MLC positions
-
గవర్నర్ కోటాలో ఎస్సీ, ముస్లిం వర్గాలకు ఎమ్మెల్సీ పదవులు!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గవర్నర్ కోటాలో భర్తీ చేసే సభ్యుల్లో ఖాళీగా ఉన్న రెండు స్థానాల్లో ఒకటి ఎస్సీ, మరొకటి ముస్లిం వర్గాలకు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం త్వరలోనే ఈ మేరకు సిఫార్సు చేయనుందని వైఎస్సార్సీపీ వర్గాలు తెలిపాయి. ► ప్రస్తుతం మండలిలో మొత్తం నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణారావు రాజీనామా చేసిన కారణంగా శాసనసభ నుంచి ఎన్నికయ్యే రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ► గవర్నర్ నామినేట్ చేసే కోటాలో కంతేటి సత్యనారాయణరాజు, రత్నాబాయి పదవీ కాలం ముగిసిన కారణంగా ఖాళీ అయిన రెండు స్థానాలు కొంత కాలంగా అలాగే ఉన్నాయి. ► వైఎస్ జగన్ ప్రభుత్వం మండలిని రద్దు చేయాలని నిర్ణయించినప్పటికీ పైస్థాయిలో జాప్యం కారణంగా అది ఇప్పటికీ మనుగడలో ఉంది. మండలి రద్దు విషయంలో ఎలాంటి రెండో ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఇప్పటికే శాసనసభలో మండలి రద్దుకు తీర్మానం చేసి పంపారు కూడా. అయితే మండలి మనుగడలో ఉన్నంత వరకైనా ఖాళీ స్థానాలను భర్తీ చేయాలన్న ఆలోచనతో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది. ► అందువల్ల గవర్నర్ నామినేటెడ్ స్థానాల్లో ఒకటి ఎస్సీ వర్గానికి, మరో స్థానం ముస్లిం మైనారిటీ వర్గాలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి తాజాగా యోచిస్తున్నట్టు సమాచారం. ► బోస్, మోపిదేవి రాజీనామా వల్ల ఖాళీ అయిన వాటిలో ఒక స్థానం పదవీ కాలం కేవలం 9 నెలలే ఉంది. మరో ఎమ్మెల్సీ పదవీ కాలం రెండేళ్ల పాటు ఉంటుంది. 9 నెలలే గడువున్న ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక జరిగే అవకాశం లేదు కనుక రెండేళ్ల పదవీ కాలం ఉన్న స్థానానికి కూడా అభ్యర్థిని త్వరలో సీఎం ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఎమ్మెల్సీలు.. ఏకగ్రీవం
సాక్షి, అమరావతి: శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా నుంచి జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి చెందిన ముగ్గురు నేతలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ, చల్లా రామకృష్ణారెడ్డి, మహ్మద్ ఇక్బాల్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి (లెజిస్లేచర్ కార్యదర్శి–ఇంచార్జి) పి.బాలకృష్ణమాచార్యులు సోమవారం సాయంత్రం ప్రకటించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కోలగట్ల వీరభద్రస్వామి, ఆళ్ల నాని, టీడీపీకి చెందిన కరణం బలరాం తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన ఫలితంగా ఏర్పడిన ఖాళీలకు ఇటీవల విడివిడిగా ఎన్నికల నోటిఫికేషన్లు వెలువడ్డాయి. శాసనసభలో వైఎస్సార్సీపీకి సంఖ్యాపరంగా పూర్తి ఆధిక్యత ఉండటం, మరో అభ్యర్థి ఎవరూ నామినేషన్‌ను దాఖలు చేయకపోవడంతో ఏకగ్రీవంగా ముగ్గురూ ఎన్నికయ్యారు. కోలగట్ల రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పదవీ కాలం మార్చి 29, 2021 వరకూ (ఒకటిన్నర ఏడాది), నాని, బలరాం రాజీనామా చేసిన ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి 29, 2023 వరకూ (మూడున్నర ఏళ్లు) ఉంది. ఒకటిన్నర ఏడాది పదవీ కాలానికి మహ్మద్ ఇక్బాల్, మూడున్నర ఏళ్ల పదవీ కాలానికి మోపిదేవి, చల్లా ఎన్నికయ్యారు. ప్రస్తుతం మండలిలో వైఎస్సార్సీపీ బలం 9 మందికి పెరిగింది. ధృవీకరణ పత్రాలు తీసుకున్న ఇక్బాల్, చల్లా మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి తమ ఎన్నిక ధృవీకరణ పత్రాలను రిటర్నింగ్ అధికారి బాలకృష్ణమాచార్యులు నుంచి తీసుకున్నారు. తమకు ఈ అవకాశం కల్పించినందుకు వారు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణా నదీ వరదల్లో బాధితుల కోసం చేపట్టిన సహాయక చర్యల్లో మంత్రి మోపిదేవి నిమగ్నమై ఉండటంతో ఆయన ధృవీకరణ పత్రం తీసుకోలేదు. వచ్చే ఏడాది మరో రెండు ఖాళీలు గవర్నర్ నామినేట్ చేసే కోటాలో వచ్చే ఏడాది (2020) మార్చి 2 నాటికి శాసనమండలిలో మరో రెండు ఖాళీలు ఏర్పడతాయి. ఈ రెండు స్థానాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు రాష్ట్ర గవర్నర్ నియామకం చేస్తారు. స్థానిక సంస్థల కోటాలో అనంత, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఎమ్మెల్సీల స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రస్తుతం స్థానిక సంస్థల పాలక వర్గాలు లేవు కనుక ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదు. -
మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నిక నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యే కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎమ్మెల్సీలుగా ఉన్న ముగ్గురు సభ్యులు (కరణం బలరామకృష్ణమూర్తి, ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), కోలగట్ల వీరభద్రస్వామి) ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలవడంతో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఈ ఉప ఎన్నిక అవసరమైంది. ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను అనుసరించి వివరాలిలా ఉన్నాయి.. - బుధవారం నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ఈ నెల 14తో ముగుస్తుంది. - 16న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. - ఈ నెల 19వ తేదీలోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. - ఈ స్థానాలకు అవసరమైతే ఈ నెల 26వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. సాయంత్రం 5.00 నుంచి ఓట్ల లెక్కింపు. - ఈ ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసరుగా పి.బాలకృష్ణమాచార్యులు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసరుగా పి.వి.సుబ్బారెడ్డి వ్యవహరిస్తారు. -
‘ఎమ్మెల్యే’ ఎమ్మెల్సీపై ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి వరుస ఎన్నికలతో టీఆర్ఎస్లో పదవుల పందేరం కొనసాగుతోంది. ఎన్నికలు జరుగుతున్న శాసనసభ కోటా ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది అధికార పార్టీలో ఉత్కంఠ నెలకొంది. నల్లగొండ లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, మల్కాజ్గిరి టీఆర్ఎస్ నేత కె.నవీన్‌రావుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులను ప్రకటించిన రోజునే వీరిద్దరికి ఎమ్మెల్సీ ఇవ్వనున్నట్లు ప్రకటన జారీ చేశారు. టీఆర్ఎస్ అధిష్టానం వారం క్రితం మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా మరో స్థానానికి అభ్యర్థిని ప్రకటించనుంది. టీఆర్ఎస్ అధిష్టానం ఈ స్థానానికి నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కె.నవీన్‌రావు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్రావు, మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, మాజీ స్పీకర్ కె.ఆర్.సురేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల దాఖలు గడువు ఈ నెల 28తో ముగియనుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, అప్పటి సమీకరణల ఆధారంగా కేసీఆర్ శాసనసభ కోటా ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని అధికార పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. మే 31న పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేగా ఎన్నికైన మైనంపల్లి హనుమంతరావు రాజీనామాతో ఖాళీ అయిన శాసనసభ కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక కోసం ఈ నెల 21 నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలుకానుంది. శాసనసభలో టీఆర్ఎస్కు పూర్తి ఆధిక్యత ఉన్న నేపథ్యంలో అధికార పార్టీ ఏకగ్రీవంగానే ఈ స్థానాన్ని గెలచుకోనుంది. సునాయాసంగా ఎన్నికయ్యే అవకాశం ఉన్న ఆ స్థానంలో అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు టీఆర్ఎస్ నేతల్లో ఆసక్తికరంగా మారింది. మరో మూడు ఎమ్మెల్సీలు.. రాష్ట్రంలో మరో 4 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కావాల్సి ఉంది. రాములునాయక్, కె.యాదవరెడ్డి, ఆర్.భూపాల్‌రెడ్డిపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. వీరిలో రాములునాయక్ గవర్నర్ కోటా, కె.యాదవరెడ్డి ఎమ్మెల్యే కోటా, భూపాల్‌రెడ్డి నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా లో ఎన్నికయ్యారు. యాదవరెడ్డి, భూపాల్‌రెడ్డి పదవుల విషయం హైకోర్టు పరిధిలో ఉంది. న్యాయ ప్రక్రియ పూర్తయ్యాక ఈ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అన్ని స్థానాలు టీఆర్ఎస్కే దక్కే అవకాశం ఉంది. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి ఆ ఉమ్మడి జిల్లా నుం చి ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది. గవర్నర్ కోటాలో ఎవరికి అవకాశం కల్పిస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది. మిగిలింది ఒకటే.. టీఆర్ఎస్ అధిష్టానం వారం క్రితం మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా మైనంపల్లి హనుమంతరావు రాజీనామాతో ఖాళీ అయిన శాసనసభ కోటా ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించనుంది. పరిశీలనలో పేర్లు.. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కె.నవీన్‌రావు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్రావు, మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, మాజీ స్పీకర్ కె.ఆర్.సురేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కోర్టు ఉత్తర్వుల మేరకు.. యాదవరెడ్డి, భూపాల్‌రెడ్డి పదవుల విషయం హైకోర్టు పరిధిలో ఉంది. న్యాయ ప్రక్రియ పూర్తయ్యాక నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్ని కలు జరగనున్నాయి. అన్ని స్థానాలు టీఆర్ఎస్కే దక్కే అవకాశం ఉంది. -
ఫిబ్రవరిలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
3 గ్రాడ్యుయేట్స్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు గ్రాడ్యుయేట్ శాసన మండలి నియోజకవర్గాలకు, రెండు ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గాలకు ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి తొలివారంలో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి నెలాఖరుకు ఈ ఐదు నియోజకవర్గాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదు కావాలంటే నవంబర్ 1వ తేదీకి ముందు పట్టభద్రులైనవారు అర్హులు. ఉపాధ్యాయులైతే నవంబర్ 1కి ముందు.. గడిచిన ఆరేళ్లలోపు సెకండరీ స్కూలు కన్నా తక్కువకానీ తరగతులలో రాష్ట్రంలోని ఏవేని విద్యాసంస్థల్లో బోధనలో కనీసం మూడేళ్ల మొత్తం వ్యవధికి నియోగించబడినవారు అర్హులు. అర్హతగలవారు శనివారం నుంచి వచ్చేనెల 5వ తేదీ వరకు ఈ నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ముసాయిదా ఓటర్ల జాబితాను వచ్చే నెల 23న ప్రకటిస్తారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను డిసెంబర్ 8వ తేదీలోగా స్వీకరిస్తారు. ఓటర్ల తుది జాబితాను డిసెంబర్ 30న ప్రచురిస్తారు. -
ఎన్నికల కోడ్ ఎత్తివేత
సాక్షి, విశాఖపట్నం : స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవం కావడంతో ఈసీ ఆదేశాల మేరకు జిల్లాలో ఎన్నికల కోడ్ ఎత్తివేసినట్టు కలెక్టర్ యువరాజ్ ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 3న ఎన్నికలు, 7న కౌంటింగ్ జరగాల్సి ఉంది. కానీ రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో పప్పల చలపతిరావు, ఎంవీవీఎస్ మూర్తిలకు ఎన్నిక ధ్రువ పత్రాలను ఆర్వో జె.నివాస్ అందజేశారు. దీంతో ఎన్నికల తంతు ముగిసినట్టేనని ప్రకటించిన ఆర్వో కోడ్ ఎత్తివేత విషయమై ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వడంతో రాష్ర్ట ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన జిల్లాల్లో కోడ్‌ను ఎత్తివేసినట్టేనని ప్రకటించారు. ఈ మేరకు నేటి నుంచి పాలనాపరమైన విధుల్లో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో పాల్గొంటుందని కలెక్టర్ తెలిపారు. -
ఎమ్మెల్సీ సీటు కేటాయింపుపై ఉత్కంఠ
- వైవీబీ రాజేంద్రప్రసాద్‌కు ఒక సీటు ఖరారు? - బచ్చుల అర్జునుడు, బుద్దా మధ్య పోటీ సాక్షి, విజయవాడ : కృష్ణాజిల్లా స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ముఖ్యమంత్రి చంద్రబాబుకు తలకుమించిన భారంగా మారింది. రెండు సీట్లకు ముగ్గురు మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. అయితే, ఒక సీటును ఇప్పటికే ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసి, స్థానిక సంస్థల్లో మంచిపట్టున్న వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌కు కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇక రెండో సీటును ఎవరికి ఇవ్వాలనే అంశంపై ఉన్నతస్థాయిలో తర్జనభర్జన జరుగుతోంది. ఈ అంశం శుక్రవారం రాత్రి వరకు ఒక కొలిక్కి రాలేదు. శనివారం తప్పనిసరిగా ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎంపిక చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో జిల్లా నేతల్లో ఈ సీటు కేటాయింపుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నగరానికి ప్రాధాన్యత ఇవ్వరా? బుద్దా వెంకన్న కోసం నగరంలోని టీడీపీ నాయకులంతా ఏకమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)తో పాటు ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు బుద్దా వెంకన్నకు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీకి సరైన ప్రాతినిధ్యం లేదని, అందువల్ల ఆ సీటును బుద్దా వెంకన్నకు ఇస్తే అక్కడ పార్టీ బలపడుతుందని పేర్కొంటున్నారు. ఇప్పటికే శాసనమండలిలో ముగ్గురు యాదవ సామాజికవర్గ సభ్యులు ఉన్నందున బచ్చులకు బదులు తమ వర్గానికి చెందిన బుద్దాకు అవకాశం కల్పించాలని గౌర కులస్తులు కోరుతున్నట్లు తెలిసింది. బందరు పార్లమెంట్ పరిధిలోనూ, తూర్పు కృష్ణా నుంచి యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్‌కు ఇచ్చినందున, పశ్చిమ కృష్ణా, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బుద్దా వెంకన్నకు అవకాశం కల్పించాలని ఈ ప్రాంత నేతలు కోరుతున్నారు. అలాగే, జిల్లా నుంచి వైవీబీకి ఇచ్చినందున, నగరం నుంచి బుద్దా వెంకన్నకే ఇవ్వాలని పార్టీలో పలువురు సీనియర్ నేతలు సూచిస్తున్నారు. శుక్రవారం రాత్రి వరకు చంద్రబాబు ఈ సీటు విషయంలో ఎటూ తేల్చలేదు. జిల్లా, అర్బన్ అధ్యక్షుల మధ్య పోటీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న మధ్య ఎమ్మెల్సీ సీటుపై తీవ్ర పోటీ ఉన్నట్లు తెలిసింది. