‘ఎమ్మెల్యే’ ఎమ్మెల్సీపై ఉత్కంఠ | TRS candidate for the MLC seat is a thrill in the ruling party | Sakshi
Sakshi News home page

‘ఎమ్మెల్యే’ ఎమ్మెల్సీపై ఉత్కంఠ

Published Sat, May 18 2019 1:47 AM | Last Updated on Sat, May 18 2019 1:47 AM

 TRS candidate for the MLC seat is a thrill in the ruling party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శాసనమండలి వరుస ఎన్నికలతో టీఆర్‌ఎస్‌లో పదవుల పందేరం కొనసాగుతోంది. ఎన్నికలు జరుగుతున్న శాసనసభ కోటా ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరనేది అధికార పార్టీలో ఉత్కంఠ నెలకొంది. నల్లగొండ లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, మల్కాజ్‌గిరి టీఆర్‌ఎస్‌ నేత కె.నవీన్‌రావుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గతంలో ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులను ప్రకటించిన రోజునే వీరిద్దరికి ఎమ్మెల్సీ ఇవ్వనున్నట్లు ప్రకటన జారీ చేశారు. టీఆర్‌ఎస్‌ అధిష్టానం వారం క్రితం మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా మరో స్థానానికి అభ్యర్థిని ప్రకటించనుంది.

టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఈ స్థానానికి నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కె.నవీన్‌రావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మహబూబాబాద్‌ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, మాజీ స్పీకర్‌ కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల దాఖలు గడువు ఈ నెల 28తో ముగియనుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, అప్పటి సమీకరణల ఆధారంగా కేసీఆర్‌ శాసనసభ కోటా ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని అధికార పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది.

మే 31న పోలింగ్‌ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేగా ఎన్నికైన మైనంపల్లి హనుమంతరావు రాజీనామాతో ఖాళీ అయిన శాసనసభ కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక కోసం ఈ నెల 21 నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలుకానుంది. శాసనసభలో టీఆర్‌ఎస్‌కు పూర్తి ఆధిక్యత ఉన్న నేపథ్యంలో అధికార పార్టీ ఏకగ్రీవంగానే ఈ స్థానాన్ని గెలచుకోనుంది. సునాయాసంగా ఎన్నికయ్యే అవకాశం ఉన్న ఆ స్థానంలో అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు టీఆర్‌ఎస్‌ నేతల్లో ఆసక్తికరంగా మారింది.

మరో మూడు ఎమ్మెల్సీలు.. 
రాష్ట్రంలో మరో 4 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కావాల్సి ఉంది. రాములునాయక్, కె.యాదవరెడ్డి, ఆర్‌.భూపాల్‌రెడ్డిపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. వీరిలో రాములునాయక్‌ గవర్నర్‌ కోటా, కె.యాదవరెడ్డి ఎమ్మెల్యే కోటా, భూపాల్‌రెడ్డి నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా లో ఎన్నికయ్యారు. యాదవరెడ్డి, భూపాల్‌రెడ్డి పదవుల విషయం హైకోర్టు పరిధిలో ఉంది. న్యాయ ప్రక్రియ పూర్తయ్యాక ఈ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అన్ని స్థానాలు టీఆర్‌ఎస్‌కే దక్కే అవకాశం ఉంది. నిజామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గానికి ఆ ఉమ్మడి జిల్లా నుం చి ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది. గవర్నర్‌ కోటాలో ఎవరికి అవకాశం కల్పిస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది.   

మిగిలింది ఒకటే.. 
టీఆర్‌ఎస్‌ అధిష్టానం వారం క్రితం మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా మైనంపల్లి హనుమంతరావు రాజీనామాతో ఖాళీ అయిన శాసనసభ కోటా ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించనుంది.

పరిశీలనలో పేర్లు.. 
నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కె.నవీన్‌రావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మహబూబాబాద్‌ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, మాజీ స్పీకర్‌ కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు

కోర్టు ఉత్తర్వుల మేరకు.. 
యాదవరెడ్డి, భూపాల్‌రెడ్డి పదవుల విషయం హైకోర్టు పరిధిలో ఉంది. న్యాయ ప్రక్రియ పూర్తయ్యాక నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్ని కలు జరగనున్నాయి. అన్ని స్థానాలు టీఆర్‌ఎస్‌కే దక్కే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement