సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గవర్నర్ కోటాలో భర్తీ చేసే సభ్యుల్లో ఖాళీగా ఉన్న రెండు స్థానాల్లో ఒకటి ఎస్సీ, మరొకటి ముస్లిం వర్గాలకు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం త్వరలోనే ఈ మేరకు సిఫార్సు చేయనుందని వైఎస్సార్‌సీపీ వర్గాలు తెలిపాయి.
► ప్రస్తుతం మండలిలో మొత్తం నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణారావు రాజీనామా చేసిన కారణంగా శాసనసభ నుంచి ఎన్నికయ్యే రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి.
► గవర్నర్ నామినేట్ చేసే కోటాలో కంతేటి సత్యనారాయణరాజు, రత్నాబాయి పదవీ కాలం ముగిసిన కారణంగా ఖాళీ అయిన రెండు స్థానాలు కొంత కాలంగా అలాగే ఉన్నాయి.
► వైఎస్ జగన్ ప్రభుత్వం మండలిని రద్దు చేయాలని నిర్ణయించినప్పటికీ పైస్థాయిలో జాప్యం కారణంగా అది ఇప్పటికీ మనుగడలో ఉంది. మండలి రద్దు విషయంలో ఎలాంటి రెండో ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఇప్పటికే శాసనసభలో మండలి రద్దుకు తీర్మానం చేసి పంపారు కూడా. అయితే మండలి మనుగడలో ఉన్నంత వరకైనా ఖాళీ స్థానాలను భర్తీ చేయాలన్న ఆలోచనతో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది.
► అందువల్ల గవర్నర్ నామినేటెడ్ స్థానాల్లో ఒకటి ఎస్సీ వర్గానికి, మరో స్థానం ముస్లిం మైనారిటీ వర్గాలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి తాజాగా యోచిస్తున్నట్టు సమాచారం.
► బోస్, మోపిదేవి రాజీనామా వల్ల ఖాళీ అయిన వాటిలో ఒక స్థానం పదవీ కాలం కేవలం 9 నెలలే ఉంది. మరో ఎమ్మెల్సీ పదవీ కాలం రెండేళ్ల పాటు ఉంటుంది. 9 నెలలే గడువున్న ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక జరిగే అవకాశం లేదు కనుక రెండేళ్ల పదవీ కాలం ఉన్న స్థానానికి కూడా అభ్యర్థిని త్వరలో సీఎం ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
గవర్నర్ కోటాలో ఎస్సీ, ముస్లిం వర్గాలకు ఎమ్మెల్సీ పదవులు!
Published Mon, Jul 13 2020 5:06 AM | Last Updated on Mon, Jul 13 2020 5:06 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment