సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసిపోగా, రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో 4,798 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. మొత్తం 5,716 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండగా, గజ్వేల్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 145 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. కామారెడ్డిలో సైతం 92 మంది నామినేషన్ వేయడం గమనార్హం.
మేడ్చల్ నియోజకవర్గంలో 116 మంది, ఎల్బీనగర్ నుంచి 77 మంది, మునుగోడు నుంచి 74 మంది, సూర్యాపేట నుంచి 68 మంది, మిర్యాలగూడ నుంచి 67 మంది, నల్లగొండ నుంచి 64 మంది, సిద్దిపేట నుంచి 62 మంది, కోదాడ నుంచి 61 మంది నామినేషన్ వేశారు. అత్యల్పంగా నారాయణపేట్ స్థానం నుంచి 13 మంది మాత్రమే నామినేషన్లు వేశారు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన నిర్వహించనుండగా, 15వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది.
పోస్టల్ బ్యాలెట్ కోసం 31,551 దరఖాస్తులు
పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం భారీ సంఖ్యలో ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు. దివ్యాంగులు, వయోజనులు, ఎన్నికలతో సంబంధం లేని అత్యవసర సేవల్లో ఉండే ఓటర్లు కలిపి మొత్తం 31,551 మంది పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా సిద్ధిపేట నుంచి 757 మంది, అత్యల్పంగా మక్తల్ నియోజకవర్గం నుంచి 5 మంది దరఖాస్తు చేసుకున్నారు. వయోజన, దివ్యాంగ ఓటర్లకు ఇంటి వద్దే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసేందుకు అవకాశం కల్పిం చనున్నారు.
3.26 కోట్లకు పెరిగిన ఓటర్లు
ఈ నెల 5న తుది ఓటర్ల జాబితాను ప్రకటించగా, ఆ తర్వాత వచ్చిన ఓటర్ల నమోదు దరఖాస్తులను పరిష్కరించి శుక్రవారం అనుబంధ ఓటర్ల జాబితాను ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,26,18,205కి పెరిగింది. అందులో 1,62,98,418 మంది పురుషులు, 1,63,01,705 మంది మహిళలు, 2,676 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. తొలిసారిగా మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్లకు మించిపోయింది.
15,406 మంది సర్విసు ఓటర్లు, 2,944 మంది ఓవర్సీస్ ఓటర్లున్నారు. 2023 జనవరితో పోల్చితే తాజాగా రాష్ట్రంలో 8.75 శాతం మంది ఓటర్లు పెరిగారు. 80 ఏళ్లకు పైబడిన ఓటర్లు 44,371 మంది ఉండగా, వికలాంగ ఓటర్లు 506921 మంది ఉన్నారు. 18–19 ఏళ్ల యువ ఓటర్ల సంఖ్య 9,99,667 కాగా, మొత్తం ఓటర్లలో వీరి శాతం 3.06గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment