తెలంగాణలో పూర్వ వైభవం సాధించేందుకు గులాబీ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవానికి లోక్‌సభ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకుంటుందా? పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షలో ఏం తేల్చారు? అసెంబ్లీ స్థానాల వారీ రివ్యూల్లో ఏం తేల్చబోతున్నారు? అసెంబ్లీ ఎన్నికల ఓటమికి కారణాలుగా ఏం చెప్పబోతున్నారు? రాబోయే లోక్‌సభ ఎన్నికలకు పార్టీని ఎలా సంసిద్ధం చేయబోతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం మీద దాడి ఎలా ఉండబోతోంది?..
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై బీఆర్‌ఎస్ అగ్రనాయకులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. ముందుగా మరో మూడు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికల పరాజయానికి ప్రతీకారం తీర్చుకుని లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరేయాలని నాయకత్వం కృతనిశ్చయంతో ఉంది. పార్లమెంటు నియోజక వర్గాల వారీగా పార్టీ స్థితి గతులు బలాబలాలపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. నియోజక వర్గాల వారీగా నిర్వహిస్తోన్న సమీక్షల్లో కిందిస్థాయి కార్యకర్తలను నాయకత్వాన్ని కలవనీయకుండా కొందరు నేతలు అడ్డుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. దాన్ని నాయకులు చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు.
లోక్‌సభ నియోజక వర్గాల వారీ సమీక్షలు పూర్తి అయిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగానూ సమీక్ష జరపాలని నిర్ణయించారు. ఈ నెల 21 వరకు పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష పూర్తి కాగానే అసెంబ్లీ నియోజక వర్గాల్లో క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకర్తలను నేరుగా కలిసి పార్టీలో ఉన్న సమస్యలేంటి, లోపాలేంటి ఇటీవలి ఎన్నికల్లో ఓటమికి కారణాలేంటి? లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలవాలంటే ఏం చేయాలి? అన్న అంశాలపై ఆరాలు తీసి ఆ ఫీడ్ బ్యాక్ ఆధారంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు.
పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు, కవితలు నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకర్తలు నేతలతో భేటీలు నిర్వహిస్తారు. తుంటి ఎముక గాయంతో సర్జరీ చేయించుకున్న పార్టీ అధినేత కేసీఆర్ కోలుకున్నాక వచ్చే నెల 15 నుండి ఆయన కూడా ప్రజాక్షేత్రంలో పర్యటించి పార్టీకి దిశానిర్దేశం చేస్తారని అంటున్నారు. అదే సమయంలో రకరకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీలన్నింటినీ అమలు చేసేలా ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకురావాలని బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించుకుంది.
అవసరమైతే పోరాటాలకూ సిద్ధం కావాలని భావిస్తోంది. తక్షణ కర్తవ్యంగా లోక్‌సభ ఎన్నికల్లో పదికి పైగా స్థానాల్లో ఘన విజయాలు సాధించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాగానే మొత్తం సమీకరణలు మారిపోతాయని.. కోట్లాది మంది తెలంగాణ ప్రజలు తిరిగి బీఆర్‌ఎస్‌కే మద్దతు తెలుపుతారని నాయకత్వం నమ్ముతోంది.
Comments
Please login to add a commentAdd a comment