సాక్షి, సంగారెడ్డి: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాలతో జిల్లాలో చావు దెబ్బతిన్న టీడీపీలో అంతర్మథనం ప్రారంభమైంది. టీడీపీ-బీజేపీ కూటమి ఒక్క స్థానాన్ని గెలవలేక ఘోరపరాభవాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. 2009 ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ స్థానంలో గెలిచి జిల్లాలో పార్టీ ఉనికిని కాపాడుకున్న టీడీపీ తాజా ఎన్నికల్లో పోటీ చేసిన అన్నీ స్థానాల్లో ఓటమి పాలై జిల్లాలో తుడిచిపెట్టుకుపోయింది. జిల్లా పరిధిలోని లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే సాగింది. పటాన్‌చెరు, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా పోటీ చేసిన అన్నీ స్థానాల్లో టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థులు మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. కొందరు అభ్యర్థుల డిపాజిట్లు సైతం గల్లంతయ్యాయి.
ఎన్నికలకు ముందే టీడీపీ సీనియర్ నేతలు మైనంపల్లి హన్మంత రావు, బాబూమోహన్, పట్నం మాణిక్యం, శివరాజ్‌పాటిల్ తదితరులు గుడ్‌బై చెప్పడంతో జిల్లాలో పార్టీకి నామమాత్రంగా నిలిచింది. చాలా కాలంగా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన మైనంపల్లి వలస వెళ్లడంతో ఎన్నికల వేళ జిల్లా పార్టీ పగ్గాలు చేపట్ట గల సమర్థ నేతలు కరువయ్యారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో పెద్దగా అనుభవం లేని శశికళకు పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించారు. మరో వైపు బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో టీడీపీ రాష్ట్ర నేతగా గుర్తింపు పొందిన ఎంఏ హకీంతో పాటు మైనారిటీ నేతలందరూ మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లోకి వలస వెళ్లారు.
ఓ వైపు టీఆర్‌ఎస్ గాలితో పాటు తెలంగాణపై పార్టీ అధినేత చంద్రబాబు అనుసరించిన వైఖరి టీడీపీని బాగా దెబ్బతీసింది. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఏ మాత్రం ప్రయోజనం కలిగించలేకపోయింది. ఈ ఘోరపరాజయం వెనక గల కారణాలపై సమీక్షించేందుకు పార్టీ జిల్లా కార్యవర్గం ఈ నెల 23న మధ్యాహ్నం 12 గంటలకు గజ్వేల్లోని టీవైఆర్ గార్డెన్‌లో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్టీ జిల్లా అధ్యక్షురాలు శశికళ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పార్టీ జిల్లా కార్యవర్గంతో పాటు నియోజకవర్గాల ఇన్‌చార్జులు, రాష్ట్ర పార్టీ నాయకులు, అనుబంధ సంస్థల అధ్యక్షులు, తాజామాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీ అధ్యక్షులు పాల్గొననున్నారు.
ఘోర పరాభవంపై టీడీపీ సమీక్ష
Published Wed, May 21 2014 11:55 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement