అప్రమత్తంగా ఉండాలని బీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయం
అభ్యర్థులు చేజారకుండా అన్ని రకాల జాగ్రత్తలు
ఎక్కడైనా అవసరమైతే తక్షణమే ప్రత్యామ్నాయం ఏర్పాటు
అధినేత కేసీఆర్‌తో భేటీ అయిన కేటీఆర్, హరీశ్‌రావు
22వ తేదీ నుంచి కేసీఆర్ బస్సు యాత్రపై కసరత్తు
‘పొలం బాట’తరహా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం
పార్టీ పర్యవేక్షణలోనే ఎన్నికల నిధుల వ్యయం
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై లోక్‌సభ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని బీఆర్‌ఎస్ పార్టీ భావిస్తోంది. పార్టీ అభ్యర్థులుగా ఖరారు చేసిన అభ్యర్థులు కొందరు చివరి నిమిషంలో ఇతర పార్టీల్లో చేరడాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఎక్కడా అభ్యర్థులు చేజారిపోకుండా చూడాలని, ఒకవేళ ఎక్కడైనా పార్టీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలులో ఇబ్బందులు ఎదురైతే వెంటనే ప్రత్యామ్నాయ అభ్యర్థులను బరిలోకి దించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది.
పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నందినగర్ నివాసంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలు, బస్సు యాత్ర షెడ్యూల్‌తో పాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై లోతుగా చర్చించారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నాటికి ఒకరిద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు కొందరు కీలక నేతలు కూడా పార్టీని వీడే అవకాశమున్నట్లు అంచనా వేశారు. ఎమ్మెల్యేలు లేదా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు పార్టీ మారిన చోట లోక్‌సభ ఎన్నికల ప్రచారం, సమన్వయ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచరణను సిద్ధం చేశారు.
గురువారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించిన అంశాలు, వాటిపై విపక్ష శిబిరం నుంచి వచి్చన స్పందనపై కూడా ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా కేసీఆర్ ఇరువురు నేతలకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిధుల వ్యయం అభ్యర్థుల చేతుల మీదుగా కాకుండా పార్టీ పర్యవేక్షణలోనే జరిగేలా చూడాలని ఆదేశించారు.
రైతాంగ సమస్యలు ఎత్తిచూపేలా యాత్ర
ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఈ నెల 22 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు చేసే బస్సుయాత్ర తీరుతెన్నులపై సుదీర్ఘంగా చర్చించారు. బస్సు యాత్ర చేయాల్సిన మార్గం, ఏయే తేదీల్లో ఏయే ప్రదేశాల్లో సభలు, వీధి మలుపు (స్ట్రీట్ కార్నర్) సమావేశాలు ఏర్పాటు చేయాలనే అంశంపై కసరత్తు చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఉదయం 11 గంటల లోపు ఇటీవల కేసీఆర్ చేసిన ‘పొలంబాట’తరహా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో రైతులు, యువత, మహిళలు, మైనారిటీలు ఇతర సామాజిక వర్గాలతో కేసీఆర్ భేటీ అయ్యేలా చేపట్టాల్సిన కార్యక్రమాల జాబితాను సిద్ధం చేశారు.
రైతాంగ సమస్యలను ప్రధానంగా ఎత్తి చూపేలా బస్సు యాత్ర ఉదయం పూట షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు. సాయంత్రం సమయంలో రెండు లేదా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రోడ్‌షోలు, మినీ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. తనతో పాటు బస్సు యాత్రలో పాల్గొనే బృందం బస, భోజన వసతి తదితరాల బాధ్యతలు స్థానికంగా ఎవరికి అప్పగించాలనే అంశంపైనా చర్చ జరిగింది. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సభలు, రోడ్‌షోలకు వచ్చే వారికి మంచినీరు, మజ్జిగ ప్యాకెట్ల సరఫరా చేయాలని నిర్ణయించారు. కాగా బస్సు యాత్ర రూట్‌మ్యాప్‌పై లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఆయా జిల్లాల నేతలు ఇప్పటికే తమ ప్రతిపాదనలు అందజేశారు. ఈ ప్రతిపాదనలను క్రోడీకరించి శనివారం సాయంత్రంలోగా కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముందని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
కాంగ్రెస్, బీజేపీల కంటేఓ అడుగు ముందే..!
లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఇప్పటివరకు జరిగిన సన్నాహక భేటీలను, కేడర్‌ను సన్నద్ధం చేసిన తీరుపై కేసీఆర్ సమీక్షించారు. సన్నాహక భేటీలు, సభల నిర్వహణ, ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్‌తో పోలిస్తే ఓ అడుగు ముందు ఉన్నట్లు అంచనాకు వచ్చారు. ఎన్నికల ప్రచారంలో విపక్ష పార్టీలు ప్రస్తావిస్తున్న అంశాలు, ఉపయోగిస్తున్న భాష తదితరాలు భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. రెండు జాతీయ పార్టీలను ఇరకాట స్థితిలోకి నెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ బస్సు యాత్ర కోసం ప్రజలకు చేరువయ్యే రీతిలో కొత్త పాటలను రికార్డు చేసే పనులు సాగుతున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. ఇలావుండగా శుక్రవారం పలువురు బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్‌ను కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment