోకి దింపాలని సీపీఐ, సీపీఎం ప్రయత్నిస్తున్నాయి. ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదగాలనే ఆలోచనతో ఉన్న వామపక్ష పార్టీలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఇందుకు ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయి. మేధావులైన వారిని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంతోపాటు ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల నియోజకవర్గానికి జరిగే ఎన్నికల బరిలో దింపేందుకు తొలుత ప్రయత్నించాయి. రాజకీయ జేఏసీకి చెందిన ముఖ్యనేతలను పోటీకి దించేందుకు ప్రయత్నించినా అవి ఫలించలేదు.
దీంతో తమ సానుభూతిపరులను పోటీ చేయిం చాలని లెఫ్ట్ పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన జనార్దనరెడ్డి పేరును సీపీఎం ప్రతిపాదించినట్లు తెలిసింది. మరోవైపు సినీనేపథ్య గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌ను అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేలా ఒప్పించాలని సీపీఐ ప్రయత్నిస్తోంది. ఇక ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల నియోజక వర్గం నుంచి భోగా శ్రీనివాసరావు (క్రాంతి శ్రీనివాస్)ను పోటీ చేయించాలని సీపీఎం యత్నిస్తుండగా.. పార్టీ నేత బొమ్మగాని ప్రభాకర్‌ను బరిలోకి దింపాలని సీపీఐ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పది వామపక్షాల సమావేశంలో ఈ అంశం చర్చకు రాగా, ఈ ప్రతిపాదనలపై మిగతాపార్టీల నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు. ఒకవైపు ఇరు పార్టీలు మెరుగైన సమన్వయం కోసం ప్రయత్నిస్తూ మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటాపోటీగా అభ్యర్థులను ప్రతిపాదించడంపై విస్మయం వ్యక్తమైనట్లు తెలిసింది.