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, యనమల రామకృష్ణుడు.. బచ్చుల అర్జునుడుకు తప్పనిసరిగా సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఆయనకు గతంలోనే చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. గతంలో గవర్నరుకోటలో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ప్రకటించినప్పుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌తో పాటు బచ్చుల అర్జునుడు పేరును దరిదాపుగా ఖరారు చేశారని, అందువల్ల ఆయనకే సీటు వచ్చే అవకాశం ఉందని ఆయన అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
ఎమ్మెల్సీకి ఉమ్మారెడ్డి నామినేషన్
వైఎస్సార్ సీపీ నాయకులతో కలసి డీఆర్ఓకు పత్రాలు అందజేత తన విజయం తథ్యమని స్పష్టీకరణ పట్నంబజారు స్థానిక సంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు గురువారం వైఎస్సార్సీపీ అభ్యర్థి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, రాష్ట్ర కార్యదర్శులు లేళ్ల అప్పిరెడ్డి, రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము), ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కావటి మనోహర్‌నాయుడు, వినుకొండ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడు, కిలారి రోశయ్య తదితరులు వెంటరాగా ఉదయం 11.15 గంటలకు ఉమ్మారెడ్డి తన నామినేషన్ పత్రాలను డీఆర్వో నాగబాబుకు అందజేశారు. అనంతరం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తాను ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లను కలుపుకుని ముందుకు సాగటం జరుగుతోందని తెలిపారు. తన విజయం తథ్యమని ధీమా వ్యక్తం చే శారు. జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో రెండు స్థానాలకు మాత్రమే అవకాశం ఉంటే తెలుగుదేశం పార్టీ నేతలు ఇద్దరిని ఎలా నిలబెడతారని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీకి స్పష్టమైన ఓట్లు ఉన్నాయని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయఢంకా మోగించటం ఖాయమన్నారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలు ఉమ్మారెడ్డికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పలు విభాగాల నేతలు మెట్టు వెంకటప్పారెడ్డి, జలగం రామకృష్ణ, ఆతుకూరి ఆంజనేయులు, కొత్తా చిన్నపరెడ్డి, మొగిలి మధు, దేవళ్ల రేవతి, బండారు సాయిబాబు, ఆరుబండ్ల వెంకటకొండారెడ్డి, కొలకలూరి కోటేశ్వరరావు, మండేపూడి పురుషోత్తం, చింకా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
‘ఎమ్మెల్సీ’ సీట్లపై ‘దేశం’ కసరత్తు
వైవీబీ, బచ్చుల, వెంకన్న మధ్యే పోటీ నేడు ప్రకటించే అవకాశం విజయవాడ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఖరారులో టీడీపీ అధిష్టానం తలమునకలై ఉంది. జిల్లా నుంచి ఖాళీ అయిన రెండు స్థానాలూ తెలుగుదేశం పార్టీకే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో జిల్లాకు చెందిన నాయకులు హైదరాబాద్‌లో మకాం వేసి తమ శక్తి మేరకు ఎమ్మెల్సీ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక గురువారం రాత్రి వరకు కొలిక్కి రాకపోవడంతో శుక్రవారం ఉదయం ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముగ్గురి మధ్యే పోటీ! : జిల్లాలో ఉన్న రెండు స్థానాలకు ముగ్గురు నేతలు పోటీపడుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీగా పనిచేసిన వైవీబీ రాజేంద్రప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్నారు. వీరు హైదరాబాద్‌లో మకాం వేసి టిక్కెట్ దక్కించుకునేందుకు తమ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గతంలో ఎమ్మెల్సీ సీటు కోసం పోటీ పడ్డ మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధ ప్రస్తుతం కొద్దిగా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఆమెకు గవర్నరు కోటాలో సీటు వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన అనూరాధ పార్టీ తనను గుర్తించి సీటు ఇస్తే తీసుకుందామని, లేకుండా మౌనంగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎవరి ప్రయత్నాలు వారివి : చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన వైవీబీ రాజేంద్రప్రసాద్ మరోసారి సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఒక ఎంపీ, ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్, మేయర్ తదితర కీలక పోస్టులన్నీ ఆ సామాజిక వర్గానికే ఉన్నందున మరో సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని కొంతమంది నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లోనే చంద్రబాబు హామీ ఇవ్వడం, స్థానిక సంస్థల్లో తనకు పట్టు ఉండటాన్ని ఆసరాగా చేసుకుని వైవీబీ సీటు కోసం ముమ్మరంగా యత్నిస్తున్నట్లు సమాచారం. జిల్లా అధ్యక్షుడు బచ్చులకు మంత్రి దేవినేని ఉమా అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అయితే బందరు నుంచి ఇప్పటికే మంత్రి, ఎంపీ ఉన్నందున, శాసనమండలిలో ఇప్పటికే యాదవ సామాజిక వర్గం నుంచి ముగ్గురు ఉండటం నేపథ్యంలో మరొకరికి అవకాశం కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్నకు కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆశీస్సులు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటును బీజేపీకి ఇచ్చారని, ఆ నియోజకవర్గ నేతల్లో అసంతృప్తి తగ్గించాలంటే బుద్దా వెంకన్నకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని ఆయన వర్గం గట్టిగా వాదిస్తోంది. తొలుత నిర్ణయించినట్లు వైవీబీ, బచ్చుల పేర్లనే ఖరారు చేస్తారా.. లేక మార్చి ఇంకా ఎవరికైనా అవకాశం కల్పిస్తారా అనేది వేచి చూడాలి. -
టీడీపీలో ‘ఎమ్మెల్సీ' చిచ్చు
- దొరబాబు, అరుణమ్మకు మొండి చేయి - లాబీయింగ్ చేస్తేనే పదవులంటూ మినీ మహానాడులో గల్లా అసమ్మతి గళం - ఫలించని చిత్తూరు నేతల తంత్రం - అనూహ్యంగా గౌనివారికి చోటు సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎమ్మెల్సీ పదవుల వ్యవహారం టీటీపీ నేతల్లో చిచ్చు రగిలిస్తోంది. పదవులు ఆశించి భంగ పడిన నేతలు బాబు తీరుపై భగ్గుమంటున్నారు. నిజాయితీ గలవారికి పార్టీలో స్థానం లేదని, పైరవీలు చేసేవారికే అందలం అని గల్లా వ్యాఖ్యనించడం ఇందుకు నిదర్శనం. ఈ పరిణామాలు కిందిస్థాయి కార్యకర్తల్లో చర్చకు దారి తీశాయి. ఈ పరిస్థితుల్లో పార్టీని ఏకతాటిపై నడపటం కత్తి మీద సామేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవుల కేటాయింపులో టీడీపీ నాయకులు దొరబాబు, గల్లా అరుణకుమారికి చోటు దక్కలేదు.చివరివరకు వారు ప్రయత్నాలు చేసినా అదృష్టం కలిసి రాలేదు. ముఖ్యంగా చంద్రబాబు అడుగులకు మడుగులొత్తేవారికే ఎమ్మెల్సీ పదవులు దక్కాయని పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నాయి. కష్టకాలంలో పార్టీకి వెన్నంటి నడిచిన వారికి సైతం బాబు మొండి చేయి చూపారని టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. గతంలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసి, ఒక్క ఓటుతో ఓడిపోయిన దొరబాబుకు ఈసారి అవకాశం దక్కుతుందని అందరూ ఊహించారు. అయితే అనూహ్యంగా చంద్రబాబు ఎమ్మెల్సీ పదవిని గౌనివారి శ్రీనివాసులుకు కట్టబెట్టారు. దొరబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చిత్తూరు ఎంపీ శివప్రసాద్, జెడ్పీచైర్ పర్సన్ గీర్వాణి, ఎమ్మెల్యే సత్యప్రభ,మేయర్ అనురాధ తదితరులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. చూద్దాంలే అంటూనే సీఎం దాటవేయడంతో నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ పదవుల వ్యవహారంలో మంత్రి మాటను సైతం పరిగణనలోకి తీసుకోనట్లు సమాచారం. రగులుతున్న అసంతృప్తి పదవులు ఆశించి భంగపడిన గల్లా అరుణతో పాటు, మరికొందరు బాబు వ్యవహార శైలిపై లోలోన రగిలిపోతున్నారు. ఇటీవల చిత్తూరులో జరిగిన మిని మహానాడులో షో చేసి, హైదరాబాద్ స్థాయిలో లాబీయింగ్ చేస్తేనే పదవులంటూ గల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టపడి పని చేసేవారికి పదవులు దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు ఎటు దారి తీస్తాయోనని ద్వితీయ శ్రేణి నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ విషయాలన్నింటినీ ఎప్పటికప్పుడు తన వేగుల ద్వారా బాబు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు, గల్లా అరుణకుమారిని త్వరలో హైదరాబాద్‌కు పిలిపించి బుజ్జగించనున్నట్లు తెలిసింది. -
మళ్లీ ఎమ్మెల్సీ పదవుల ఆశ
అంబికా కృష్ణ, పాందువ్వ శీనులకు బెర్త్ దక్కేనా? ఏలూరు: జిల్లాలో టీడీపీ నాయకులను ఎమ్మెల్సీ పదవులు ఊరిస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా కేటాయించిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఈ నెల 14న నోటిఫికేషన్ జారీ కానుంది. జూన్ 1న ఎన్నికల నిర్వహించనున్నారు. కాగా తక్కువ కాల వ్యవధిలోనే మళ్లీ పదవులు భర్తీ కానుండడంతో గతంలో భంగపడ్డ వారు యత్నాలు ప్రారంభించారు. కొద్దినెలల క్రితం ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ కాగా జిల్లాకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మంతెన సత్యనారాయణరాజు (పాందువ్వ శ్రీను), ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణలు పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అంబికాకృష్ణకు పదవిని ఇవ్వాలని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అధిష్టానానికి అప్పట్లో సిఫార్సు చేశారు. మరోవైపు జిల్లాకు చెందిన ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పాందువ్వ శ్రీనుకు ఎమ్మెల్సీ ఇవ్వాలని అధినేతను కలిసి కోరారు. అయితే ఇద్దరికీ చుక్కెదురైంది. అన్ని సీట్లను గెలిపించి టీడీపీ అధికారంలో వచ్చేందుకు శ్రమించిన తెలుగు తమ్ముళ్లకు కీలకమైన ఈ పదవుల విషయంలో అధినేత అన్యాయం చేశారన్న విమర్శలు అప్పట్లో వినిపించాయి. ఈసారైనా పదవిని దక్కించుకోవాలని నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. -
మండలి ప్రచారానికి గులాబీ దండు
9వ తేదీ నుంచి నియోజకవర్గాల వారీగా పర్యటనలు మంత్రి కేటీఆర్ కనుసన్నల్లో ప్రచారపర్వం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: శాసనమండలి ఎన్నికలను గులాబీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకునేందుకు పార్టీ అగ్రనేతలను మోహరిస్తోంది. మహబూబ్‌నగర్- హైదరాబాద్- రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గానికి ఈ నెల 22న జరిగే ఎన్నికల్లో విజయం సాధించడానికి వ్యూహాత్మకంగా కదులుతోంది. టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగిన ఉద్యోగసంఘాల నేత దేవీప్రసాద్‌ను గెలిపించే బాధ్యతను నెత్తినెత్తుకున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈనెల 9వ తేదీ నుంచి నియోజకవర్గాల వారీగా జరిగే ప్రచారపర్వంలో పాల్గొననున్నారు. కేటీఆర్ సహా జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొనే ఈ ప్రచార షెడ్యూల్‌ను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్ శుక్రవారం ప్రకటించారు. 9న వికారాబాద్, తాండూరు, 10న చేవెళ్ల, పరిగి, 12న రాజేంద్రనగర్, మహేశ్వరం, 14న ఎల్బీ నగర్, 15న మల్కాజిగిరి, ఉప్పల్, 18న కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, 19న ఇబ్రహీంపట్నం, మేడ్చల్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే సభల్లో పాల్గొంటారని తెలిపారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై ‘లెఫ్ట్’ కన్ను
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో తమ సానుభూతిపరులను బరిలోకి దింపాలని సీపీఐ, సీపీఎం ప్రయత్నిస్తున్నాయి. ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదగాలనే ఆలోచనతో ఉన్న వామపక్ష పార్టీలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఇందుకు ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయి. మేధావులైన వారిని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంతోపాటు ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల నియోజకవర్గానికి జరిగే ఎన్నికల బరిలో దింపేందుకు తొలుత ప్రయత్నించాయి. రాజకీయ జేఏసీకి చెందిన ముఖ్యనేతలను పోటీకి దించేందుకు ప్రయత్నించినా అవి ఫలించలేదు. దీంతో తమ సానుభూతిపరులను పోటీ చేయిం చాలని లెఫ్ట్ పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన జనార్దనరెడ్డి పేరును సీపీఎం ప్రతిపాదించినట్లు తెలిసింది. మరోవైపు సినీనేపథ్య గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌ను అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేలా ఒప్పించాలని సీపీఐ ప్రయత్నిస్తోంది. ఇక ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల నియోజక వర్గం నుంచి భోగా శ్రీనివాసరావు (క్రాంతి శ్రీనివాస్)ను పోటీ చేయించాలని సీపీఎం యత్నిస్తుండగా.. పార్టీ నేత బొమ్మగాని ప్రభాకర్‌ను బరిలోకి దింపాలని సీపీఐ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పది వామపక్షాల సమావేశంలో ఈ అంశం చర్చకు రాగా, ఈ ప్రతిపాదనలపై మిగతాపార్టీల నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు. ఒకవైపు ఇరు పార్టీలు మెరుగైన సమన్వయం కోసం ప్రయత్నిస్తూ మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటాపోటీగా అభ్యర్థులను ప్రతిపాదించడంపై విస్మయం వ్యక్తమైనట్లు తెలిసింది. -
క్రాస్‌పైనే భవితవ్యం!
⇒మండలిపై కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ ⇒రెండు స్థానాలకు ఒకేసారి ఎన్నికలు ⇒సంకేతాలిచ్చిన ఈసీ వర్గాలు ⇒కీలకంగా మారిన టీడీపీ-బీజేపీ మద్దతు ⇒సీట్ల సర్దుబాటుకు కాంగ్రెస్ ఎత్తులు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లాలో స్థానిక సంస్థల కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం పార్టీల మధ్య రాజకీయం రంజుగా మారింది. ఎన్నికలకు రెండు, మూడు నెలలు సమయం ఉండగానే, ఆయా పార్టీల నేతలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. తమ పార్టీ బలం గెలుపునకు అవసరమైన మద్దతుపైనే ఆలోచనలు చేస్తున్నారు. ఈ దిశగా ఇప్పటినుంచే అంతర్గతంగా కసరత్తు ప్రారంభించారు. ఇతర పార్టీల నేతలతో తెరవెనుక మంతనాలు సాగిస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ- బీజేపీ కూటమి ఈ స్థానాలపై వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఆయా పార్టీల బలా బలాలను అనుసరించి ఇతర పార్టీల సభ్యులకు ఇప్పటి నుంచే వలవేస్తున్నారు. ఇతర పార్టీల నేతలతోనూ పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ఒప్పందాలకు దిగుతున్నారు. ఏతావాత ఈ ఎపిసోడ్లో రెండు సీట్లను ఎవరు గెలుచుకోవాలన్నా ఇతర పార్టీల్లో భారీ చీలికలు వస్తేనే సాధ్యం. కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ప్రకారం ఆ పార్టీకి ఒక స్థానం ఖాయంగా కనిపిస్తోంది. రెండో స్థానం విషయంలో మూడు పార్టీల మధ్య పోటీ తథ్యం. అయితే, కాంగ్రెస్ పార్టీకి సాంకేతికంగా సభ్యులున్నా.. వారిలో అత్యధికం తమ పార్టీలో చేరిపోయారని, ఫలితంగా రెండు స్థానాల్లోనూ తామే గెలుస్తామని అధికార టీఆర్ఎస్ పార్టీ ధీమాతో చెబుతోంది. టీడీపీ -బీజేపీ కూటమి కూడా తమకున్న బలంతో ఒక్క స్థానాన్ని కైవసం చేసుకోగలుగుతామని ఆశాభావంతో ఉంది. అయితే, ఇది ప్రస్తుత పరిస్థితి మాత్రమే. మూడు నెలలకాలంలో మారే పరిణామాలతో సమీకరణల్లో తేడా వచ్చే అవకాశం లేకపోలేదు. రెండింటికి ఓటు ఎమ్మెల్సీ స్థానాలకు ఓటర్లుగా ఉన్న ఎంపీటీసీ సభ్యులలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు 280, టీఆర్ ఎస్ 171, టీడీపీ 165, బీజేపీ 59, మజ్లిస్ 26, వామపక్షాలు 12, స్వతంత్రులు 52 మంది ఉన్నారు. వీరితో పాటు మున్సిపల్ కౌన్సిలర్లకు ఓటు హక్కు ఉంది. ఈ కౌన్సిలర్లలో మూడు పార్టీలకు సమానంగానే బలం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 48 డివిజన్లకు ఎన్నికలు జరగనందున.. అవి ఎన్నికల్లో పరిగణనలోకి రావు. అయితే, మొత్తం ఓట్లలో 50శాతానికి మించి ఓట్లు ఉంటే ఎన్నికలు జరపవచ్చనే నిబంధన ఉంది గనుక ఎలక్షన్లు యథావిధిగానే ఉంటాయి. దీనికితోడు జిల్లాలోని జనాభా దృష్ట్యా స్థానిక సంస్థల కోటాలో రెండో స్థానాన్ని కేంద్రం కేటాయించింది. ఈ స్థానానికి కూడా ఏకకాలంలో ఎన్నిక జరుగనుంది. ప్రతి సభ్యుడు ఈ రెండు స్థానాలకు ఓట్లు వేయాల్సివుంటుందని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రాధాన్యతాక్రమంలో ఓట్లను వేయాల్సివుంటుంది. వీటి ఆధారంగా అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు. పోటాపోటీ మండలి రేసులో నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఈ సీట్లపై కన్నేశారు. కచ్చితంగా ఒక స్థానాన్ని దక్కించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలం ఉండడంతో గెలుపుపై గంపెడాశ పెట్టుకున్న ఈ త్రయం.. ఇప్పటికే ఓటర్లను ఆకట్టుకునేందుకు పావులు కదుపుతోంది. ఎమ్మెల్సీ సమరానికి సై అంటున్న సబితమ్మ కూడా స్థానిక సంస్థల ప్రతినిధుల మద్దతు కూడగ ట్టుకునేందుకు మంతనాలు జరుపుతున్నారు. మెజార్టీ ఉన్నప్పటికీ, ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలతో పలువురు సభ్యులు కారెక్కిన తరుణంలో.. సంఖ్యాబలంలో తేడా రాకుండా టీడీపీతో పొత్తు కుదుర్చుకునే దిశగా రాయబారాలు జరుపుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఈ వ్యవహారంలో తనదైన శైలిలో వ్యూహాలకు పదునుపెడుతున్నారు. సబిత బరిలో దిగకపోతే.. పోటీలో ఉంటానని ప్రకటిస్తున్న కిచ్చన్న క్రాస్ ఓటింగ్ ‘విప్’ చెక్ పెడుతుందని ఆశిస్తున్నారు. విప్‌ను ఉల్లంఘిస్తే అనర్హత వేటు పడుతుందని, నాలుగేళ్ల పదవీకాలం ఉన్నందున సభ్యులు అంత సాహసం చేయరని కాంగ్రెస్ భావిస్తోంది. టీడీపీయే కీలకం కాంగ్రెస్, టీఆర్ఎస్లకు సమాన ఓట్లు ఉన్నప్పటికీ, మారిన సమీకరణల నేపథ్యంలో టీడీపీ-బీజేపీ మద్దతు కీలకంగా