సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టనున్న బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 22 నుంచి మే 10వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ బస్సు యాత్ర అనుమతి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌ను బీఆర్ఎస్ నాయకులు కే వాసుదేవా రెడ్డి శుక్రవారం కలిశారు.
బస్సు యాత్ర వివరాలను వికాస్ రాజ్‌కు వాసుదేవా రెడ్డి అందజేశారు. ఈ నేపథ్యంలో యాత్రకు సంబంధించి భద్రతా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యాత్రకు పోలీసుల సహకారం అందించేలా చూడాలని కోరారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలని వాసుదేవా రెడ్డి కోరారు.
కాగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ.. బీర్‌ఎస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడమే ధ్యేయంగా కేసీఆర్ లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌స హయాంలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి ద్వారా కలిగిన లబ్ధిని ప్రజలకు వివరించేలా ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం కోసం ఈనెల చివరి వారం నుంచి బస్సు యాత్ర చేయనున్నారు, సాయంత్రం సమయాల్లో ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రెండు, మూడు చోట్ల రోడ్‌షోలు ఉండనున్నాయి.
రెండు, మూడు వారాల పాటు జరిగే ఈ బస్సు యాత్రలో భాగంగా ఉదయం పూట పంట పొలాలు, కల్లాలు, కొనుగోలు కేంద్రాల సందర్శనతోపాటు వివిధ వర్గాలతో భేటీ అవుతారు. బస్సుయాత్రలో తన వెంట వచ్చే బృందానికి బస ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో లక్ష మందితో మినీ సభలు కూడా ఏర్పాటు చేద్దామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment