ప్రజలు కేసీఆర్‌నే కోరుకుంటున్నారు: కేటీఆర్‌ | Sakshi
Sakshi News home page

ప్రజలు కేసీఆర్‌నే కోరుకుంటున్నారు: కేటీఆర్‌

Published Sat, Apr 27 2024 11:12 AM

Ex Minister KTR Says BRS Will Win In Next Elections In Telangana

సాక్షి, హైదరాబాద్‌: రాబోయే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. అలాగే, తమను ఎవరెంత కించపరచినా కుంగిపోమని చెప్పుకొచ్చారు. ఎన్నో పోరాటాలతో, లక్ష్యంతో తెలంగాణ సిద్ధించిందని గుర్తు చేశారు. 

కాగా, నేడు బీఆర్‌ఎస​ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ జెండాను కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ నేతలు హాజరయ్యారు. అనంతరం, కేటీఆర్‌ మాట్లాడుతూ..‘ప్రజాస్వామ్య ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలని ఉద్యమ నేత కేసీఆర్‌ పార్టీని ఏర్పాటు చేశారు. ఎన్నో పోరాటాలతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అధికార గర్వంతో ఉన్న ఆనాటి కాంగ్రెస్‌ మెడలు వంచి రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ కృషి చేశారు. 

కుట్రలు, ప్రలోభాలతో ఉద్యమాన్ని ఆపాలని చూశారు. కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం, రాష్ట్ర అభివృద్ది సాధ్యం అని 2014లో ప్రభుత్వం వచ్చింది. ఎన్నో సమస్యల పరిష్కారం కోసం పార్టీ, ప్రభుత్వం రెండు పని చేశాయి. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రంలో మహారాష్ట్రలో కూడా పార్టీ విస్తరించింది. కానీ, దురదృష్టవశాత్తూ 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యం. ఇప్పుడు ప్రజలు మళ్లీ కేసీఆర్‌నే కోరుకుంటున్నారు. 

రాబోయే ఎన్నికల్లో మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుంది. ఎవరెంత కించపరిచినా మేము కుంగిపోము. 24ఏళ్లలో మాకు ఇచ్చిన గౌరవం, అభిమానానికి ధన్యవాదాలు. వందల మంది రాష్ర్ట సాధన కోసం ప్రాణాలు వదిలారు. మీ స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తాము’ అని వ్యాఖ్యలు చేశారు. 

Advertisement
Advertisement