మారింది. ఈ క్రమంలో ఈ కూటమితో సయోధ్యకుఎత్తులు వేస్తున్నాయి. మద్దతు సమీకరణలో కాంగ్రెస్ ఒక అడుగు ముందుంది. ఉభయ పార్టీలు టీఆర్ఎస్ను ఉమ్మడి శత్రువుగా పరిగణిస్తున్నందున.. సీట్ల సర్దుబాటు చేసుకునే దిశగా అంత ర్గత చర్చలు సాగిస్తోంది. చెరో సీటుకు పోటీ చేయడం ద్వారా కారుకు బ్రేకులు వేయవచ్చని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేతో సంప్రదింపులు జరుపుతున్న కాంగ్రెస్.. ఈ వ్యవహారంలో అధిష్టానాన్ని ఒప్పించే బాధ్యతను ఆయనకు అప్పగించారు. తద్వారా చెరో సీటును సులువుగా గెలుచుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇరు పార్టీల సభ్యుల శిబిరాలకయ్యే ఆర్థిక భారాన్ని కూడా తానే భరిస్తానని టికెట్ రేసులో ఉన్న అభ్యర్థి చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలావుండగా, గత ఎన్నికల్లో పోటీచేయనందున ఎమ్మెల్సీసీటు ఖాయమని మాజీ మంత్రులు సబిత, చంద్రశేఖర్ భావిస్తుండగా, కేఎల్లార్ ఢిల్లీలో అధిష్టానాన్ని ఒప్పించే పనిలో పడ్డారు. కాగా, అధిష్టానం మాత్రం ఒక సీటుకే పరిమితం కావాలని సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల విషయంలో సంక్రాంతి తర్వాత హైదరాబాద్‌కు వచ్చే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ స్పష్టత ఇచ్చే అవకాశంలేకపోలేదు. -
ఆశల పల్లకి
సాక్షి, మంచిర్యాల : జిల్లాలో పదవుల కోసం పైరవీలు జోరందుకున్నాయి. ఆషాఢం ము గిసిన తర్వాత మంత్రి మండలి విస్తరణతోపాటు ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవుల నియామకాన్ని సీఎం కేసీఆర్ చేపడతారనే వార్తల నేపథ్యంలో నాయకులు హైదరాబాద్ బాటపట్టారు. మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు తప్పనిసరిగా బెర్తు దక్కుతుందనే నేపథ్యంలో ఇద్దరు ఆశావహులు ప్రయత్నం చేస్తున్నారు. తూర్పు జిల్లాకు చెందిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి మంత్రి పదవి ఖరారు అనే అభిప్రాయాలు జోరుగా వినిపిస్తున్నాయి. గిరిజన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం, మహిళా కోటాను భర్తీ చేయడం, విశాలమైన జిల్లాలో తూర్పు ప్రాంతానికి మంత్రి పదవి కేటాయించడం ద్వారా సమన్యాయం చేయడం అనే అంశాలు లక్ష్మికి కలిసిరానున్నాయి. ఇదే అమాత్య పదవి కోసం పశ్చిమ జిల్లాకు చెందిన సీనియర్ నేత అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. అయితే పశ్చిమ జిల్లాకే రెండు మంత్రి పదవులు దక్కడంతో తూర్పు జిల్లాను పట్టించుకోవడం లేదనే అపప్రద వస్తుందనే భావన, ఇప్పటికే నిర్మల్ నియోజకవర్గానికి చెందిన జెడ్పీటీసీ జెడ్పీ చైర్పర్సన్ పీఠం కేటాయించడం, ఆయన సామాజికవర్గానికి చెందిన వారు మంత్రివర్గంలో ఎక్కువ అయ్యే అవకాశాలు ఐకేరెడ్డికి ఇబ్బందిగా మారే లా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ పార్టీలో చేరే సమయంలో హామీ ఇచ్చినట్లుగా, సీఎం కేసీఆర్‌తో ఉన్న వ్యక్తిగత సంబంధాల ద్వారా మంత్రి పదవిని దక్కించుకోవచ్చని ఐకేరెడ్డి సన్నిహితులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఐకేరెడ్డికి మంత్రి పదవి దక్కనిపక్షంలో నామినేటెడ్ కోటాలో రాష్ట్రస్థాయి చైర్మన్ పదవి ఇచ్చే అవకాశాలున్నాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ మంత్రి పదవికి తన అభ్యర్తిత్వాన్ని పరిశీలించాలని పార్టీ ముఖ్యులను కలుస్తున్నారు. తూర్పు నేతకే ఎమ్మెల్సీ.. మంత్రి పదవికోసం ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తుంటే పార్టీలో పూర్వం నుంచి కష్టపడుతున్న నాయకులు తమకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని కోరుతున్నారు. తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీష్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటీవలే ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్న రాములు నాయక్‌ను జిల్లా కోటాలో పశ్చిమ వాసిగా పరిగణించే అంశం కూడా కలిసిరానుంది. మరోవైపు నిర్మల్ స్థానం నుంచి బరిలో దిగి ఓటమి పాలైన శ్రీహరిరావు ఎమ్మెల్సీ స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పదవుల పందేరానికి నాయకులు తూర్పు-పశ్చిమ జిల్లా రంగులు అద్దుతున్నారు. ఒక ప్రాంతం వైపే న్యాయం చేయడం సరికాదని, సమన్యాయం ఉండేలా చూడాలని కోరుతున్నారు. ఇదిలాఉంటే రాష్ర్టస్థాయి నామినేటెడ్ పదవుల కోసం ఇప్పట్నుంచే నేతల తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు.