
లోకేశ్ కోటరీ తీరుతో టీడీపీ సీనియర్లలో నైరాశ్యం
ఎంత హంగామా చేసినా పదవులివ్వని చంద్రబాబు
దేవినేని ఉమ, ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ, బుద్ధా వెంకన్న వంటి వారికి మొండిచేయి
ప్రభాకర్ చౌదరి, కేఎస్ జవహర్, హనుమంతరాయ చౌదరిలకూ నిరాశే
పార్టీ ఆస్థాన విద్వాంసులైన వర్ల రామయ్య, టీడీ జనార్దన్‌లకూ అవకాశం నిల్
అవసరానికి ఉపయోగించుకుని పట్టించుకోవడం లేదని ఆవేదన
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతూ గతంలో చక్రం తిప్పిన ముఖ్య నేతలను ప్రస్తుతం పూచిక పుల్లల్లా తీసి పారేయడం చర్చనీయాంశమైంది. గత టీడీపీ ప్రభుత్వాల్లో, పార్టీలో చురుగ్గా వ్యవహరించిన వారిని ఒక వ్యూహం ప్రకారం పక్కన పెట్టేశారు. సీఎం చంద్రబాబు తనయుడు, ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేశ్ కోటరీకి చెందిన వ్యక్తుల మాటే పార్టీలో, ప్రభుత్వంలో వేదంగా మారడంతో సీనియర్లు, ముఖ్య నాయకులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
జనసేనతో పొత్తులో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ ఎమ్మెల్యే స్థానాన్ని బలవంతంగా వదులుకునేలా చేసి, ఇప్పుడు అవమానాలపాలు చేయడంతో పార్టీలో ఆందోళన నెలకొంది. జనసేన ప్లీనరీలో ఆయన్ను అవమానించేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు వ్యాఖ్యలు చేయడం టీడీపీ క్యాడర్‌ను ఆగ్రహానికి గురిచేస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే సముచిత ప్రాధాన్యం ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు.. వర్మకు హామీ ఇచ్చినా, ప్రస్తుతం పట్టించుకోవడం మానేశారు. పవన్ చెప్పడంతో వర్మను పక్కన పెట్టేశారనే ప్రచారం జరుగుతోంది.
అపాయింట్‌మెంట్ ప్లీజ్..
కృష్ణా జిల్లా టీడీపీని గతంలో తన గుప్పిట్లో పెట్టుకుని చక్రం తిప్పిన దేవినేని ఉమామహేశ్వరరావు పరిస్థితి ప్రస్తుతం గల్లీ లీడర్ కంటే కిందకు పడిపోయింది. గత ఎన్నికల్లో ఆయనకు మైలవరం ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా పక్కన పెట్టారు. అధికారంలోకి వచ్చాక మంచి పదవి ఇస్తామని ఆశ చూపినా, ప్రస్తుతం ఆయనకు చంద్రబాబు అపాయింట్‌మెంట్ దొరకడమే గగనంగా మారింది. కనీసం టీడీపీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించేందుకు కూడా ఆయనకు అనుమతి లేదంటే ఆయన్ను ఏ స్థాయికి దిగజార్చారో ఊహించుకోవచ్చు.
ఇటీవల మూడు ఎమ్మెల్సీ పదవుల్లో ఆయనకు ఒకటి ఖాయమని ప్రచారం జరిగినా, చివరికి ఆయనకు నిరాశే మిగిలింది. పరిస్థితి చూస్తే ఇప్పట్లో ఆయనకు పదవి వచ్చే అవకాశం కనిపించడం లేదు. పార్టీలోని ఆయన ప్రత్యర్థులు తెరవెనుక గట్టిగా దెబ్బ కొట్టడంతో ఉమాకు పదవి దక్కలేదని తెలుస్తోంది. విజయవాడ నగరానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వంటి వారు చంద్రబాబు, లోకేశ్‌ను మెప్పించేందుకు ఎన్ని ఫీట్లు చేస్తున్నా, వైఎస్ జగన్‌ను కొత్త రకంగా విమర్శిస్తున్నా, రక్తంతో బ్యానర్లు రాసినా అలాంటి వారిని పట్టించుకునే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు.
అప్పుడు బుజ్జగించి.. ఇప్పుడు పక్కనపెట్టి..
గత ఎన్నికల్లో సీట్లు ఇవ్వని అనంతపురానికి చెందిన ప్రభాకర్ చౌదరి, గుంతకల్లుకు చెందిన జితేందర్‌గౌడ్, కళ్యాణదుర్గానికి చెందిన హనుమంతరాయ చౌదరి, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు, రాయచోటికి చెందిన రమేష్ రెడ్డి, నిడదవోలుకు చెందిన బూరుగుపల్లి శేషారావు, ఉంగుటూరుకు చెందిన గన్ని వీరాంజనేయులు, తిరువూరుకు చెందిన కేఎస్ జవహర్ వంటి నేతలు తమకు ఏదో ఒక పదవి దక్కుతుందని ఆశతో ఉన్నా, అది నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు.
ఎన్నికల సమయంలో డబ్బు కట్టలతో వచ్చిన కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, పైరవీకారులకు సీట్లు ఇవ్వడంతో ఇలాంటి వారికి మొండి చేయి చూపించారు. అప్పట్లోనే ప్రభాకర్ చౌదరి, రమేష్ రెడ్డి, కొండపల్లి అప్పలనాయుడు వంటి నేతలు రాజీనామాలకు సిద్ధమవ్వగా, వారిని బుజ్జగించి అధికారంలోకి వచ్చాక మంచి పదవులిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు తమను పట్టించుకోలేదని, తమకు పదవులు వస్తాయనే ఆశ కూడా పోయిందని వారంతా వాపోతున్నారు.
ఆస్థాన విద్వాంసులకూ నిరాశే
టీడీపీ కార్యాలయంలో ఎంతో కాలంగా ఆస్థాన విద్వాంసులుగా చెలామణి అవుతున్న వర్ల రామయ్య, టీడీ జనార్దన్, అశోక్‌బాబు వంటి వారికి ప్రస్తుతం కష్టకాలం నడుస్తోందని చెబుతున్నారు. గతంలో టీడీ జనార్దన్ పార్టీ వ్యవహారాలన్నింటినీ చంద్రబాబు తరఫున చక్కబెట్టేవారు. ప్రస్తుతం ఆయన పార్టీ కార్యాలయానికి అప్పుడప్పుడు వచ్చి వెళ్లే సాధారణ నేతగానే మిగిలిపోయారు. అధికారంలో లేనప్పుడు సీనియర్ నేత వర్ల రామయ్యను అన్ని పనులకు వినియోగించుకున్నా, ప్రస్తుతం ఏ పని లేకుండా ఖాళీగా కూర్చోబెట్టారు. ఆయనకు ఏ పదవి ఇచ్చే ఉద్దేశం కూడా లేదని చెబుతున్నారు. పార్టీలో ప్రస్తుతం లోకేశ్ హవా నడుస్తుండడంతో ఇలాంటి నేతలందరికీ చెక్ పెట్టినట్లు స్పష్టమవుతోంది.
యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతి రాజు వంటి సూపర్ సీనియర్లనే పక్కన పెట్టగా.. బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాసరావు, పత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు వంటి సీనియర్ల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. వీరు ఎమ్మెల్యేలుగా ఉన్నా మంత్రి పదవులు దక్కలేదు. లోకేశ్ కోటరీలోని సానా సతీష్, కిలారు రాజేష్ వంటి వారు తెర వెనుక అన్ని వ్యవహారాలను చక్కబెడుతున్నారు. దీంతో సీనియర్లు, ముఖ్య నాయకుల పరిస్థితి దయనీయంగా మారిపోయింది.