సాక్షి, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ స్థానానికి శనివారం జరగనున్న ఉప పోరులో ఓటరు తన తీర్పు ఇవ్వనున్నాడు. ఈ మేర కు రెండు వారాలుగా పలు రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేశాయి. 14 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీలు విజయమే లక్ష్యంగా శ్రమించాయి. శనివారం ఎన్నికలు జరగనుండటంతో ఓటరు దేవుడు ఎటువైపు మొగ్గు చూపుతాడోనన్న ఉత్కంఠ ఆయా పార్టీల్లో నెలకొంది. మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో మొత్తం 15,43,075 మంది ఓటర్లు ఉండగా వీరిలో 7.79 లక్షల పురుష, 7.63 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారు.
మెదక్, నర్సాపూర్, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో మూడు చోట్ల వీరి తీర్పు కీలకం కానుంది. సంగారెడ్డి, పటాన్‌చెరు, సిద్దిపేట నియోజకవర్గాల్లో మైనార్టీ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో స్థానికేతర ఓటర్లు ఉండటంతో స్థానికేతరులు వీరు ఎటు వైపు మొగ్గు చూపుతారోనని ప్రధాన పార్టీలు ఆరా తీస్తున్నాయి. టీడీపీ-బీజేపీలు స్థానికేతర ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ప్రధాన రాజకీయ పార్టీలు మహిళలు, మైనార్టీల ఓటర్లపై ఎక్కువగా దృష్టిపెట్టాయి. కాంగ్రెస్ పార్టీ ఆశలన్నీ సంప్రదాయ ఓటు బ్యాంకుపైనే ఉంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలతోపాటు మైనార్టీలు ఉప పోరులో తమకు అండగా నిలుస్తాయని ఆ పార్టీ భరోసాతో ఉంది. టీఆర్‌ఎస్ పార్టీ తమ విజయం ఖాయమని, మెజార్టీపైనే మా దృష్టి అని చెబుతోంది. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఈ పార్టీకి పట్టు ఎక్కువగా ఉంటుంది. దీంతో మూడు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు మిగితా పార్టీల కంటే అధిక మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మిగితా నాలుగు నియోజకవర్గాల్లో సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉద్యోగులు, మైనార్టీలు తమకు అండగా ఉంటాయని ఆ పార్టీ భావిస్తోంది. ఇదిలా ఉంటే మోడీ ప్రభావం, జగ్గారెడ్డి చరిష్మా, టీడీపీ ఓటు బ్యాంకు, యువత బలం తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. దీనికితోడు స్థానికేతర ఓటర్లు తమవైపు మొగ్గుచూపుతారని ఆ పార్టీ భావిస్తోంది. అయితే ఓటర్లు ఎటు వైపు మొగ్గుచూపుతారో చూడాల్సి ఉంది.
ఓటరు ఆసక్తి చూపేనా...
మెదక్ ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుదలకు ఎన్నికల సంఘం పలు చర్యలు తీసుకుంది. గత ఏడాది 77.23 శాతం పోలింగ్ నమోదు కాగా ఈ దఫా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టింది. ఇవి ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయో వేచి చూడాలి. శనివారం ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికలు తెలంగాణలో తొలిసారి కావడం, కేసీఆర్ బరిలో ఉన్నందున ఓటర్లు ఓటేసేందుకు ఆసక్తి చూపారు. ప్రస్తుత ఉప ఎన్నికల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవటంపై ఈ పరిస్థితి ఉంటుందో లేదోనన్న సంశయం వ్యక్తమవుతోంది.
ఓటరు చూపెటో?
Published Sat, Sep 13 2014 1:23 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement