క్రాస్‌పైనే భవితవ్యం! | district between the parties and political of the two MLC positions... | Sakshi
Sakshi News home page

క్రాస్‌పైనే భవితవ్యం!

Published Sun, Jan 11 2015 4:08 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

క్రాస్‌పైనే భవితవ్యం! - Sakshi

క్రాస్‌పైనే భవితవ్యం!

మండలిపై కసరత్తు చేస్తున్న కాంగ్రెస్
రెండు స్థానాలకు ఒకేసారి ఎన్నికలు
సంకేతాలిచ్చిన ఈసీ వర్గాలు
కీలకంగా మారిన టీడీపీ-బీజేపీ మద్దతు
సీట్ల సర్దుబాటుకు కాంగ్రెస్ ఎత్తులు

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లాలో స్థానిక సంస్థల కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం పార్టీల మధ్య రాజకీయం రంజుగా మారింది. ఎన్నికలకు రెండు, మూడు నెలలు సమయం ఉండగానే, ఆయా పార్టీల నేతలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు.

తమ పార్టీ బలం గెలుపునకు అవసరమైన మద్దతుపైనే ఆలోచనలు చేస్తున్నారు. ఈ దిశగా ఇప్పటినుంచే అంతర్గతంగా కసరత్తు ప్రారంభించారు. ఇతర పార్టీల నేతలతో తెరవెనుక మంతనాలు సాగిస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ- బీజేపీ కూటమి ఈ స్థానాలపై వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఆయా పార్టీల బలా బలాలను అనుసరించి ఇతర పార్టీల సభ్యులకు ఇప్పటి నుంచే వలవేస్తున్నారు. ఇతర పార్టీల నేతలతోనూ పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ఒప్పందాలకు దిగుతున్నారు. ఏతావాత ఈ ఎపిసోడ్‌లో రెండు సీట్లను ఎవరు గెలుచుకోవాలన్నా ఇతర పార్టీల్లో భారీ చీలికలు వస్తేనే సాధ్యం. కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ప్రకారం ఆ పార్టీకి ఒక స్థానం ఖాయంగా కనిపిస్తోంది.

రెండో స్థానం విషయంలో మూడు పార్టీల మధ్య పోటీ తథ్యం. అయితే, కాంగ్రెస్ పార్టీకి సాంకేతికంగా సభ్యులున్నా.. వారిలో అత్యధికం తమ పార్టీలో చేరిపోయారని, ఫలితంగా రెండు స్థానాల్లోనూ తామే గెలుస్తామని అధికార టీఆర్‌ఎస్ పార్టీ ధీమాతో చెబుతోంది. టీడీపీ -బీజేపీ కూటమి కూడా తమకున్న బలంతో ఒక్క స్థానాన్ని కైవసం చేసుకోగలుగుతామని ఆశాభావంతో ఉంది. అయితే, ఇది ప్రస్తుత పరిస్థితి మాత్రమే. మూడు నెలలకాలంలో మారే పరిణామాలతో సమీకరణల్లో తేడా వచ్చే అవకాశం లేకపోలేదు.
 
రెండింటికి ఓటు
ఎమ్మెల్సీ స్థానాలకు ఓటర్లుగా ఉన్న ఎంపీటీసీ సభ్యులలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు 280, టీఆర్ ఎస్ 171, టీడీపీ 165, బీజేపీ 59, మజ్లిస్ 26, వామపక్షాలు 12, స్వతంత్రులు 52 మంది ఉన్నారు. వీరితో పాటు మున్సిపల్ కౌన్సిలర్లకు ఓటు హక్కు ఉంది. ఈ కౌన్సిలర్లలో మూడు పార్టీలకు సమానంగానే బలం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 48 డివిజన్లకు ఎన్నికలు జరగనందున.. అవి ఎన్నికల్లో పరిగణనలోకి రావు. అయితే, మొత్తం ఓట్లలో 50శాతానికి మించి ఓట్లు ఉంటే ఎన్నికలు జరపవచ్చనే నిబంధన ఉంది గనుక ఎలక్షన్లు యథావిధిగానే ఉంటాయి.

దీనికితోడు జిల్లాలోని జనాభా దృష్ట్యా స్థానిక సంస్థల కోటాలో రెండో స్థానాన్ని కేంద్రం కేటాయించింది. ఈ స్థానానికి కూడా ఏకకాలంలో ఎన్నిక  జరుగనుంది. ప్రతి సభ్యుడు ఈ రెండు స్థానాలకు ఓట్లు వేయాల్సివుంటుందని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రాధాన్యతాక్రమంలో ఓట్లను వేయాల్సివుంటుంది. వీటి ఆధారంగా అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు.
 
పోటాపోటీ
మండలి రేసులో నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఈ సీట్లపై కన్నేశారు. కచ్చితంగా ఒక స్థానాన్ని దక్కించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలం ఉండడంతో గెలుపుపై గంపెడాశ పెట్టుకున్న ఈ త్రయం.. ఇప్పటికే ఓటర్లను ఆకట్టుకునేందుకు పావులు కదుపుతోంది. ఎమ్మెల్సీ సమరానికి సై అంటున్న సబితమ్మ కూడా స్థానిక సంస్థల ప్రతినిధుల మద్దతు కూడగ ట్టుకునేందుకు మంతనాలు జరుపుతున్నారు.

మెజార్టీ ఉన్నప్పటికీ, ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలతో పలువురు సభ్యులు కారెక్కిన తరుణంలో.. సంఖ్యాబలంలో తేడా రాకుండా టీడీపీతో పొత్తు కుదుర్చుకునే దిశగా రాయబారాలు జరుపుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఈ వ్యవహారంలో తనదైన శైలిలో వ్యూహాలకు పదునుపెడుతున్నారు. సబిత బరిలో దిగకపోతే.. పోటీలో ఉంటానని ప్రకటిస్తున్న కిచ్చన్న  క్రాస్ ఓటింగ్ ‘విప్’ చెక్ పెడుతుందని ఆశిస్తున్నారు. విప్‌ను ఉల్లంఘిస్తే అనర్హత వేటు పడుతుందని, నాలుగేళ్ల పదవీకాలం ఉన్నందున సభ్యులు అంత సాహసం చేయరని కాంగ్రెస్ భావిస్తోంది.
 
టీడీపీయే కీలకం
కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు సమాన ఓట్లు ఉన్నప్పటికీ, మారిన సమీకరణల నేపథ్యంలో టీడీపీ-బీజేపీ మద్దతు కీలకంగా మారింది. ఈ క్రమంలో ఈ కూటమితో సయోధ్యకుఎత్తులు వేస్తున్నాయి. మద్దతు సమీకరణలో కాంగ్రెస్ ఒక అడుగు ముందుంది. ఉభయ పార్టీలు టీఆర్‌ఎస్‌ను ఉమ్మడి శత్రువుగా పరిగణిస్తున్నందున.. సీట్ల సర్దుబాటు చేసుకునే దిశగా అంత ర్గత చర్చలు సాగిస్తోంది. చెరో సీటుకు పోటీ చేయడం ద్వారా కారుకు బ్రేకులు వేయవచ్చని అంచనా వేస్తోంది.

ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేతో సంప్రదింపులు జరుపుతున్న కాంగ్రెస్.. ఈ వ్యవహారంలో అధిష్టానాన్ని ఒప్పించే బాధ్యతను ఆయనకు అప్పగించారు. తద్వారా చెరో సీటును సులువుగా గెలుచుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇరు పార్టీల సభ్యుల శిబిరాలకయ్యే ఆర్థిక భారాన్ని కూడా తానే భరిస్తానని టికెట్ రేసులో ఉన్న అభ్యర్థి చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇదిలావుండగా, గత ఎన్నికల్లో పోటీచేయనందున ఎమ్మెల్సీసీటు ఖాయమని మాజీ మంత్రులు సబిత, చంద్రశేఖర్ భావిస్తుండగా, కేఎల్లార్ ఢిల్లీలో అధిష్టానాన్ని ఒప్పించే పనిలో పడ్డారు. కాగా, అధిష్టానం మాత్రం ఒక సీటుకే పరిమితం కావాలని సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల విషయంలో సంక్రాంతి తర్వాత హైదరాబాద్‌కు వచ్చే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ స్పష్టత ఇచ్చే అవకాశంలేకపోలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement